Chennakesava Swamy Temple
-
ప్రకాశం జిల్లా : కన్నుల పండువగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం (ఫొటోలు)
-
నూటొక్క దేవళాల శిల్పగిరి
∙సాహెబ్ జాన్, ఆలూరు రూరల్ఒకనాటి శిల్పగిరి గ్రామమే నేటి చిప్పగిరి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామంలో ఆనాటి కాలంలో నూటొక్క దేవాలయాలు ఉండేవి. నూటొక్క బావులు ఉండేవి. పురాతన ఆలయాలకు, చారిత్రక శిల్పకళా వైభవానికి నిలయంగా ఉండటంతో ఈ గ్రామానికి శిల్పగిరి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు చిప్పగిరిగా మారింది. ఆనాటి ఆలయాల్లో దాదాపు తొంభై శాతం కనుమరుగైపోగా, పది శాతం ఆలయాలు మాత్రమే ఇప్పటికి మిగిలి ఉన్నాయి.మిగిలి ఉన్న వాటిలో ఐదో శతాబ్ది నాటి దిగంబర జైన ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.ఇక్కడి ఆలయాల్లో భోగేశ్వర ఆలయం ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా వేసవిలో చిప్పగిరి గ్రామంలో పర్యాటకుల హడావుడి కనిపిస్తుంటుంది. ఇక్కడి పురాతన ఆలయాలను, చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు.రాయల వంశానికి చెందిన గుండప్ప దేవర పదకొండో శతాబ్దంలో శిల్పగిరిని రాజధానిగా చేసుకుని, పరిపాలన సాగించాడు. ఆయన హయాంలోనే ఇక్కడ చెన్నకేశవ స్వామివారి ఆలయంతో పాటు మరో వంద ఆలయాలను నిర్మించారు. తాగునీటి కోసం నూటొక్క బావులు తవ్వించారు. గుండప్ప దేవర తదనంతరం రామరాయలు, బుక్కరాయలు పన్నెండో శతాబ్దిలో ఇక్కడ భోగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా యాభై అడుగుల ఏకశిలా స్తంభాలతో రంగ మండపాన్ని నిర్మించారు. దీనినే ‘సభా సింహాసన కట్ట’ అంటారు.రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతంలో మరికొన్ని బావులను కూడా తవ్వించారు. తర్వాతి కాలంలో ఇక్కడ నీటి ఎద్దడి బాగా పెరిగింది. బావులలో నీరు ఇంకిపోయింది. గ్రామస్థులు చిప్పలతో నీళ్లు తోడుకునేవారు. అందువల్ల ప్రజలు చిప్పగిరిగా గ్రామానికి నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పాలన కొనసాగించలేక రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. పల్లవుల జైనాలయంపల్లవ రాజులు ఐదో శతాబ్ది కాలంలో ఇక్కడ జైన ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో దేశ పర్యటనకు బయలుదేరిన పల్లవ రాజులు మార్గమధ్యంలో ఈ గ్రామ పరిసరాల్లో విడిచి చేసి, కొంతకాలం గడిపారు. అప్పట్లోనే వారు ఈ గ్రామ శివార్లలో ఉన్న కొండపై కోటను నిర్మించుకున్నారు. అక్కడే ఏకశిలతో దిగంబర జైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. కాలక్రమంలో కోట దెబ్బతినగా, కోట గోడలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి.విజయదాసుల కట్టకర్ణాటకకు చెందిన విజయదాసులు పద్నాలుగో శతాబ్దిలో మాన్వి జిల్లాలో తుంగభద్ర తీరాన ఉన్న చిలకలపర్వి గ్రామంలో జన్మించారు. కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసుకు శిష్యుడు విజయదాసులు. ఆయన ధ్యాన గానాలలో నిమగ్నమై, దేశమంతటా సంచరించేవాడు. ఒకసారి ఆయన చిప్పగిరిలోని పురాతన బావిలో దైవచింతనలో ఉండగా, బావిలో ఆయనకు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికింది. ఆయన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, రెండేళ్ల తర్వాత పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ప్రతి ఏటా నవంబర్ నెలలో పదకొండు రోజుల పాటు విజయదాసుల కట్టలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి పురోహితులు ఈ ఆరాధనోత్సవాలకు తరలి వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు జరుపుతారు. వీటిని తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. -
రణక్షేత్రంలో ఉప్పొంగిన ఉత్సాహం.. వైభవంగా వీరారాధనోత్సవాలు
పల్నాటి రణక్షేత్రం కారంపూడి కత్తిగట్టి కదంతొక్కిందా.. వీరావేశంతో నాగులేరు ఉవ్వెత్తున ఉప్పొంగిందా.. బ్రహ్మనాయుడి ఉగ్రనృసింహకుంతం సమరనాదం మోగిస్తూ ముందుకురికిందా.. పల్నాటి పౌరుషాగ్నిని రగిలించిందా.. అన్నట్టు పోరాటాల పురిటిగడ్డ పల్నాడు గర్జించింది. వీరారాధనోత్సావాలతో ప్రతిమదీ పులకించింది. వీరుల కొణతములతో వీరంగమాడింది. కారంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాల రెండో రోజు రాయబారం ఘట్టం వైభవంగా జరిగింది. వీరాచారవంతులు వీరుల కొణతములతో కదంతొక్కారు. ఎదురు రొమ్ములపై బాదుకుంటూ కత్తిసాము చేశారు. వీరుల గుడిలో కొలువుదీరిన ఆయుధాలకు పూజలు చేశారు. రెండుగంటల పాటు కత్తుల సేవ చేశారు. అనంతరం గ్రామోత్సవానికి బయలు దేరారు. వీరులు కొందరు వీరావేశంతో ఊగిపోతుంటే బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం వారిపై వాలి ఓదార్చే ఘట్టం అబ్బురపరిచింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం బయట, బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయంలో వీరాచారవంతులు కత్తి సేవ చేశారు. చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఉగ్ర రూపులై ఉత్సవంలో పాలుపంచుకున్నారు. చెన్నకేశవుని దీవెనలు పొంది చెన్నకేశవస్వామి, అంకాలమ్మ చెంతకు ఒక్కో ఆచారవంతుడు ఆయుధంతో వెళ్లి వారి దీవెనలు పొందారు. గంటలు గణగణ మోగిస్తూ జై చెన్నకేశవ అంటూ నినదించారు. గోవింద నామస్మరణలు చేశారు. అనంతరం పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటి వద్దకు చేరుకుని అక్కడ కొద్ది సేపు కత్తి సేవ చేశారు. రణక్షేత్ర వీధులు సంప్రదాయ డోలు, వీరు జోళ్ల వాయిద్యాలు, సన్నాయి మేళాలతో మార్మోగాయి. ఆయుధాలతో వీరులు చేసిన గ్రామోత్సవం ఆద్యంతం నాటి పోరాటాన్ని కళ్లకుకట్టింది. వీరుల గుడి నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా చెన్నకేశవస్వామి, అంకాలమ్మ ఆలయాలకు చేరుకుని కోట బురుజు మీదుగా పీఠాధిపతి ఇంటి వరకు, అక్కడి నుంచి మళ్లీ వీరుల గుడి వరకు గ్రామోత్సవం కొనసాగింది. వీరుల ఆయుధాలకు కారంపూడి ప్రజలు నీరాజనాలు పలికారు. వారుపోసి కొబ్బరి కాయలు కొట్టి ఆశీస్సులు పొందారు. ఆయుధాలకు పంచామృతాభిషేకాలు పల్నాటి వీరాచారవంతులు పల్నాటి రణక్షేత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే వారు తొలుత తలనీలాలు సమర్పించి నాగులేరులో స్నానం చేశారు. నాగులేరు గంగధారి మడుగులో ఆయుధాలను శుభ్రం చేసుకున్నారు. కొందరు పంచామృతాలతో వీరుల ఆయుధాలను నాగులేరులో అభిషేకించడం విశేషం. నూతన