breaking news
Commercial Pilot Training
-
వయసు 18.. వృత్తి పైలట్
కర్ణాటకకు చెందిన సమైరా హల్లూర్ 18 ఏళ్లకే కమర్షియల్ పైలట్ అయ్యింది.ఆరు రాతపరీక్షలు 200 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఆమెకు ఈ అర్హతను సంపాదించి పెట్టాయి. కొత్త ఎత్తులకు ఎగరాలనుకునే ఈ తరానికి ప్రతినిధి సమైరా.కొన్నేళ్ల క్రితం బీజాపూర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అవి భారీగా జరిగే ఉత్సవాలు. ఆ సందర్భంగా ప్రభుత్వం హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేసింది. టికెట్ కొనుక్కుంటే అలా ఊరి మీద ఒక రౌండ్ వేయొచ్చు. హైస్కూల్ చదువుతున్న సమైరాను సంతోపెట్టడానికి తండ్రి అమిన్ హల్లూర్ భార్యతో కలిసి హెలికాప్టర్ రైడ్‌కు వెళ్లారు. సమైరాకు పైలట్ పక్కన సీటు దొరికింది. హెలికాప్టర్ పైకి ఎగురుతుండగానే ఆ అనుభూతికి థ్రిల్ అయిపోయింది సమైరా. పైలట్ డ్రస్, ఆ దర్పం, హెలికాప్టర్‌ను ఎగరేస్తున్న ఆ నైపుణ్యం... అందరూ పైలట్‌ను చూస్తున్న అబ్బురమైన చూపు అన్నీ సమైరాను ఆకర్షించాయి. ఆ అమ్మాయి హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొడుతున్నంతసేపు కింద చూడకుండా పైలట్‌ను ప్రశ్నలు అడుగుతూనే ఉంది. ఆ పైలట్ సహనశీలి. సమైరా అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాడు.‘కిందకు దిగాక మాతో సమైరా ఒకటే అంది. నాన్నా... నేను కూడా పైలట్‌ను అవుతాను అని. నేను ఒక మధ్య తరగతి ఇంటీరియర్ డిజైనర్‌ని. నా భార్య టీచర్. మా అమ్మాయి అలాంటి కోరిక కోరడం మాకు ఆశ్చర్యం కలిగించింది. అలాంటి కోరిక కోరే అమ్మాయి ఉండాలి కదా అసలు. అందుకే మేము ఏమైనా సరే అమ్మాయిని పైలట్ చేయాలనుకున్నాం. మాకున్న కొద్దిపాటి ఆదాయాన్ని పొదుపు చేసి ఆమెకోసం ఖర్చు పెట్టాం‘ అంటాడు సమైరా తండ్రి అమిన్ హల్లూర్.సమైరా ముందు నుంచి కూడా బ్రైట్ స్టూడెంట్. బీజాపూర్‌లోని సైనిక్ స్కూల్స్‌లో చదువుకుంది. 17 ఏళ్లకు ఎంపీసీలో ఇంటర్ పూర్తి చేసింది. ‘కమర్షియల్ పైలట్ కావాలంటే సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ పెట్టే పరీక్షలు పాసవ్వాలి. ఆ తర్వాత ఫ్లయింగ్ అవర్స్‌లో అనుభవం ఉండాలి’ అంది సమైరా.ఇంటర్ అయిన వెంటనే సమైరా న్యూఢిల్లీలోని‘వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడెమీ’లో థియరీకి సంబంధించిన అవసరమైన కోర్సును పూర్తిచేసింది. ‘నా 18వ ఏట పూర్తయ్యే సమయానికి అవసరమైన 6 పరీక్షలను రాసి పాస్ అయ్యాను. అయితే రేడియో ట్రాన్స్మిషన్ టెక్నాలజీ పేపర్ రాయాలంటే 18 ఏళ్లు నిండాలని నియమం. అందుకని పద్దెనిమిది నిండాక ఆ పేపర్ రాసి పాసయ్యాను’ అని తెలిపింది సమైరా.బారామతిలో రెక్కలుథియరీ ఢిల్లీలో పూర్తి చేశాక విమానం నడిపే అనుభవం కోసం సమైరా మహారాష్ట్రలోని ‘కార్వార్ ఏవియేషన్ అకాడెమీ’లో చేరింది. ఆరునెలల్లో అక్కడ 200 గంటలపాటు విమానం ఎగరేసే అనుభవాన్ని సాధించింది. ‘నేను రాత్రిపూట విమానం నడపడంలోనూ మల్టీ ఇంజిన్ విమానాలు నడపడంలోనూ అనుభవం సాధించాను’ అని తెలిపింది సమైరా. ‘పైలట్లు నాకు ఎంతో సహకరించారు. వారి స్ఫూర్తితోనే 19వ ఏటలోకి అడుగు పెట్టకముందే కమర్షియల్ పైలట్‌గా అర్హత సాధించాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది’ అంది సమైరా.ఉత్తర కర్ణాటకకు స్ఫూర్తి‘ఉత్తర కర్ణాటకలో అమ్మాయిలు చదువులో వెనుకబడి ఉన్నారు. బీజాపూర్ నుంచి సమైరా అందరూ చదివి చదువు లాంటిది కాకుండా పైలట్ చదువు చదవాలనుకోవడం అతి తక్కువ వయసులో ఆ ఘనత సాధించడంతో మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఉత్తర కర్ణాటకలోని అమ్మాయిలను ఈ విషయం ఎంత ఉత్సాహపరుస్తుందో మీరు ఊహించలేరు. అమ్మాయిలు చదవాలనుకుంటే, తల్లిదండ్రులు వారినిప్రాంపోత్సహిస్తే ఫలితాలు ఇంత గొప్పగా ఉంటాయి’ అని ఆప్రాంపాంతానికి చెందిన అక్క మహాదేవి విశ్వవిద్యాలయం జర్నలిజం ఫ్రొఫెసర్ కార్కరే అన్నారు.సమైరా భుజాన రెక్కలతో రివ్వున దూసుకుపోతుంది. ఆ తార ఎందరికో ఇకపై దారి చూపనుంది. గెలుపు గాథలకు ఏ మూల ఏ ఇంట్లో మొదటి అడుగు పడుతుందో కదా. -
Maitri Patel: రైతు కూతురు.. అతిపిన్న తొలి కమర్షియల్ పైలట్..
ఆకాశంలో విమానం ఎగురుతున్న శబ్దం వచ్చిందంటే చాలు ఇంట్లో ఏ మూలన ఉన్నా.. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి విమానం కనపడినంతసేపూ గాలిలో చేతులూపుతూ సంతోషపడుతుంటారు చిన్నపిల్లలు. గుజరాత్‌కు చెందిన మైత్రి పటేల్ కూడా తనకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు తొలిసారి విమానాన్ని చూసింది. ‘అబ్బ! బలే ఉంది! ఆకాశంలో ఎంత బాగా ఎగురుతుందో అని సంబరపడడమేగాక, తను కూడా పెద్దయ్యాక విమానం నడపాలని అప్పుడే నిర్ణయించుకుంది. అనాటి కలను ఈరోజు నిజం చేసుకుని, దేశంలోనే తొలి అతి పిన్న కమర్షియల్ పైలట్‌గా నిలిచింది. సూరత్‌లోని ఓల్పాడ్ నగరానికి చెందిన మైత్రి తండ్రి కాంతీలాల్ వ్యవసాయం చేస్తున్నారు. తల్లి రేఖ బెన్ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగంలో సివిల్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కూతుర్ని ఉన్నతస్థాయిలో నిలబెట్టాలన్న తపనతో ప్రైవేటు స్కూల్లో చేర్చి ఇంగ్లీష్ మీడియంలో చదివించారు కాంతీలాల్ దంపతులు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ స్కూల్ విద్య అయ్యాక.. ఇంటర్మీడియట్లో ఉండగా మైత్రిని ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్లో చేర్పించారు. అక్కడ కెప్టెన్ ఏడీ మాణిక్ మైత్రికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో.. ఒకపక్క