breaking news
bogas voters check
-
బోగస్ ఓట్లకు..చెక్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : బోగస్ ఓట్లకు చెక్ పడింది. ఒకే వ్యక్తి అటు పట్టణ ప్రాంతంలో.. ఇటు సొంత గ్రామాల్లో రెండేసి చొప్పున ఓట్లు వేసే పద్ధతికి కాలం చెల్లింది. గడిచిన నాలుగున్నరేళ్లుగా ఓటర్ రివిజన్ జరుగుతున్నా.. ఎప్పటికప్పుడు కొత్త ఓటర్లు నమోదు అవుతున్నా జిల్లాలో మొత్తం ఓట్ల సంఖ్యలో ఒక్క ఓటు కూడా పెరగలేదు. గత సార్వత్రిక ఎన్నికల (2014) నాటి గణాంకాలను, ప్రస్తుతం ప్రకటించిన ఓట్ల లెక్కలను పరిశీలించి చూస్తే మొత్తంగా 406 ఓట్ల తగ్గుదల కనిపిస్తోంది. కేవలం మునుగోడు, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఓటర్ల సంఖ్య కొద్దిగా పెరిగింది. ఇక, మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ నెల 13వ తేదీన ఎన్నికల అధికారులు ప్రకటించిన గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో ప్రస్తుతం 12,72,340 మంది ఓటర్లు ఉన్నారు. మరో 328మంది సర్వీసు ఓటర్లను కలిపితే మొత్తం ఆ సంఖ్య 12,72,668. కాగా, గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం ఓట్లు 12,73,074. ఇక, గణాంకాల మేరకు గతంతో పోలిస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 825, మునుగోడు నియోజకవర్గంలో 11,785 ఓట్ల చొప్పున పెరిగాయి. ఫలించిన సాంకేతిక మంత్రం అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకున్న ఎన్నికల సంఘం బోగస్ ఓట్లను గణనీయంగా తగ్గించగలిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వ్యక్తికి ఒక్క ఓటే లక్ష్యం నెరవేరినట్లే కనిపిస్తోందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జిల్లా ఓట్ల నమోదు, రివిజన్‌కు సంబంధించి ఏడాది కాలంగా సాగిన కృషి సత్ఫలితాలు ఇచ్చిందని ఓ అధికారి పేర్కొన్నారు. బూత్‌స్థాయి అధికారులను నియమించుకుని, ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాలను సరిదిద్దారు. సమగ్ర ఇంటింటి సర్వే (ఐఆర్‌ఈఆర్)తో ఎన్నికల సిబ్బంది సంబంధిత ఇంటిని సందర్శించినప్పుడు ఉన్న వారి ఓట్లను మాత్రమే మాత్రమే పరిగణనలోకి తీసుకుని జాబితాలు దిద్దారు. ఓటర్ల ఆధార్ కార్డుల సీడింగ్ కూడా బోగస్ ఓట్లను, రెండు రెండు ఓట్లను (డూప్లికేషన్) అరికట్టడంలో కీలకపాత్ర పోషించింది. దీంతోపాటు ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఓట్లు నమోదు చేసుకోవడానికి తీసుకువచ్చిన ఈఆర్ఓ నెట్ వల్ల ఒకే వ్యక్తి పేరున రెండో ఓటు అన్న ముచ్చటే లేకుండా పోయింది. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడంతో అన్ని నియోజకర్గాల్లో ఓటర్ల సంఖ్య తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే 2014 ఎన్నికల నాటి ఓట్లర్ల సంఖ్యకు, ఇప్పటికి ఏకంగా 10,053 ఓట్లు తగ్గిపోవడం గమనార్హం. -
బోగస్ ఓటర్లకు చెక్
నెల్లూరు(రెవెన్యూ): బోగస్ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఎన్నికల సమయంలో బోగస్ ఓట్లతో అనేక సమస్యలు తలెత్తుతుండటంతో వాటిని శాశ్వతంగా తొలగించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఓటరు కార్డులకు ఆధార్ సీడింగ్ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఓటరు కార్డుల ఆధార్ సీడింగ్ ప్రక్రియ మార్చి 1 నుంచి జిల్లాలో ప్రారంభించి 31వ తేదీలోపు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్ శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో బోగస్ ఓటర్లు కీలకపాత్ర పోషించేవారు. అభ్యర్థుల జయపజయాలు వారిపై ఆధారపడి ఉండేవి. బోగస్ ఓటర్లను కట్టడి చేయడం అధికారులకు తలనొప్పిగా ఉండేది. అసలు ఓటర్లు ఎవరో బోగస్ ఓటర్లు ఎవరో కనిపెట్టడంలో అధికార యంత్రాగం ప్రతి ఎన్నికలోనూ విఫలమైంది. ఓటర్ల ఆధార్ సీడింగ్ వల్ల బోగస్, మరణించిన, స్థానికంగా నివాసంలేని, డబుల్ ఎంట్రీ ఓటర్లను రద్దు చేయవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల ఆధార్ సీడింగ్‌తో ఎన్నికల కమిషన్ మంచి ఫలితాలను సాధించింది. నిజామాబాద్ జిల్లాలో 18 లక్షల ఓటర్లు ఉన్నారు. ఆధార్ సీడింగ్ తర్వాత 4 లక్షల ఓటర్లు జిల్లాలో లేరని నిర్ధారించుకుని వాటిని తొలగించారు. 60 వేలమంది మరణించన వారు, 40 వేలమంది డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించారు. ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. జిల్లాలో 22,78,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 11,27,128 మంది పురుషులు, 11,50,887 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. మార్చి 1 నుంచి ఓటర్ ఆధార్ సీడింగ్ ప్రారంభించనున్నారు. ఓటర్లు తమ ఆధార్ నంబర్ తదితర పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పంపవచ్చు. లేదా ఆన్లైన్, కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఓటర్ ఐడీ నంబర్, ఆధార్ నంబర్ చెప్పిన అక్కడ ఉన్న సిబ్బంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. పోలింగ్ బూత్ స్థాయిలో సిబ్బందిని నియమించి ఓటర్ల ఆధార్ నంబర్లు సేకరిస్తారు. ఆధార్ సీడింగ్ ప్రక్రియకు సంబంధించి బూత్ లెవల్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఓటర్ల తమ ఆధార్ నంబర్ సీడింగ్ చేసుకోకపోతే దానిని తొలగిస్తారు. మరలా తిరిగి ఓటు నమోదు చేసుకోవడానికి కొంతకాలం జాప్యం జరుగుతుంది. ఓటర్ ఆధార్ సీడింగ్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాగం చర్యలు చేపట్టనుంది.