వస్త్రాలతో పూజ కట్టుకున్నారు. వీరంతా ఒకేసారి ఆయుధాలను వీరుల గుడిలో ఉంచి పొంగళ్లు చేసుకుని వీర్ల అంకాలమ్మ, చెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. గురువారం తెల్లవారు జాము వరకు కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరాచారవంతులు వస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా మరికొందరు రానున్నారు. రాయబారం కథాగానం రెండో రోజు రాయబారం చారిత్రక ఘట్టం నేపథ్యంలో వీరుల గుడిలో రాత్రి అలరాజు రాయబారం కథాగానాన్ని వీరవిద్యావంతులు గానం చేశారు. వేదనాభరితమైన ఈ ఘట్టం గుండెలను పిండేసింది. మందపోరు ఘట్టం.. చాపకూడు పల్నాటి వీరారాధనోత్సవాలలో 3వ రోజు శుక్రవారం మందపోరు ఘట్టం జరగనుంది. ఈ రోజు బ్రహ్మనాయుడు చాపకూడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు పది వేల మంది సహపంక్తి భోజనాలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ చేయూతతో ఈ కార్యక్రమం జరుగుతోంది. -
తెలుగింటికి వెలుగొచ్చింది
కడప కల్చరల్: ఇక కనిపించదనుకున్న తొలి తెలుగు శాసనం బండను పరిశోధకులు కనుగొన్నారు. కళ్లెదుటే కనిపిస్తున్నా బండపై అక్షరాల అస్పష్టత కారణంగా ఇప్పటివరకు దాన్ని గుర్తించలేకపోయారు. అయినా.. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించి తెలుగు వారి కలలను సాకారం చేశారు. తెలుగుభాష ప్రాచీనతను స్పష్టం చేసే ఆధారం లభించడంతో వైఎస్సార్ జిల్లా వాసులు సంబరాలు చేసుకుంటుండగా.. ప్రపంచంలోని తెలుగు భాషాభిమానులంతా ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు. మూల శాసనం లభ్యమైంది క్రీ.శ. 575లో వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కల్లమలలో రేనాటి పాలకుడైన ధనుంజయుడు వేయించిన తొలి తెలుగు శాసనం ఉన్నట్టు చరిత్ర పరిశోధకులు ఎప్పుడో స్పష్టం చేశారు. కానీ.. దాని నకలు (ఎస్టామ్ పేజ్) మాత్రమే లభ్యమైంది తప్ప దానికి మూలమైన శాసనం గల బండ మాత్రం కనిపించ లేదు. నకలు తీసిన సమయంలోనే ఆ రాతిని చెన్నైలోని పురావస్తు మ్యూజియానికి చేర్చారనే ప్రచారం సాగింది. తెలుగు భాషాభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావుల బృందాలు ఆ మ్యూజియానికి వెళ్లి శాసనం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శాసనం బండ దొరక్కపోవడంతో నకలుతోనే సరిపెట్టుకుంటూ వచ్చారు. బయట పడిందిలా.. కొన్నేళ్ల క్రితం భారత పురావస్తు శాఖ ఎపీగ్రఫీ విభాగం డైరెక్టర్ చెవుకుల అనంత పద్మనాభశాస్త్రి తొలి తెలుగు శాసనాన్ని కల్లమలలో తాను 1975 ప్రాంతంలో చూశానని, దాన్ని ధ్రువీకరించుకుని జాగ్రత్త చేయాలని సూచించారు. నాటినుంచి పరిశోధకులు శోధన ప్రారంభించారు. శాస్త్రీయంగా ముందుకు సాగారు. శాసనాన్ని గుర్తించినా అప్పటికే ఆ బండపై గల అక్షరాలు కనిపించని స్థాయిలో ఉన్నాయి. భక్తులు, యోగులు ఆ బండ విలువ తెలియక దానిపై కూర్చోవడం, పచ్చడి నూరుకోవడంతో అక్షరాలు అరిగిపోయి అస్పష్టంగా మారాయి. దీంతో అది తొలి తెలుగు శాసనం కాదని అంతా కొట్టిపడేశారు. ఆ బండ ఎప్పుడో చెన్నై మ్యూజియానికి చేరిందని గట్టిగా వాదించారు. వాస్తవానికి అంతవరకు తొలి తెలుగు శాసనంగా భావించిన