breaking news
compassionate appointments quota
-
ప్రతి పనికీ ఓ రేటు.. అంతా ఆయన ఇష్టం !
సాక్షి, తిరుపతి తుడా : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఓ అధికారి అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. ఆయన ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారి.. ఆయన చెప్పిన మాయ మాటలకే ఇన్నాళ్లు ప్రాధాన్యం లభించింది.. పూర్వ కమిషనర్ ఆ అధికారి మంచి పనోడని నమ్మి ఒకటికి రెండు ప్రధాన పోస్టుల్లో కుర్చోబెట్టారు.. ఆయన ప్రతి పనికి రేటు ఖరారు చేసి మంచిగా వెనకేసుకున్నారు.. అన్ని శాఖలను గుప్పెట్లో పెట్టుకున్నారు.. అక్కడున్న వారంతా బాబూ.. చిట్టీ ఇది నీకు తగునా అంటున్నా ఆయన ఏ మాత్రం లెక్కచేయకుండా గడచిన ఐదేళ్లుగా కార్పొరేషన్లో హల్చల్ చేస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా ఉన్న ఓ అధికారి పూర్వ కమిషనర్‌తో కొంత సన్నిహితంగా ఉన్నారు. ఇదే ఆయనకు వరంగా మారింది. అప్పటి ఎమ్మెల్యే అల్లుడుతో సన్నిహిత సంబంధాలు నెరిపిన ఆయన ఇప్పటికీ కార్పొరేషన్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యేకు పీఏగా పనిచేసిన అనుభవంతో ఆయన తిరుపతి టీడీపీ నేతలకు మరింత దగ్గరయ్యారు. వారిని మెప్పించేందుకు అడ్డంగా పనిచేశారు. తోటి అధికారులనే కాకుండా కింది స్థాయిలో కొంత మంది ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ముద్రవేసి అడుగడుగునా అడ్డుకున్నారు. టీడీపీ నేతల అండదండలు... ఉన్నతాధికారితో సాన్నిహిత్యం ఉండటంతో పాలన మొత్తం గుప్పెట్టో పెట్టుకున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను తన వద్దకు తెతిప్పించుకునే కుట్ర చేశారు. స్టేషనరీ విభాగం పని మొదలు గెజిటెడ్ హోదా కలిగిన అధికారుల నుంచి వచ్చే ఫైళ్లను తన వద్దకు తెప్పించుకునేవారు. స్టేషనరీ బిల్లులను జూనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారి చూసుకోవాలి. కానీ స్టేషనరీ కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులన్నీ ఆ అధికారే చూస్తారు. ఇందులో ఏం మతలబు ఉందో మరి. టౌన్ ప్లానింగ్‌లో బీపీఎస్ ఫైళ్లను తన వద్దకు తెప్పించుకునేందుకు ఆయన విశ్వప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. ఈ శాఖలో ఆ స్థాయి అధికారి ఉంటారు. ఆయనతో పాటు ఇద్దరు డీపీఎస్లు, గెజిటెడ్ హోదా కలిగిన ఇద్దరు అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆఫీసర్లు ఉంటారు. వీరు చూసిన ఫైళ్లను ఆపై అధికారులు పర్యవేక్షించాలి. కార్పొరేషన్ చరిత్రలో టౌన్ ప్లానింగ్ ఫైళ్లను ఓ మేనేజర్ చూసిన దాఖలాలు లేవు. అయితే సూపరింటెండెంట్ స్థాయి అధికారి మాత్రం పరిపాలన, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ ఇలా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను తన వద్దకు తెప్పించుకున్నారు. ఈ అధికారి తీరుపై సహచర అధికారులు, కింది స్థాయి అధికారులు మండిపడుతున్నారు. అనర్హులకు అందలం పూర్వ కమిషనర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రక్షాళనకు నడుం బిగించారు. ఈ బదిలీల్లో కూడా ఆ అధికారి చక్రం తిప్పారు. అర్హత ఉన్నా వారికి తీరని అన్యాయం చేశారు. ఎలాంటి అర్హతలు లేకున్నా అందలమెక్కించారు. హెల్త్ విభాగంలో 17 మందికి అర్హత లేకున్నా శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పట్టం కట్టారు. డిగ్రీ,పీజీ, ఇంటర్ విద్యార్హతలు ఉన్నవారిని స్వచ్ఛమిత్రలుగా నియమించారు. అంతకన్నా తక్కువగా ఉన్న కొందరిని కార్యాలయం నుంచి బయటకు పంపకుండా చక్రం తిప్పారు. విలీన పంచాయతీల నుంచి వచ్చిన సిబ్బందిని స్థాయి, చేస్తున్న పనితో సంబంధం లేకుండా స్వచ్ఛమిత్రలుగా పంపించారు. అర్హత లేని వారిని వర్క్ ఇన్స్పెక్టర్లుగా అందలమెక్కించారు. ఇలా అన్ని శాఖల్లో ఆయన మాటే శాసనంగా మారింది. బదిలీలు నిజాయితీగా జరిగినా ఒకరిద్దరిని దగ్గర పెట్టుకోవడంతో కొన్ని పొరబాట్లు జరిగాయని ఆ తరువాత కమిషనర్ అనేక సందర్భాల్లో చెప్పారు. కొందరికి అన్యాయం జరిగిందని, మరికొందరికి స్థాయికి మించి ప్రాధాన్యం అభించిందని గుర్తించిన ఆయన మరోసారి బదిలీలు చేపట్టాలని భావించారు. స్వచ్ఛ సర్వేక్షన్, సార్వత్రిక ఎన్నికలు రావడంతో బదిలీలకు వీలు కుదరలేదు. కారుణ్య నియామకాలకూ బేరాలు కారుణ్య నియామకాల భర్తీలో అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఉద్యోగుల పిల్లలకు అర్హత మేరకు పోస్టులు సకాలంలో ఇవ్వాలి. కారుణ్య నియామకాల ద్వారా ఐదుగురికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఆ అధికారి కరుణించకపోవడంతో నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఒక్కో ఉద్యోగానికి రెండు లక్షలు రూపాయల వరకు ఇస్తే గానీ ఫైలు ముందుకు కదలదని బేరసారాలు పెట్టారు. ఇచ్చే మామూళ్లను బట్టి పోస్టు ఉంటుంది. అడిగినంత ఇస్తే జూనియర్ అసిస్టెంట్ ఆపై పోస్టుల్లో తీసుకుంటాం. తక్కువ ఇచ్చుకుంటే బిల్ కలెక్టర్, అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తాం, ఎక్కువ మాట్లాడితే పోస్టులే ఖాళీ లేదని రాసేస్తామని బెదిరించి పంపుతున్నారు. అడిగింది ఇచ్చుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు ఫైళ్లు చేతబట్టుకుని కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. -
కారుణ్య నియామకాలు కలేనా!