ఇంటరీ్మడియట్ చదువుతూనే పైలట్‌కు సంబంధించిన గ్రౌండ్ శిక్షణను పూర్తిచేసింది. శని, ఆదివారాల్లో ఎంట్రన్స్ పరీక్షకు సన్నద్ధమవుతూ అమెరికాలో పైలట్ ట్రైనింగ్ తీసుకునేందుకు అర్హత సాధించింది. ఇక్కడ వరకు అంతా సాఫీగా సాగినప్పటికీ అగ్రరాజ్యంలో పైలట్ ట్రైనింగ్ తీసుకోవడానికి కావలసినంత డబ్బు సమకూరలేదు. చిన్నప్పటి నుంచి తమ కూతుర్ని పైలట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రోత్సహిస్తున్న కాంతీలాల్... తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న స్థలాన్ని విక్రయించి మైత్రిని అమెరికాలో పైలట్ ట్రైనింగ్ కోర్సులో చేర్పించారు. పద్దెనిమిది నెలల్లో పూర్తి కావాల్సిన ట్రైనింగ్‌ను మైత్రి కేవలం పన్నెండు నెలల్లోనే పూర్తిచేసింది. చాలామంది పద్దెనిమిది నెలలు పూర్తయినా కూడా ట్రైనింగ్‌ను పూర్తిచేయలేరు. అటువంటిది ఆరునెలల ముందుగానే పైలట్ ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి అమెరికా పైలట్ లైసెన్స్‌ను పొందింది మైత్రి. దీంతో ఇండియాలోనే అతిపిన్న తొలి కమర్షియల్ పైలట్‌గా రికార్డు సృష్టించింది మైత్రి పటేల్. ఈ విషయం తెలిసిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆమెను అభినందించారు. ఏదైనా త్వరగా నేర్చుకుంటుంది.. ‘‘మైత్రి సూరత్‌లో, స్కైలైన్ ఏవియేషన్ ముంబైలో ఉంటుంది. ఒకపక్క చదువుకుంటూ, మరోపక్క పైలట్ శిక్షణ తీసుకోవడం కష్టం. అందుకే ఆమెకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాము. త్వరగా నేర్చుకునే అమ్మాయి కావడంతో... కరోనా సమయంలో కూడా పూర్తి సమయాన్ని కేటాయించి గ్రౌండ్ స్థాయి శిక్షణ పూర్తి చేసింది. అమెరికాలో 18 నెలల్లో పూర్తిచేయడానికి చాలా కష్టపడే శిక్షణను, పన్నెండు నెలల్లోనే పూర్తిచేసి దేశమంతా గర్వపడేలా చేసింది. ఇప్పుడు మైత్రి పటేల్ మహిళాభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తోంది. ఈమెను చూసి మరికొంతమంది పైలట్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అని కెప్టెన్ మాణిక్ చెప్పారు. ప్రస్తుతం మైత్రి బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపడానికి త్వరలోనే శిక్షణ తీసుకోడానికి సన్నాహకాలు చేసుకుంటోంది. ‘‘ప్రస్తుతం అమెరికా లైసెన్స్ వచ్చింది. త్వరలో దానిని ఇండియన్ లైసెన్స్‌గా మార్చుకుని ఎయిర్ లైన్స్‌లో పనిచేస్తాను. పైలట్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సాయపడతాను’’ అని మైత్రి చెబుతోంది. 19 ఏళ్ల వయసులో ఇంత గొప్ప విజయం సాధించిన మైత్రి ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. చదవండి: చెత్తబుట్టలో పడేసే సీసాలతో అందమైన షాండ్లియర్ -
Youngest Commercial Pilot: ఆమె పట్టుదల ముందు పేదరికం ఓడిపోయింది..