ఎర్రగుడిపాడు శాసనాన్ని బ్రిటిషర్లు చెన్నై మ్యూజియానికి చేర్చారు. కానీ.. ఆ తర్వాత కల్లమల శాసనమే తొలి తెలుగు శాసనమేనని స్పష్టమైనా అది చెన్నైకి చేరిందన్న ప్రచారం మాత్రం ఆగలేదు. రెండిటికీ తొలి తెలుగు శాసనంగా గుర్తింపు ఉన్నా శాస్త్రీయ పరిశోధనల్లో ఆ తర్వాత కల్లమల శాసనమే మొదటిదని స్పష్టమైంది. కాగా, కల్లమలలోని తొలి తెలుగు శాసనం అక్కడి చెన్నకేశవస్వామి ఆలయంలోనే ఉందని శాసన పరిశోధకులు డాక్టర్ అవధానం ఉమామహేశ్వరశాస్త్రి ద్వారా తెలుసుకున్న తెలుగు వీరాభిమాని, రాష్ట్ర ఉపాధ్యాయ ఐక్యవేదిక అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి ఆ శాసనం బండకు రక్షణ కల్పించేలా మంటపం కట్టించాలని భావించారు. పరిశోధకులు ఉమామహేశ్వరశాస్త్రి, శ్రీనివాసులురెడ్డి, ప్రొఫెసర్ సాంబశివారెడ్డి, మరికొందరు భాషాభిమానులు, పరిశోధకులతో కలిసి శనివారం కల్లమల వెళ్లి మరోసారి అక్షరాలను పోల్చుకుని అవి కాల ప్రభావంతో అస్పష్టంగా మారినా శాస్త్రీయంగా అదే తొలి తెలుగు శాసనమని మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయం మరునాటికి విస్తృతంగా ప్రచారమైంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిలో ఆనందం వెల్లివిరిసింది. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాహిత్యం, చరిత్రపరంగా ఉన్న ఎన్నో సందేహాలకు సమాధానం ఇవ్వనుంది. ప్రబలమైన సాక్ష్యం లభించింది ఎర్రగుడిపాడు శాసనం తొలి తెలుగు శాసనమని కొన్నాళ్లపాటు ప్రచారం జరగ్గా.. అది అప్పట్లోనే చెన్నై మ్యూజియానికి చేరింది. కొన్నేళ్ల తర్వాత కల్లమల శాసనమే తొలిదని స్పష్టమైంది. దీంతో చెన్నైకి చేరింది కల్లమల శాసనమని అందరూ పొరపాటుపడ్డారు. దశాబ్దకాలంగా నేను ఆ బండ కలమలలోనే ఉందని చెబుతూ వచ్చినా నమ్మేవారు కరువయ్యారు. ఇప్పుడు శాస్త్రీయంగా మరోమారు చెప్పడంతో విస్తృతంగా ప్రచారం జరిగి ఈ విషయంలో స్పష్టత వచ్చింది. – అవధానం ఉమామహేశ్వరశాస్త్రి సంతోషంగా ఉంది తొలి తెలుగు శాసనం బండ కల్లమలలో లేదని తెలిసి భాషాభిమానిగా మొదట్లో ఎంతో బాధపడ్డాను. కానీ పరిశోధకులు ఉమామహేశ్వరశాస్త్రి ఆ బండ కల్లమలలోనే ఉందని మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్ర అధికారి వాడ్రేవు చినవీరభద్రుడు ఇటీవల కల్లమల శాసనాన్ని పరిశీలించి దాన్ని పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయాలని సూచించారు. దీంతో ఆ శాసన బండ గురించి స్పష్టత ఇవ్వాలని పరిశోధకులను కోరారు. స్థానిక భాషాభిమానుల సహకారంతో వారితో కలిసి కల్లమల వెళ్లి ఆ బండను గుర్తించడంతో సంతోషం కలిగింది. – ఒంటేరు శ్రీనివాసులురెడ్డి -
ఘనంగా చెన్నకేశవస్వామి ఉత్సవాలు
రాజుపాలెం (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం వెల్లాల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ, సంజీవరాయస్వామి ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం వైభవంగా స్వామి వారి పల్లకీ సేవ కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై పల్లకీలో ఊరేగారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, ఎస్సైలు పాల్గొన్నారు. -
చెన్నకేశవస్వామిని దర్శించుకున్న వైఎస్ జగన్