ఆర్టీసీలో 1,868 కుటుంబాల నరకయాతన ప్రభుత్వం అనుమతించినా పట్టని యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన రాములు ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్.. 2011 మార్చిలో అనారోగ్యంతో మృతి చెందాడు. కారుణ్య నియామకాల కోటాలో తనకు అవకాశం కల్పించాలంటూ ఆయన భార్య ఆర్టీసీకి దరఖాస్తు చేసింది. ఆమె దరఖాస్తు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఆ పేద కుటుంబానికి ఇప్పుడు ఆసరా లేకుండాపోయింది. ఆ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి.. కొడుకు ఉన్నత చదువు.. ఈ రెండూ పెద్ద సమస్యగా మారాయి. పూట గడవటమే కష్టంగా మారిన తరుణంలో ఆమె కుట్టుమిషన్‌తో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇది ఒక్క రాములు ఇంటి దుస్థితి కాదు.. 1,868 కుటుంబాలను నరకయాతనకు గురిచేస్తున్న ఆర్టీసీ యంత్రాంగం నిర్లక్ష్యం. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు అధికారుల ఇష్టారాజ్యంతో అభాసుపాలవుతున్నాయి. కుటుంబ పెద్ద అకస్మాత్తుగా మృత్యువాత పడితే.. ఆ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో అర్హత ఆధారంగా ఆర్టీసీలో ఉపాధి కల్పించే వెసులుబాటు ఉంది. కండక్టర్, డ్రైవర్, మెకానిక్.. ఈ మూడు పోస్టుల్లో ఏదో ఓ దానిలో నియమించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిం చింది. కానీ ఆ నియామకాల విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రస్తుతం 1,868 దరఖాస్తులు కార్యాలయాల్లోనే దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ఆ కుటుంబసభ్యులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. నియామకాలు మాత్రం జరగటం లేదు. 2011 జనవరి 1వ తేదీ తర్వాత చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా కారుణ్య నియామకాలకు అనుమతి ఇస్తూ గత ఫిబ్రవరి ఏడో తేదీన ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.15ను జారీ చేసింది. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కసరత్తే మొదలు కాలేదు. అంతకుముందు చనిపోయిన కుటుం బాలకు సంబంధించి 1,120 దరఖాస్తులు అంద గా వాటిని పరిశీలించి 800 మందిని ఎంపిక చేశారు. కండక్టర్ పోస్టుకు అవసరమైన ఎత్తు లేకపోవటం, వయసు మరీ ఎక్కువగా ఉండటం, కనీస విద్యార్హత లేకపోవటం లాంటి కారణాలతో 300 దరఖాస్తులను తిరస్కరించారు. కొత్త జీవో ప్రకారం నెలలు గడుస్తున్నా కసరత్తు మొదలు కాకపోవటంతో ఆ కార్మికుల కుటుం బాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. వేలాదిగా డ్రైవర్ పోస్టుల ఖాళీ డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ (మెకానిక్) పోస్టులనే కారుణ్య నియామకాలకు కేటాయించారు. వీటికి దాదాపు మహిళలే దరఖాస్తు చేస్తున్నందున వారు డ్రైవర్, మెకానిక్ పనిని ఇష్టపడక పోతుండటంతో ఒక్క కండక్టర్ పోస్టుకే పోటీ నెలకొంది. మహిళల కోటాలో ప్రస్తుతం ఆర్టీసీలో 13 వేల మంది కండక్టర్లు పనిచేస్తున్నారు. వారికి అంతే సంఖ్యలో డ్రైవర్ పోస్టులు ఉన్నా.. ఎవరూ రాకపోవటంతో అవన్నీ ఖాళీగా ఉన్నాయి. మహిళలను డ్రైవర్లుగా నియమించే విషయంలో అధికారులు చైతన్య కార్యక్రమాలు నిర్వహించకపోవటంతో ఈ పరిస్థితి నెల కొంది.