'వాతావరణ న్యాయం' కావాలి
సమస్య.. వాతావరణ మార్పు కాదు: ప్రధాని మోదీ
వాతావరణ మార్పు వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యేది పేద ప్రజలే
ఇచ్చిపుచ్చుకునే పరిష్కారం కాదు.. ఘర్షణ నివారణ చర్చలు జరగాలి
ఇందుకు హిందూ, బౌద్ధమతాలు దోహదం చేస్తాయి
'ప్రపంచ హిందూ బౌద్ధ ప్రయత్నం' సదస్సులో మోదీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పర్యావరణం విషయంలో అసలు సమస్య వాతావరణ మార్పు కాదని.. వాతావరణ న్యాయమని ప్రధాని మోదీ అభివర్ణించారు. వాతావరణ మార్పు వల్ల అత్యంత ప్రతికూలంగా ప్రభావితమయ్యేది పేదలు, అణగారిన వర్గాల వారేనన్నారు. 'ఒక ప్రకృతి విపత్తు సంభవించినపుడు బలంగా దెబ్బతినేది వారే. వరదలు వచ్చినపుడు వారు నిరాశ్రయులవుతారు. భూకంపంలో వారి ఇళ్లు ధ్వంసమవుతాయి. కరువుల్లో, చలిలో వారే ప్రభావితమవుతారు. వాతావరణ మార్పు ఈ రకంగా ప్రజలపై ప్రభావం చూపించేలా వదలిపెట్టలేం. అందుకే.. చర్చ పర్యావరణ మార్పు అనే దాని నుంచి పర్యావరణ న్యాయం అనే అంశానికి మారాలని నేను విశ్వసిస్తున్నా' అని పేర్కొన్నారు.
వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అధ్వర్యంలో గురువారం ఢిల్లీలో ప్రారంభమైన 'సంవాదం - సంఘర్షణ నివారణ, పర్యావరణ చైతన్యంపై ప్రపంచ హిందూ బౌద్ధ ప్రయత్నం'మూడు రోజుల కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ప్రకృతికి - మనిషికి మధ్య, ప్రకృతికి-అభివృద్ధికి మధ్య సంఘర్షణ ఉంద ని.. ఈ సంఘర్షణను నివారించటానికి చర్చలు జరగాలని.. త్వరలో పారిస్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సుకు ముందు.. భారత్ తన కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను నివేదించటం కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'నేను వేద సాహిత్యాన్ని చదవటం వల్ల మానవులకు, ప్రకృతిక మధ్య బలమైన అనుబంధాన్ని తెలుసుకున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించటానికి కన్ఫ్యూషియనిజం, తావోయిజం వంటి ఆసియా విశ్వాసాలు, బౌద్ధమతం చాలా పెద్ద బాధ్యతను తీసుకున్నాయి. వాతావరణ మార్పుపై వైఖరిలో చేయాల్సిన అవసరమున్న మార్పులను పరిశీలించటానికి.. భూమాతపై చక్కగా వివరించిన ప్రామాణిక గ్రంథాలు గల హిందూమతం, బౌద్ధమతం సహాయపడగలవు' అని మోదీ పేర్కొన్నారు.
ప్రభుత్వేతర హింసాత్మక శక్తులు ప్రపంచవ్యాప్తంగా భారీ భూభాగాలను నియంత్రిస్తుండటం.. ఆటవిక హింసను అమలు చేస్తుండటం పట్ల మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సంఘర్షణలను పరిష్కరించుకోవటానికి చర్చలే ఏకైక మార్గమని చెప్పారు. సిద్ధాంతాలు చర్చలకు తలుపులు మూసివేస్తాయని.. ఘర్షణను నివారించాలంటే ప్రపంచం ఆ మార్గం నుంచి తత్వశాస్త్రానికి మారాలని పేర్కొన్నారు. 'సంఘర్షణలను పరిష్కరించుకునే మన వ్యవస్థల్లో తీవ్రమైన పరిమితులు మరింత ఎక్కువగా స్పష్టమవుతున్నాయి. కాబట్టి ప్రపంచం ఇప్పుడు బౌద్ధమతాన్ని గుర్తిస్తుండటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు'అని వ్యాఖ్యానించారు.
బౌద్ధ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తున్నాం
జపాన్, శ్రీలంక, మంగోలియా, కంబోడియా సహా చాలా బౌద్ధదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు హాజరైన సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఈ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు భారతదేశం మతపరంగా సందర్శనీయమైన ప్రధాన ప్రాంతమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బౌద్థమత వారసత్వ సంపదకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు తన ప్రభుత్వం సాధ్యమైనంత కృషి మొత్తం చేస్తోందని చెప్పారు. ఈ మూడు రోజుల సమావేశం కూడా ఆ కృషిలో భాగమేనన్నారు. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాబోతోందని.. బుద్ధుడు చూపిన మార్గాన్ని, ఆదర్శాలను హత్తుకోకుండా అది జరగబోదని తనకు చాలా స్పష్టంగా తెలుసునని పేర్కొన్నారు.
శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికాకుమారతుంగ మాట్లాడుతూ.. ఉగ్రవాదమనేది.. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు విపరీత రూపమని.. అటువంటి సంఘర్షణలను పరిష్కరించటానికి సమీకృత, సుస్థిర అభివృద్ధి కీలకమని పేర్కొన్నారు. అన్ని మతాలనూ ఒకటిగా పరిగణించటం చాలా ముఖ్యమన్నారు. జపాన్ ప్రధానమంత్రి షిన్జో అబె వీడియో సందేశాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. సమావేశంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీరవిశంకర్ కూడా మాట్లాడారు.