breaking news
CM Edappadi K. Palanisamy
-
తమిళనాడుకు పళని 'స్వామి'
► రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణం ► పళని కేబినెట్లోనూ జయలలిత టీం ► ప్రమాణం అనంతరం జయ సమాధి వద్ద నివాళి ► బెల్లం మండీ నుంచి సీఎంగా ఎదిగిన నేత ► నాడు సెంగోట్టయన్ మద్దతుదారుడు ► నేడు పళనిస్వామి కేబినెట్లో మంత్రిగా సెంగోట్టయన్ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తమిళనాడు రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ఎడపాడి కె.పళనిస్వామి ప్రమాణస్వీకారం చేశారు. సేలం జిల్లా ఎడపాడిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పళనిస్వామితో రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో గురువారం సాయంత్రం 4.39 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిం చారు. అనంతరం 30 మందిæ మంత్రులు ఒకేసారి మాతృభాష తమిళంలో ప్రమాణం చేశారు. గవర్నర్ కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమిళంలోనే ప్రమాణం చేయించడం విశేషం. నూతనంగా ప్రమాణం చేసిన మంత్రివర్గంలో సెంగోట్టయన్ మినహా మిగిలిన 29 మంది జయలలిత కేబినెట్లో పనిచేసినవారే. ఇన్నాళ్లూ ఆపద్ధర్మ సీఎంగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన పన్నీర్‌సెల్వం స్థానంలో సెంగోట్టయన్ని కేబినెట్లోకి తీసుకుని విద్యాశాఖ అప్పగించారు. మిగతా 29 మందికి జయ కేబినెట్లో ఏయే శాఖలు అప్పగించారో.. వాటినే కొనసాగించారు. ప్రమాణ స్వీకారోత్సవానంతరం జయలలిత, చిన్నమ్మకు మద్దతుగా అన్నాడీఏంకే నేతలు నినాదాలు చేశారు. ‘అమ్మ అమర్ రహే.. చిన్నమ్మకు జై’అంటూ నినదించారు. కొద్దిరోజులుగా గోల్డెన్‌బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి, 30 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ నుంచి నేరుగా మెరీనా బీచ్ వద్ద ఉన్న జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడ జయ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అదే విధంగా ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి నినాదాలు చేశారు. బలపరీక్షలో నెగ్గి అమ్మ పాలన సాగిస్తామని శపథం చేశారు. బెల్లం మండీ నుంచి సీఎంగా.. సాక్షి, చెన్నై: బెల్లం మండీతో నాడు బతుకు జీవన పయనంలో అడుగుపెట్టిన ఓ రైతు, నేడు ఓ రాష్ట్రానికి సీఎంగా అవతరించారు. ఆయనే తమిళనాడుకు 13వ సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎడపాడి కే పళనిస్వామి. ఒకప్పుడు అన్నాడీఎంకేలో సీనియర్ నేతగా చక్రం తిప్పిన సెంగోట్టయన్‌కు మద్దతుదారుడిగా రాజకీయల్లోకి అడుగు పెట్టిన పళనిస్వామి, ప్రస్తుతం ఆయన్నే మించిపోయారు. నేడు పళనిస్వామి కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా సెంగోట్టయన్ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఎడపాడి నియోజకవర్గం నుంచి గెలుస్తూ రావడంతో కే పళనిస్వామి కాస్తా ఎడపాడి కే పళనిస్వామి అయ్యారు. సేలం జిల్లా ఎడపాడి నెడుంకుళం గ్రామం శిలువం పాళయంకు చెందిన కరుప్ప గౌండర్, తవ సాయమ్మాల్ దంపతుల చిన్న కుమారుడు పళని స్వామి(63). ఈరోడ్‌లోని శ్రీ వాసవీ కళాశాలలో బీఎస్సీ(పూర్తి కాలేదు) చేశారు. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన పళనిస్వామి తండ్రి అడుగు జాడల్లో వ్యవసాయంతో పాటు బెల్లం మండీతో జీవన పయనాన్ని సాగించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. భార్య రాధ, కుమారుడు మిథున్‌లతో కలిసి ఓ వైపు బెల్లం మండీని నడుపుతూ, మరో వైపు నాగలి పట్టి పొలం పనులు చేసుకుంటూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి మంత్రి ఈరోడ్ ముత్తుస్వామి భూములు తన భూముల పక్కనే ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. అన్నాడీఎంకేలో చేరగానే, శిలువం పాళయం గ్రామ పార్టీ కార్యదర్శి అయ్యారు. 1986లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నెడుంకుప్పం పంచాయతీ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవి చూశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మరణంతో ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు పళనిస్వామికి రాజకీయంగా బలాన్ని పెంచాయి. ఈరోడ్, సేలం, నామక్కల్ జిల్లాల్లో అన్నాడీఎంకేకు కీలకనేతగా ఉన్న సెంగోట్టయన్ మద్దతుదారుడిగా జయలలిత శిబిరంలో చేరారు. సెంగోట్టయన్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఆయన మద్దతుతో పళనిస్వామి సేలం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే, అమ్మ సెంగోట్టయన్‌ను దూరం పెట్టడంతో ఆ స్థానం పళనిస్వామికి దక్కింది. అప్పటినుంచి చిన్నమ్మకు విధేయుడిగా ఉంటూ వచ్చిన పళనిస్వామిని ప్రస్తుతం సీఎం పదవి వరించడం విశేషం. అప్పట్లో పళనిస్వామి రాజకీయంగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన సెంగోట్టయన్ ప్రస్తుతం ఆయన కేబినెట్లో విద్యాశాఖ మంత్రి అయ్యారు. పార్టీ పరంగా ప్రస్తుతం సెంగోట్టయన్ ప్రిసీడియం చైర్మన్‌గా ఉన్నా, ప్రభుత్వ వ్యవహారాల్లో మంత్రుల వరసలో కూర్చోవాల్సిందే. ఇదే కేబినెట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న తంగమణి, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న కరుప్పనన్ సీఎంకు దగ్గరి బంధువులు. పళని స్వామి ఆస్తి రూ. 9.69 కోట్లు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కే పళనిస్వామి ఆస్తి రూ. 9.69 కోట్లు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఈ మేరకు తన ఆస్తిని ప్రకటించారు. ఎలాంటి అప్పులు లేవని, తన కుటుంబీకులు ఎవరి పేరిట ఎలాంటి వాహనం కూడా లేదని అందులో పేర్కొని ఉండడం గమనార్హం. రాజకీయ పయనం... ► 1989 కోడిపుంజు చిహ్నంతో ఎడపాడి నుంచి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ► 1991 అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంతో అదే నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపు. ► 1992–1996 వరకు ఆవిన్ సంస్థ అధ్యక్షుడు ► 1996 ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి ► 1998 లోక్‌సభ ఎన్నికల్లో తిరుచ్చంగోడు నుంచి తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నిక ► 1999 లోక్‌సభ ఎన్నికల్లో తిరుచ్చంగోడు నియోజకవర్గం నుంచి ఓటమి ► 1999–2004 వరకు తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ► 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి ► 2011 అసెంబ్లీ ఎడపాడి నుంచి గెలుపు. తొలిసారిగా రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి పదవి. ► 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు. ప్రజా పనులు, రహదారులు, చిన్న హార్బర్ల శాఖ కేటాయింపు ► 2017 ఫిబ్రవరి 14 అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక ► 2017 ఫిబ్రవరి 16 తమిళనాడు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం -
తమిళనాట కొత్త ఏలిక
పదిరోజులుగా తమిళనాడులో ఎడతెగకుండా కొనసాగుతున్న రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు కాస్తంత విరామం చిక్కింది. వీకే శశికళ స్థానంలో అన్నా డీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం ద్వారా గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ఆలస్యంగానైనా సరైన నిర్ణయం తీసుకున్నారు. బలనిరూపణ కోసం గవర్నర్ పక్షం రోజుల వ్యవధినిచ్చినా ఈ శనివారమే పళనిస్వామి అందుకు సిద్ధపడుతున్నారు. బహుశా సాధ్యమైనంత త్వరలో ఈ సంక్షోభాన్ని అధిగమించాలని పళనిస్వామి అను కుంటున్నారేమో. అయితే అదంత సులభమేమీ కాదు. ఒకవేళ ఈ గండం గట్టెక్కినా ఆయన పదవి పదిలం అనుకోవడానికి లేదు. సంక్షోభం సమసిపోతుంద నుకోవడానికి లేదు. నిజానికి ఈ క్షణం నుంచి అది మరింత తీవ్రమవుతుంది. స్వీయ పదవీ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన ఇక నిరంతరం నిమగ్నం కావాల్సివస్తుంది. ఎందుకంటే పట్టుమని 15మంది ఎమ్మెల్యేలు ప్రధాన విపక్షమైన డీఎంకేకు లేదా పన్నీర్‌సెల్వం పక్షానికి ఫిరాయిస్తే ప్రభుత్వం పేకమేడలా కూలి పోతుంది. ఈ గొడవలో ఆయన పాలనపై దృష్టి కేంద్రీకరించగలరా అన్నది అనుమానమే. ఫిర్యాదులొచ్చినప్పుడు పార్టీలోని వైరి పక్షాలను పిలిచి నయానో, భయానో రాజీ కుదర్చడం... అందరూ సమైక్యంగా పనిచేసేలా చూడటం నాయ కత్వ స్థానంలో ఉన్నవారు చేసే పని. అధికారంలో ఉన్నారా, విపక్షంలో ఉన్నారా అన్న అంశంతో సంబంధం లేకుండా సమర్థులైన నేతలకు అది సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి సారథ్యం వహించడం పళనిస్వామికి కొత్త. అటు శశికళకు పార్టీ నాయకత్వం మాత్రమే కాదు... పార్టీలో క్రియాశీలంగా పనిచేయడమే కొత్త. ఈలోగా ఆమెకు జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో ఆమె నియమించి వెళ్లిన నాయకత్వం సత్తా చాటగలదా? పార్టీలో అసంతృప్తులను బుజ్జగించగలదా? శశికళ కర్ణాటక జైలు నుంచి రిమోట్ కంట్రోల్‌తో పార్టీని నియంత్రించగలరా? తాను నియ మించిన నాయకులకు అండగా నిలబడగలరా? పార్టీని ఏకతాటిపై నడపగల బలమైన నాయకత్వం ఇప్పుడు అన్నా డీఎంకేకు లేదు. ఆ పార్టీ నాయకత్వ సంక్షోభంలో చిక్కుకుంది. పార్టీని తన కనుసైగలతో శాసించిన జయలలిత కనీసం కొందరినైనా విశ్వాసంలోకి తీసుకుని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని రూపొందించి ఉంటే ఈ దుస్థితి ఏర్పడేది కాదు. అభద్రతాభావమో, తన తదనంతరం పార్టీ ఏమైతే తనకేమిటన్న నిర్లిప్తతో... ఆమె అలాంటి ప్రయ త్నానికి పూనుకోలేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ మొగ్గు మొదటినుంచీ పన్నీర్ సెల్వంవైపే ఉందని స్పష్టంగా కనబడుతూనే ఉంది. అలాంటి మొగ్గు లేకపోయి ఉంటే, తన