breaking news
CEC inquiry
-
సీఈసీ కోర్టుకు కేబినెట్ బంతి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ(కేబినెట్) సమావేశం ఈ నెల 14వ తేదీన జరుగుతుందా? లేదా? అనేది కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నిర్ణయంపై ఆధారపడి ఉంది. ముఖ్యమంత్రి కా ర్యాలయం(సీఎంవో) పంపిన నాలుగు ఎజెండా అంశాలతో ఈ నెల 14న కేబినెట్ భేటీ నిర్వహణకు అనుమతించాలంటూ సీఈసీకి లేఖ పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. ‘‘ఫొని తుపాను సçహాయక చర్యలు, రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, కరువుతోపాటు వాతావరణ పరిస్థితులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, ఉపాధి పరిస్థితి అనే అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికి ఆయా శాఖల అధికారులంతా హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయండి’’అంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎంవో ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మంగళవారం లేఖ సమర్పించిన విషయం విదితమే. దీనిని ఆయన సాధారణ పరిపాలన(జీఏడీ–పొలిటికల్) కార్యదర్శితోపాటు ఆయా శాఖల కార్యదర్శులకు పంపించి, గురువారం స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ఈ నాలుగు అజెండా అంశాలపై చర్చించిన సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ సీఎంవో పంపిన ఎజెండాను యథాతథంగా ఆమోదించి, సీఈసీ ఆమోదం కోసం పంపాలని నిర్ణయించింది. ‘‘ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చి, ఈ నాలుగు అజెండా అంశాలపై ఈ నెల 14న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు అనుమతించాలి’’అని కోరుతూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) గోపాలకృష్ణ ద్వివేది ద్వారా నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కొత్తగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేరు స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ పంపుతారు. దీనిని సీఈవో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. లేఖ అందిన 48 గంటల్లోగా కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల బృందం సమావేశమై, ఈ వినతిని పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ నిర్వహించాల్సిన అవసరం ఉందా? లేదా? అంత ప్రాధాన్యం ఉందా? అనే అంశాలను సీఈసీ బృందం సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. సీఈసీ అనుమతిస్తే ఈ నెల 14న కేబినెట్ సమావేశం ఉంటుంది. తిరస్కరిస్తే ఉండదు. ‘‘ఇప్పుడు బంతి సీఈసీ కోర్టుకు చేరింది. సీఈసీ కోర్టులో అది గోల్ అవుతుందో, ఫౌల్ అవుతుందో తేలాల్సి ఉంది’’అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అన్నారు. ఒకవేళ 14వ తేదీన కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతించినా.. ఎజెండాలోని నాలుగు అంశాలపై చర్చించడం తప్ప కొత్తగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదని మరో సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. -
గ్రేటర్లో ఓట్ల గల్లంతుపై సీఈసీ విచారణ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల నమోదు, ఓటర్ల ఏరివేత ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. భారీగా ఓట్లు గల్లంతైనట్లుగా వరుసగా ఆరోపణలు.. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం అధ్వర్యంలో ఢిల్లీ నుంచి ముగ్గురు అధికారుల బృందం గురువారం రాష్ట్రానికి చేరుకుంది. మూడు రోజుల పాటు ఈ బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో ఓటర్లను కలసి వాస్తవాలు తెలుసుకోనుంది. ఈ నెల 31న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఇటీవల ఓటర్ల సవరణలో భాగంగా గ్రేటర్ పరిధిలో దాదాపు 25.30 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు చేపట్టిన ఇంటింటి సర్వేలో 6.30 లక్షల ఓటర్ల పేర్లను జాబితాలో నుంచి తొలగించారు. చనిపోయినవారు, డబుల్ పేర్లున్నవారు, చిరునామాలో లేకుండాపోయిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించినట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ ఇటీవలే ప్రకటించారు. మరో 19 లక్షల మంది ఓటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. కానీ.. బతికి ఉన్న వారిని సైతం చనిపోయినట్లుగా చూపించారని, ఓటర్లు అదే చిరునామాలో ఉన్నప్పటికీ డోర్ లాక్, వలస వెళ్లారని రాసుకోవడం గందరగోళానికి తెర లేపింది. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే 1.08 లక్షల మంది ఓటర్లను జాబితాలో నుంచి తొలగించారు. శేరిలింగంపల్లి, జూబ్లీ హిల్స్ పరిధిలో మరో 1.10 లక్షల ఓట్లను తీసేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు కొందరు అధికారులు ఏజెంట్గా మారారని, ప్రతిపక్షాలకు పట్టున్న ప్రాంతా ల్లో ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించారని ఆయా పార్టీల నుంచి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఈ విచారణకు ఆదేశించింది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 83.77 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో దాదాపు 20 లక్షల మందికిపైగా నోటీసులు జారీ చేయడంపై నగర ప్రజలు సైతం అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం విచారణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.