సెక్స్‌డాల్‌తో నవ యువకుడి పెళ్లి
బీజింగ్: పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో మరచిపోలేని మధురానుభూతి అంటారు. చైనాకు చెందిన 28 ఏళ్ల అందమైన యువకుడు కూడా పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాడు. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది. ఇంతలో ఆ యువకుడికి టెర్మినల్ క్యాన్సర్ (ప్రాణాంతక క్యాన్సర్) ఉన్నట్టు బయటపడింది. ఎంతో కాలం బతకడని కూడా డాక్టర్లు తేల్చారు. దాంతో పెళ్లి చేసుకున్నాకే తనువు చాలించాలనుకున్నాడు ఆ యువకుడు.
పెళ్లి చేసుకోవడానికి దయతలచి మానవత్వంతో ఎవరు ముందుకొచ్చినా వారి జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుందని ఆ చైనా యువకుడు భావించాడు. చివరకు సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకోవాలని తీర్మానించాడు. బంధు, మిత్రుల సహకారంతో ముహూర్తం పెట్టుకున్నాడు. అప్పటికే ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న బొమ్మను పెళ్లి కూతురును చేశారు. షాపింగ్‌కు వెళ్లి పెళ్లి కూతురు దుస్తులు, నగలు, నట్ర కొనుక్కొచ్చారు.
బంధు, మిత్రులు మేకప్ ఆర్టిస్ట్‌ను, ముత్తయిదువులను పిలిపించి పెళ్లి కూతురును ముస్తాబు చేశారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి ఘనంగా జరిపించారు. అనంతరం పెళ్లి కూతురుతో పెళ్లి కొడుకు ఫొటోలను ప్రత్యేకంగా తీశారు. ఎత్తై పెళ్లి పీటపై ధగధగలాడుతున్న రత్నకచిత కిరీటంతో, పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న సెక్స్ డాల్ ముందు మొకాళ్లపై వంగి సున్నితమైన ఆమె మునివేళ్లను చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా పెళ్లి కొడుకు ముద్దాడుతున్న దృశ్యాలను కెమెరాలతో చిత్రీకరించారు. మధుర జ్ఞాపకంగా మిగిలిపోయేలా మరిన్ని ఫొటోలను తీశారు. అనంతరం వారిని ఏకాంతంగా వదిలేసి బంధు, మిత్రులు వెళ్లి పోయారు.
ఇప్పుడు ఈ పెళ్లి ఫొటోలు చైనా సోషల్ వెబ్సైట్లో చెక్కర్లు కొడుతున్నాయి. వాటిని లక్షలాది మంది వీక్షిస్తున్నారు. అయితే ముందుగా ఈ ఫొటోలను ప్రచురించిన చైనా వెబ్సైట్ పెళ్లి కొడుకు వివరాలను మాత్రం వెల్లడించలేదు.