గుజరాత్: దేశంలోనే అత్యంత పిన్న వయసులో కమర్షియల్ పైలట్ అయిన ఘనత మైత్రి పటేల్ సొంతం చేసుకున్నారు. సూరత్‌కి చెందిన మైత్రి కేవలం 19 యేళ్ల వయసులోనే ఆకాశం అంచులను అందుకున్నారు. ‘నా ప్రయాణంలో ఎదురైన సవాళ్లన్నింటిని నా కలను నెరవేర్చుకోవడానికి పునాదులుగా మల్చుకున్నాను’ అని ఆమె మీడియాకు వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన మైత్రి, 8 యేళ్ల వయసులో మొదటిసారిగా విమానం చూశానని, అప్పుడే తాను పైలట్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 12 వ తరగతి వరకు మన దేశంలోనే చదివినా.. అనంతరం పైలట్ ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్లానని చెప్పారు. ఐతే ఈ ట్రైనింగ్‌ను కేవలం 11 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. మైత్రి తండ్రి కాంతిలాల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ సూరత్ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు పడవలో ప్రయాణికులను చేరవేస్తూ డబ్బు సంపాందించేవాడినని తెలిపాడు. విమానాలు టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వడం చూస్తూ ఉండేవాడినని, అప్పుడే తన కూతురు కూడా ఫైలట్ అయ్యి, ప్రపంచమంతా పర్యటించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తన కూతురిని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లో కూడా చేర్పించానని ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ పిన్న వయస్కురాలైన పైలట్ మైత్రి పటేల్ మాత్రం తన దృష్టి భవిష్యత్ ప్రణాళికపై కేంద్రీకరించినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆకాశంలో విహరించాలని, బోయింగ్ విమానంలో ఎగరాలని, అందుకు త్వరలోనే ట్రైనింగ్ తీసుకోబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. -
ఉజ్వల భవిష్యత్తుకు.. ఏవియేషన్
కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ప్రజల ఆదాయాల్లో పెరుగుదల, విమాన ప్రయాణ చార్జీలు తగ్గడం, వ్యాపార నిర్వహణకు సంబంధించి రాకపోకలు పెరగడం, పర్యాటక రంగ అభివృద్ధి తదితర కారణాల వల్ల విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఏవియేషన్ రంగం విస్తరిస్తూ యువతకు సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అందుబాటులో ఉన్న ఏవియేషన్ కోర్సులు, వాటిని అందిస్తున్న సంస్థలు, అర్హతలు తదితర వివరాలు.. ఏవియేషన్ రంగంలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కోర్సుకు క్రేజ్ ఎక్కువ. దీనికి ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే, అత్యున్నత వేతనంతో ఉద్యోగం పొందొచ్చు. కమర్షియల్ పైలట్ కావాలనుకునే వారికి కమర్షియల్ పైలట్ లెసైన్స్ (సీపీఎల్) తప్పనిసరి. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గుర్తింపు పొందిన సంస్థ నుంచి శిక్షణ పూర్తిచేసిన వారికి ఈ లెసైన్స్ లభిస్తుంది. తొలుత స్టూడెంట్ పైలట్ లెసైన్స్, అనంతరం ప్రైవేట్ పైలట్ లెసైన్స్, ఆ తర్వాత కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఇస్తారు. అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. ఇంటర్లో వీటిని చదవనివారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా అభ్యసించవచ్చు. ఈ కోర్సులో చేరే వారికి నిర్ణీత శారీరక, ఆరోగ్య ప్రమాణాలు ఉండాలి. అలాగే నిర్దిష్ట వయోపరిమితి కలిగి ఉండాలి. కోర్సులో ప్రవేశాలకు పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. వేతనం: కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పైలట్ ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - భువనేశ్వర్, న్యూఢిల్లీ, గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ - బెంగళూరు, రాజీవ్‌గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ - తిరువనంతపురం, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్‌బరేలీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ క్యాబిన్ క్రూ/ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఇందులో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ కోర్సుల కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది మధ్యలో ఉంటుంది. కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ (కోర్సులు: డిప్లొమా ఇన్ ఏవియేషన్, హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, డిప్లొమా కోర్స ఇన్ హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ కస్టమర్ సర్వీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్), ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ (కోర్సు: క్యాబిన్ క్రూ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ - ఎయిర్ హోస్టెస్/ఫ్లైట్ స్టీవార్‌డ). అర్హతలు: ఇంటర్/+2 పూర్తిచేసిన మహిళా, పురుష అభ్యర్థులిద్దరూ అర్హులు. ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీసెస్, ఇన్ ఫ్లైట్ ట్రైనింగ్, సేఫ్టీ అండ్ ఫస్డ్ ఎయిడ్ ప్రొసీజర్, ఫుడ్ అండ్ బేవరేజ్ ప్రొడక్షన్ అండ్ సర్వింగ్ తదితర అంశాలు నేర్పిస్తారు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.4 నుంచి రూ.6 లక్షలు ఉంటుంది. ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇది నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ. ఎయిర్‌క్రాఫ్ట్‌ల డిజైన్, రూపకల్పన, నిర్వహణ తదితరాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇది పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో చీఫ్ ఇంజనీర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్/+2 పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ఇందులో ప్రవేశాలకు అభ్యర్థులు జాతీయ/రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుంది. సంస్థలు: జేఎన్టీయూ - కాకినాడ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బీఎస్సీ ఏవియేషన్ బీఎస్సీ ఏవియేషన్ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఎయిర్ రెగ్యులేషన్స్, నేవిగేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ ఇంజిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏవియేషన్ సెక్యూరిటీ, ఫ్లైట్ సేఫ్టీ తదితర అంశాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దీన్ని పూర్తిచేసిన వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, గ్రౌండ్ ఆపరేషన్స్ స్టాఫ్, కార్గో మేనేజ్మెంట్ స్టాఫ్, టికెటింగ్ స్టాఫ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. అర్హత: ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్లతో ఇంటర్/+2. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఉన్నత విద్య దిశగా కూడా వెళ్లొచ్చు. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్; ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్‌బరేలీ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (ఏఎంఈ) కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు, ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి డీజీసీఏ.. ఏఎంఈ లెసైన్స్‌ను అందిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తనిఖీ, నిర్వహణ, సర్వీసింగ్‌పై ఈ కోర్సు ప్రధానంగా దృష్టిసారిస్తుంది. కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు పొందొచ్చు. అలాగే ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ సంస్థలు, ఫ్లయింగ్ స్కూళ్లలో కూడా ఉద్యోగాలు సాధించొచ్చు. అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. అలాగే నిర్ణీత వయోపరిమితి, వైద్య ప్రమాణాలు ఉండాలి. చివరి 6 నెలల పాటు విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయాలి. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్. బీబీఏ ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు కరిక్యులంలో ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సేఫ్టీ మేనేజ్మెంట్ తదితర అంశాలు ఉంటాయి. ఈ కోర్సును పూర్తిచేసిన వారు విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటర్, స్టాఫ్ మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించొచ్చు. అర్హత : కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూపులో ఇంటర్/+2. అందిస్తున్న సంస్థలు: ఎయిమ్ఫిల్ ఇంటర్నేషనల్ - హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్) - డెహ్రాడూన్ (బీబీఏ ఏవియేషన్ ఆపరేషన్స). వేతనం: ప్రారంభంలో 3 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఔత్సాహికులు ఎంబీఏ కూడా చేయొచ్చు. గ్రౌండ్ స్టాఫ్ మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఈ కోర్సులుంటాయి. ఏదైనా గ్రూపులో ఇంటర్ పూర్తి చేసిన వారు ఇందులో చేరొచ్చు. ఎయిర్పోర్ట్ స్ట్రాటజీ అండ్ ఫంక్షనింగ్, కార్గో మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్, స్టాఫ్ మేనేజ్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ తదితర అంశాలను ఇందులో నేర్పిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారు ప్రాంతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, కార్గో డిపార్ట్మెంట్ మేనేజర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి ఉంటుంది. అయితే ఈ కోర్సు తర్వాత ఐఏటీఏ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. కోర్సులు - అందిస్తున్న సంస్థలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఫెమిలియరైజేషన్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ (కోర్సు: ఎయిర్ కార్గో అండ్ కొరియర్ మేనేజ్మెంట్). ఇంకా ఎన్నో.. ఇవే కాకుండా డిప్లొమా ఇన్ క్యాబిన్ క్రూ అండ్ ఇన్ ఫ్లైట్ సర్వీస్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్, డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో ప్రాక్టీసెస్ అండ్ డాక్యుమెంటేషన్, డిప్లొమా ఇన్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ తదితర ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఇంటర్ విద్యార్హతతో ఈ కోర్సులు చేయొచ్చు. నల్సార్ వర్సిటీలో.. నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్)... ఏవియేషన్ అండ్ స్పేస్లా కోర్సులను అందిస్తోంది. కోర్సుల వివరాలు... ⇒ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (రెండేళ్లు) ⇒ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్పేస్ అండ్ టెలీకమ్యూనికేషన్ ‘లా’స్ (రెండేళ్లు) ⇒ పీజీ డిప్లొమా ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (ఏడాది) ⇒ పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ లా (ఏడాది) అర్హతలు: మూడేళ్ల ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు.