breaking news
BK Bansal wife Satyabala
-
సీనియర్ ఐఏఎస్ ఇంట్లో విషాదం
-
సీనియర్ ఐఏఎస్ ఇంట్లో విషాదం
న్యూఢిల్లీ: లంచం కేసులో అరెస్టయిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీకే బన్సాల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బన్సాల్ భార్య సత్యబాల, ఆయన కూతురు నేహ ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలోని బన్సాల్ ఫ్లాట్‌లో వీరిద్దరూ ఉరివేసుకుని చనిపోయారు. బన్సాల్ లంచం కేసులో అరెస్ట్ అయినందుకు అవమానభారంతో ఆయన భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారా లేక మరేదైనా కారణమా అన్న విషయం తెలియరాలేదు. బన్సాల్ పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో వీరు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న బన్సాల్ శనివారం ఓ లాడ్జిలో ఓ వ్యక్తి నుంచి 9 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. టీవీ నటుడు అనూజ్ సక్సేనాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీకి అనుమతులు మంజూరు చేయడం కోసం లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. సీబీఐ అధికారులు ఆయనతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు. బన్సాల్, ఇతర అధికారులు తొలుత 50 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారని, చివరకు 20 లక్షలకు అంగీకరించారని సీబీఐ అధికారులు తెలిపారు. బన్సాల్ ఇదివరకే 11 లక్షలు తీసుకున్నారని, మిగిలిన 9 లక్షలు తీసుకుంటుండగా అరెస్ట్ చేసినట్టు చెప్పారు. బన్సాల్‌ను ఢిల్లీ కోర్టులో హాజరుపరచగా, రెండు రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది.