breaking news
Border people
-
Rajasthan election 2023: ఒకే ఒక్క కుటుంబం కోసం పోలింగ్ బూత్
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్ అసెంబ్లీకి నేడు జరగనున్న ఎన్నికల్లో ఒకే ఒక్క కుటుంబం కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బార్మర్ జిల్లా పార్ గ్రామంలో రాష్ట్రంలోనే అతి చిన్న పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ ఒక కుటుంబంలోని 35 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ గ్రామ ప్రజలు గత ఎన్నికల వరకు ఓటేయడానికి 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఎడారిలో రోడ్లు లేకపోవడంతో ప్రజలు కాలినడకన, ఒంటెలపై పోలింగ్ బూత్‌కు చేరుకొనేవారు. పోలింగ్ కేంద్రం చాలా దూరంగా ఉండటంతో వృద్ధులు, మహిళలు పలుమార్లు ఓటు వేయలేకపోయారు. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న ఎన్నికల కమిషన్ అధికారులు గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మూడు వేర్వేరు ఇళ్లలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మహిళలు, 18 మంది పురుషులు మొత్తం 35 మంది ఓటేయనున్నారు. కాగా, సిరోహి జిల్లాలోని అబు–పింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో 4,921 అడుగులఎత్తులో ఉన్న షేర్‌గావ్ ఓటర్లు తొలిసారిగా తమ సొంతూళ్లోనే ఓటు వేయనున్నారు. గ్రామంలోని 117 మంది గిరిజనుల ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల సిబ్బంది దట్టమైన అటవీప్రాంతంలో దాదాపు 18 కిలోమీటర్లు నడిచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. -
పట్టాలిచ్చిన వారికే ‘సరిహద్దు’ ఓటు
కెరమెరి(ఆసిఫాబాద్): రెండు రాష్ట్రాల గొడవలో 15 సరిహద్దు గ్రామాలు నలిగిపోతున్నాయి. సాగు భూములకు ఇప్పటికీ పట్టాలు అందకపోవడంతో అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న జనాభాలో 20 శాతం ఉన్న గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం పోడు పట్టాలిచ్చి ‘రైతుబంధు’ అమలు చేస్తోంది. అయితే 70 శాతం ఉన్న ఎస్సీలు, 10 శాతం ఉన్న బీసీలను రెండు ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజనేతరులకు పట్టాలందించి, గ్రామాల్లో సమస్యలు పరిష్కరించిన వారికే ఓటు వేస్తామని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని వివాదాస్పద గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటుహక్కు కలిగి ఉన్న వీరు ఈ నెల 30న తెలంగాణలో నిర్వహించే ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఓటు వేయనున్నారు. మొత్తంగా వీరి ఓట్ల సంఖ్య 3,566. సరిహద్దుల గుర్తింపు ఇలా.. 1955– 56లో ఫజల్అలీ కమిషన్ సరిహద్దులను గుర్తించింది. ఈ క్రమంలో పరందోళి, కోటా, పరందోళి తండా, శంకర్‌లొద్ది, లేండిజాల, మహరాజ్‌గూడ, ముకదంగూడ, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయణగూడ, భోలాపటార్, లేండిగూడ, గౌరీ గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్లాయి. 1965 నుంచి ఇవి మహారాష్ట్రలోని నోకేవాడ, పుడ్యాన్‌మోదా జీపీల్లో ఉన్నాయి. అయితే 1990లో అక్కడి ప్రభుత్వం పరందోళి, అంతాపూర్ జీపీలను ఏర్పాటు చేసి 15 గ్రామాలను విడదీసింది. 1995లో ఇక్కడ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓటింగ్ నమోదైంది. 1978లో మరోసారి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉమ్మడిగా సరిహద్దులు గుర్తించాయి. ఆర్టికల్ 3 ద్వారా 15 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆ«దీనంలో ఉంటాయని ఇరురాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1980 నుంచి ఏపీ గవర్నమెంట్ అక్కడ ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోలేదు. అనంతరం ఏపీ ప్రభుత్వం కూడా పరందోళి, అంతాపూర్ జీపీలను గుర్తించి 1994లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల్లో స్థానికులు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. 1980 నుంచి ఉద్యమం... వివాదాస్పద గ్రామాలను ఏపీలో కలపొద్దని 1980 నుంచే ఉద్యమం చేస్తున్నట్టు ముకదంగూడ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాందాస్ నర్వడే తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో 1983లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. అయితే 1978లో చేసిన హద్దుల ప్రకారం గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని ఆ కమిటీ నివేదించింది. 1990 జూలై 7న గ్రామాలు ఏపీకి చెందుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ మరోసారి ఉద్యమం మొదలైంది. 