పోలీసుల అదుపులోఎన్నికల బుకీలు
11.17 లక్షల నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం
గుంతకల్లు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలు సహా మొత్తం ఐదుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.11,17,500 నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంతకల్లు డీఎస్పీ సీహెచ్.రవికుమార్ వివరాలు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్ నిర్వహిస్తున్న బుకీలు ఉరవకొండ నియోజకవర్గం జనార్దనపల్లికి చెందిన సుధాకర్, గుంతకల్లుకు చెందిన నారాయణతో పాటు బెట్టింగ్స్ కట్టిన అనంతపురానికి చెందిన సూర్యనారాయణ, ప్రసాద్, కర్నూలు జిల్లా పెరవలి గ్రామస్తుడు రాజేష్చౌదరిని అరెస్టు చేశారు.
ఉరవకొండ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతాడు? సీమాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఏది? అనే అంశాలపై బుకీలు ఫోన్లలోనే బెట్టింగ్స్ నిర్వహిస్తుండడంతో.. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ రాగిరి రామయ్య, సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇద్దరు బుకీలు, ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రాయలసీమ స్థాయిలో ప్రప్రథమంగా రాజకీయ బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు.