breaking news
Central Urban Development
-
తెలంగాణ మెట్రో కారిడార్‌కు రూ.8,453 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2017 మెట్రో రైల్ పాలసీలో భాగంగా 50:50 ఈక్విటీ షేర్ పద్ధతిలో రూ.8,453 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరినట్లు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడించారు. మెట్రోకారిడార్ సాయం ఏమైందని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదేవిధంగా రాయదుర్గం స్టేషన్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,105 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెట్రో ప్రాజెక్టు విషయం కూడా తమ దృష్టిలో ఉందని తెలిపారు. ఎన్‌హెచ్–65లో 6 లేన్లు అవసరం లేదు ప్రస్తుతం నందిగామ సెక్షన్లో నాలుగు లేన్లు సరిపోతాయి లోక్‌సభలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల ప్రశ్నలకు కేంద్రమంత్రి గడ్కరీ జవాబు ఇచ్చారు. ఎన్‌హెచ్-65లో 6 లేన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్–విజయవాడ ఎన్‌హెచ్-65పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. -
జనవరి 4 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్
-
జనవరి 4 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్
సాక్షి, హైదరాబాద్: పారిశుద్ధ్య స్థితిగతులపై మధింపు జరిపి ర్యాంకులు కేటాయించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వచ్చే ఏడాది జనవరి 4 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ –2018ను నిర్వహించనుంది. మార్చి చివరితో ఈ సర్వే ముగియనుంది. గతేడాది దేశ వ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాల్లో ఈ సర్వేను నిర్వహించి ర్యాంకులు కేటాయించగా, ఈ సారి దేశ వ్యాప్తం గా అన్ని నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్–2017లో జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ 22, వరంగల్ 28, సూర్యాపేట 30, సిద్దిపేట 45వ ర్యాంకులను సాధించాయి. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలు గత సర్వేలో 200 పైనే ర్యాంకులు సాధించాయి. దీంతో వచ్చే జనవరి నుంచి ప్రారంభం కానున్న సర్వేకు రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధిం చేందుకు అమలు చేయాల్సిన సంస్కరణలు, చేయాల్సిన పనులను వచ్చే తక్షణమే చేపట్టాలని రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. నిర్దేశించిన పనులు చేపట్టేందుకు నిధులు లేని మునిసిపాలిటీలు సంబంధించిన పనులకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తామని పురపాలక శాఖ సూచించింది. పురపాలికల నివేదికలే కీలకం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు మునిసిపాలిటీలు కేంద్ర పట్టణా భివృద్ధి శాఖకు సమర్పించే నివేదికలే కీలకం కానున్నాయి. ఈ సర్వేను మూడు భాగాలుగా విభజించి నిర్వహించనుండగా, తొలి భాగం కింద మునిసిపాలిటీలు సమర్పించే నివేదికలకు 900 మార్కులు, రెండో భాగం కింద సర్వే నిర్వహణ ఏజెన్సీలు నేరుగా పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులను పరిశీలించి మదింపు జరపడం ద్వారా 500 మార్కులు, మూడో భాగం కింద స్థానిక పౌరుల నుంచి స్వీకరించే అభిప్రాయాల ఆధారంగా 600 మార్కులను కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో మునిసిపాలిటీలు సమర్పించే పారిశుద్ధ్య నివేదికలను పకడ్బందీగా రూపొందించాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. ఇదిలా ఉండగా, మొత్తం 2,000 మార్కుల్లో.. నగర, పట్టణ ప్రాంతాల్లో చెత్తసేకరణ, రోడ్లను ఊడ్చటం, చెత్త రవాణాకు తీసుకుంటున్న చర్యలకు 40% మార్కులు, మునిసిపల్ వ్యర్థాల నిర్వహణ, చెత్త నిర్మూలన చర్యలకు 20%మార్కులు, బహిరంగ మల విసర్జన నిర్మూలన, టాయిలెట్లకు 30% మార్కులు, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పనకు తీసుకుంటున్న చర్యలకు 5% మార్కు లు, సంస్థాగత నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్ ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్ వినియోగించుకుంటు న్న తీరుకు 5% మార్కుల్ని కేటాయిస్తారు. కేంద్ర సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ మదింపు జరగనుంది. -
పార్లమెంటుకు కొత్త భవనం!
ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం ♦ శిథిలావస్థకు చేరుతోంది ♦ సిబ్బంది పెరిగారు, కార్యకలాపాలు పెరిగాయి ♦ అవసరాలకు తగ్గట్లు స్థలం లేదు ♦ ఆధునిక సాంకేతికతకు తగ్గట్లు నిర్మించండి ♦ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ న్యూఢిల్లీ: మనకు అధునాతన సాంకేతిక వసతులతో కూడిన కొత్త పార్లమెంటు భవనం వచ్చే అవకాశముంది. ఈమేరకు వచ్చిన ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు. 88 ఏళ్ల కిందట నిర్మించిన ప్రస్తుత పార్లమెంటు భవనం శిథిలావస్థకు చేరుకునేలా ఉందని, దీనికితోడు పెరుగుతున్న అవసరాలకు సరిపడా స్థలం అందుబాటులో లేదని ఆమె పేర్కొన్నారు. కొత్త భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు రాసిన లేఖలో కోరారు. దీనికోసం ఆమె రెండు ప్రత్యామ్నాయ స్థలాలను సూచించారు. ఒకటి, ప్రస్తుత పార్లమెంటు కాంప్లెక్స్‌లో, ఇంకొక స్థలాన్ని రాజ్‌పథ్‌కు అటు వైపు సూచించారని విశ్వసనీయ వర్గాలు పీటీఐ వార్తాసంస్థకు తెలిపాయి. దీనిపై పట్టణాభివృద్ధి శాఖ నోట్ రూపొందిస్తుందని, తదనంతరం దీన్ని కేబినెట్ పరిశీలిస్తుందని చెప్పాయి. కొత్త భవనం అవసరాల గురించి చెబుతూ స్పీకర్ పలు కారణాలను లేఖలో పొందుపరిచారు. 2026 నాటికి ఆర్టికల్ 81లోని క్లాజ్ (3) మేరకు జనాభా ప్రాతిపదికన లోక్‌సభలోని సీట్ల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభలో సీట్ల సామర్థ్యం 550 ఉండగా, ఈ సంఖ్య పెరిగితే అందుకు తగిన స్థలం సభలో లేదు. ప్రస్తుత భవనం 1927లో నిర్మితమైందని, అప్పుడు ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, మీడియా సందర్శకులు, పార్లమెంటు కార్యకలాపాలు పరిమితంగా ఉండేవని, అయితే కాలం గడిచేకొద్దీ ఇవన్నీ పలు రెట్లు పెరిగాయని ఆమె పేర్కొన్నారు. కమిటీలు, భద్రతా అవసరాలు పెరిగిపోయాయని, స్థల అవసరాల డిమాండ్లు చాలా రెట్లు పెరిగాయంటూ కొత్త భవన నిర్మాణ అవసరం ప్రాధాన్యతను వివరించారు. దీంతోపాటు కొత్తపుంతలు తొక్కుతున్న ఆధునిక సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని ఎంపీలకు సరికొత్త గ్యాడ్జెట్లను అందుబాటులోకి తీసుకురావాలని, కాగితరహిత పార్లమెంటుగా మార్చేందుకు ప్రణాళికలున్నాయని స్పీకర్ తెలిపారు. అలాగే లోక్‌సభ చాంబర్‌ను రీడిజైనింగ్ చేయాలని, సిట్టింగ్ ఏర్పాట్లను పునరుద్ధరించాలన్నారు. ఇప్పుడున్న భవనం ‘హెరిటేజ్ గ్రేడ్ -1’ కింద ఉందని, అందువల్ల నిర్మాణాత్మక మరమ్మతులు, ఆధునీకరణలకు చాలా పరిమితులున్నాయని చెప్పారు. ప్రస్తుత కాంప్లెక్స్‌లో కొత్త భవనం నిర్మిస్తే కొన్ని సౌకర్యాలను, సేవలను అటూ ఇటూ మార్చాల్సి ఉంటుందని, అయితే రాజ్‌పథ్‌కు మరోవైపున అవసరాలకు తగ్గట్లు ఎక్కువ స్థలముందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని, రాజ్‌పథ్‌లోని ప్రతిపాదిత కాంప్లెక్స్‌ను అనుసంధానిస్తూ భూగర్భంలో మార్గం నిర్మించవచ్చని స్పీకర్ సూచించారు. కొత్త పార్లమెంటును నిర్మించాలన్న ప్రతిపాదన ఏడాది క్రితం జరిగిన బడ్జెట్ కమిటీ సమావేశంలో తెరపైకి వచ్చింది. రానున్న 100 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ కేవీ థామస్ నాడు చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు విశేషాలు ► ఢిల్లీలోని అద్భుత కట్టడాల్లో ఒకటి. ► ఈ భవంతి డిజైన్‌ను ఎడ్విన్ లూటెన్స్, హార్బర్ట్ బేకర్లు రూపొందించారు. ►1927 జనవరి 18న నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ భవనాన్ని ప్రారంభించారు. ► అప్పట్లో ఈ భవనం నిర్మాణ వ్యయం రూ.83 లక్షలు. ఆరేళ్లలో నిర్మించారు. ► ఆరు ఎకరాల స్థలంలో 570 అడుగుల(170 మీటర్లు) వ్యాసంతో వృత్తాకారంలో కట్టారు. ► సంసద్ మార్గ్( నం.1 గేటు)సహా దీనికి మొత్తం 12 గేట్లు(ద్వారాలు) ఉన్నాయి. లోపల.. ► భవనంలో ప్రధానమైనది సెంట్రల్ హాల్. దీనిలో భాగంగానే మూడు చాంబర్లు అంటే లోక్‌సభ, రాజ్యసభ, లైబ్రరీ హాల్ ఉన్నాయి. ► ఈ మూడింటి మధ్యలోని ఖాళీ స్థలంలో చిన్నపాటి తోటలున్నాయి. ► ఈ మూడు చాంబర్లను చుట్టూతా కలుపుతూ వృత్తాకారంలో నాలుగు అంతస్తులుగా కేంద్ర మంత్రులు, చైర్మన్, పార్లమెంటు కమిటీలు, పార్టీ ఆఫీసులు, లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శుల ముఖ్య ఆఫీసులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యాలయాలకు వసతి కల్పించారు. ► సెంట్రల్‌హాల్ గుండ్రంగా ఉంటుంది. దీని గుమ్మటం వ్యాసం 98 అడుగులు(29.87 మీటర్లు). ► సెంట్రల్‌హాల్ చారిత్రక ఘట్టాలకు నెలవు. ఇక్కడే భారత రాజ్యాంగం మొత్తం ప్రక్రియ పూర్తయింది. ► గతంలో దీనికి ముందు ఇదే స్థలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లైబ్రరీ ఉండేవి. ► 1946లో రూపురేఖలు మార్చేసి సెంట్రల్ హాల్‌గా తీర్చిదిద్దారు. ► అప్పటి నుంచీ లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశాలకు వాడుతున్నారు. ► ప్రతీసారి సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ఈ హాల్లోనే తొలిసారిగా ప్రసంగిస్తారు.