15 గ్రామాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారని, భాషా ప్రతిపాదికన నిర్ణయం తీసుకోవాలని అడ్వొకేట్, రాజూరా ఎమ్మెల్యే వాన్‌రావు చటప్‌తో కలిసి ఆందోళనలు చేపట్టారు. ఈ విషయం అక్కడి అసెంబ్లీలో చర్చకు రావడంతో మహారాష్ట్ర సర్కార్ 1993 ఆగస్టు 5న 1990లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఆ గ్రామాలు మహారాష్ట్రలోనే కొనసాగుతాయని తేల్చిచెప్పింది. ఆ తర్వాత 1996 ఏప్రిల్ 3న ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రతిగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 1996 ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏపీ గవర్నమెంట్ 1997 ఆగస్టు 21న పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటివరకు 15 గ్రామాల కోసం ఎలాంటి కేసులు దాఖలు చేయలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. రెండు ఓట్లు.. రెండు రేషన్‌కార్డులు ఇక్కడి ప్రజలకు ఇరు రాష్ట్రాలకు చెందిన రెండు రేషన్‌కార్డులు, రెండు ఓట్లు ఉన్నాయి. వీరు ఇద్దరేసి సర్పంచ్‌లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. రెండు ప్రభుత్వాలు పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. పరందోళి గ్రామంలో కొందరికి ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరయ్యాయి. అయితే లబ్దిదారులకు తెలియకుండా కొంతమంది బిల్లులు కాజేశారు. అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నా లబ్దిదారులకు న్యాయం జరగలేదు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీరు కూడా సరఫరా చేస్తున్నారు. 2014 నుంచి ఇక్కడి రైతులకు పట్టాలు లేక రుణాలు అందటం లేదు. మరో వైపు రెవెన్యూ, అటవీశాఖ మధ్య భూవివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం గిరిజనులకు పోడు పట్టాలు అందినా గిరిజనేతరులకు ఎలాంటి భరోసా లేకుండా పోయింది. 80 శాతం ఉన్న గిరిజనేతరులకు పట్టాలిచ్చిన వారికే ఓటు వేస్తామని అక్కడి ప్రజలు తేల్చిచెబుతున్నారు. పట్టాలివ్వాలి.. 50 ఏళ్లుగా భూములు సాగుచేసుకుంటున్నా పట్టాల్లేవు. రెండు ప్రభుత్వాలు కూడా పట్టాలు అందించకపోవడంతో సంక్షేమ పథకాలు అందడంలేదు. ఇప్పటికైనా రైతులకు పట్టాలు అందించాలి. – కాంబ్డే లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరందోళి కోర్టు ధిక్కరణే.. 15 గ్రామాలు మహారాష్ట్రకు చెందినవిగా 1997లోనే సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అయినా తెలంగాణ సర్కారు ఇంకా కొనసాగిస్తోంది. ఇది కోర్టు ధిక్కరణవుతుంది. ఓట్ల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మేం మహారాష్ట్రలోనే కొనసాగుతాం. – రాందాస్ రన్వీర్, సామాజిక కార్యకర్త, ముకదంగూడ -
సరిహద్దుల్లో భయం భయం..
• బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు • పాక్‌నుంచి నిరంతరాయంగా దాడులు • సరిపోని బంకర్లు.. రక్షణ లేని ఇళ్లు సాక్షి నేషనల్ డెస్క్ : భారత సర్జికల్ దాడుల తర్వాత పాక్ చేస్తున్న దాడుల్లో సరిహద్దు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాణాలు కోల్పోవటంతోపాటు.. పలు సందర్భాల్లో తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఇళ్లలోనుంచి బయటకు రాలేక.. ఇళ్లలోనూ ఉండలేక బిక్కుబిక్కుమంటున్నారు. ఉడీ, పూంచ్, రాజౌరీ, నౌషేరా, ఆర్ఎస్ పుర సెక్టార్లలో పరిస్థితిదారుణంగా ఉంది. ఇప్పటికే చాలా మంది గ్రామస్తులు పాక్ దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వదిలి వెళ్లలేక చాలా మంది గ్రామాల్లో ఉంటూ నరకం అనుభవిస్తున్నారు. గ్రామస్తులకు రక్షణ కల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమ్యూనిటీ బంకర్లను నిర్మిస్తున్నాయి. కానీ ఇవి సరిపోవటం లేదు. ‘ఒక్కో గ్రామంలో 400-500 మంది ఉంటారు. ఒక్కో బంకర్ల్లో 25-30 మందే పడతారు మరి మిగిలినవారి సంగతేంటి?’ అని అశోక్ అనే గ్రామస్తుడుప్రశ్నించాడు. చాలా మంది ఇళ్లలోనే ఉంటూ మోర్టార్ల దాడిలో గాయపడుతున్నారు. మిగిలిన వాళ్లు తట్టా, బుట్టా సర్దుకుని గొడ్డు, గోదాతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. దీంతో చాలా ఊళ్లు ఖాళీ అయ్యాయి. రమేశ్ లాల్ (45) అనేవ్యక్తి పాక్ దాడుల్లో తన సోదరుణ్ని కోల్పోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తండ్రికి చికిత్స చేయిస్తే.. రూ. 3 లక్షలు ఖర్చయింది. కానీ ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన వారికి రూ.75వేలు మాత్రమే ఇచ్చింది. సరిహద్దుల్లో బతకటమే కష్టమనుకునే పరిస్థితుల్లో ఇంత మొత్తాన్ని ఎలా భరించాలనేది రమేశ్ ఆవేదన. దీపావళి అంటే తెలీదు‘: దేశమంతా దీపావళి జరుపుకుంటోంది. కానీ సరిహద్దుల్లోగస్తీ సైనికులకు పండగ లేదం’టూ లతామంగేష్కర్ పాడిన గీతం చాలా ఫేమస్. కానీ సైనికులకే కాదు. వారి బూట్ల చప్పుళ్లతో అప్రమత్తంగా ఉండే సరిహద్దు గ్రామాలకూ దీపావళి లేదు. టపాసులు పేలిస్తే.. ఆ వెలుతురు ఆధారంగా పాక్ దాడులు చేస్తుందని.. దశాబ్దాలుగా వీళ్లు పండగ జరుపుకోలేదు. అలాంటిది ఇప్పుడు, రేయింబవళ్లు. గ్రామాల్లో కాల్పుల మోత మోగుతోందని గ్రామస్తులు అంటున్నారు.