పాత్ర తటస్థమైనదేనని బీజేపీ చెబుతున్న మాట నిజమైతే పన్నీర్ స్థానంలో లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన శశికళకు వెనువెంటనే ముఖ్యమంత్రి పీఠం దక్కేది. రెండురోజులైన తర్వాతే పన్నీర్ తిరగబడ్డారని, తనను బెదిరించి రాజీనామా లేఖ తీసుకున్నారన్న ఆరోపణ చేశారని గుర్తుంచుకోవాలి. ఆ రెండు రోజులూ ఎందుకు వేచిచూడాల్సి వచ్చిందన్న అంశంలో గవర్నర్‌నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్నది గనుకే ఆయన ఆ వ్యవధి తీసుకున్నారన్న వాదనలో పసలేదు. వివిధ కేసుల్లో విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్న సీఎంలు, విచారణ సాగుతున్నా ఆ పదవిని వదలని సీఎంలు దేశంలో చాలామందే ఉన్నారు. తమిళనాడుకే ఎందుకీ మినహాయింపు? ఈ సంక్షోభం నుంచి లబ్ధిపొందాలన్న ప్రయత్నం వల్లనే ఇదంతా జరిగిందన్న కథనాలకు బీజేపీ నుంచి సంతృప్తికరమైన సంజాయిషీ లేదు. పన్నీర్‌సెల్వం పార్టీలో అందరి విశ్వాసాన్ని చూరగొని ఉంటే జయలలిత సమాధి వద్ద ధ్యానంలో నిమగ్నమైన క్షణంలోనే ఎమ్మెల్యేలంతా ఆయనవైపు క్యూ కట్టేవారు. కేంద్రంనుంచి అండదండలున్నా, తానే జయ అసలు సిసలు వార సుడినని ఎంతగా చెప్పుకున్నా శశికళ శిబిరం నుంచి నలుగురైదుగురు మాత్రమే పన్నీర్ శిబిరానికి ఫిరాయించారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు, శశికళ స్థానంలో పళనిస్వామి ఎన్నిక తర్వాత దీన్నుంచి మర్యాదగా బయటపడటానికి ఇదే అదునని కేంద్రం భావించింది. పన్నీర్‌ను పట్టుకోవడంవల్ల ఒరిగేదేమీ ఉండదని నిర్ణయించుకుంది. అందుకే తాజా పరిణామం సాధ్యపడిందన్నది వాస్తవం. పన్నీర్‌కు మెతక మనిషిగా, బోళా శంకరుడిగా పేరుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం వంటివి ఆయనకు తెలియని విద్యలు. ఎవరో చెప్పడంవల్లనో లేదా తాను అంటున్నట్టు జయ ఆత్మ ఆదేశించడంవల్లనో తిరు గుబాటు చేసినంత మాత్రాన ఆ లక్షణాలు ఇప్పటికిప్పుడు పరుగెత్తుకు రావడం కల్ల. అందుకే చేతిలో అధికార దండం ఉన్నా... నిత్యం అమ్మ నామమే జపిస్తున్నా శశికళ శిబిరంనుంచి ఎవరినీ రప్పించలేక ఆయన నిస్సహాయంగా మిగిలిపోయారు. ఇటు కొత్త సీఎం పళనిస్వామి కూడా ఆయనకు డిటో. తన ఆప్తులుగా జయలలిత భావించిన అయిదుగురిలో పన్నీర్ తర్వాత స్థానం పళనిదే. ఇద్దరు మెతక మనుషులు వైరి పక్షాల నేతలుగా మోహరించి ఉంటే సమరం ఎలా సాగుతుందో... జయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే. పళనిస్వామి తన మెతకదనం తగ్గించుకుని శశికళ ఆదేశాల మేరకు కేంద్రంతో ఘర్షణ వైఖరికి దిగాలని నిర్ణయించుకుంటే సహజంగానే పన్నీర్ సెల్వంకు అటువైపునుంచి అందుతున్న సహకారం మరింత పెరుగుతుంది. చివరికది రాష్ట్రపతి పాలనవైపు దారితీసినా ఆశ్చర్యం లేదు. ఎలా చూసినా అన్నా డీఎంకే స్థితి ఇప్పుడు గాల్లో దీపం వంటిది. సాధారణ ప్రజలంతా పన్నీర్ వైపే ఉన్నారంటున్నా... ప్రముఖ సినీ నటులు సైతం ఆయనకే మద్దతిస్తున్నా శశికళ శిబిరం ఎమ్మెల్యేల్లో కదలిక లేదు. ఉప ఎన్నికలొచ్చి ఎవరి బలమెంతో నిర్ధారణయ్యేవరకూ వారిలో చాలామంది ఉన్నచోటే ఉంటారు. పదవుల కోసం పోటీ ముదిరితే అంతకుముందే ఏమైనా జరగొచ్చు. ఏదేమైనా ప్రజలకు మెరుగైన పాలన అందాలని, రాష్ట్రంలో సుస్థిరత ఏర్పడాలని ఆశిద్దాం.