breaking news
bidding bill
-
‘మహారాజా’కు మంగళం!
న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయి... ఎగరడానికి ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను పూర్తిగా వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలోని మొత్తం 100 శాతం వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా అమ్మేయాలని నిర్ణయించింది. బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక విధివిధానాలను సోమవారం విడుదల చేసింది. కొనుగోలుకు ముందుకొచ్చే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 17ను గడువుగా (డెడ్‌లైన్) నిర్ధేశించింది. బిడ్డింగ్ పత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం... చౌక ధరల ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో తనకున్న 100% వాటాలను అదేవిధంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్ వెంచర్(జేవీ) ఏఐఎస్ఏటీఎస్లో 50% వాటానూ ఎయిరిండియా విక్రయించనుంది. ఈ జేవీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలందిస్తోంది. బిడ్డింగ్‌లో విజయం సాధించిన సంస్థకు ఎయిరిండియాతో పాటు ఈ 3 సంస్థల్లో మొత్తం యాజమాన్య నియంత్రణను బదలాయించనున్నారు. వాటికి మాత్రం మినహాయింపు... ఎయిరిండియాకు ఇతర అనుబంధ సంస్థల్లో కూడా వాటాలు ఉన్నాయి. ప్రధానంగా ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీసెస్, హాటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల్లో తనకున్న కీలకమైన వాటాలను మాత్రం తాజాగా ప్రతిపాదించిన వాటా అమ్మకం నుంచి మినహాయిస్తున్నట్లు బిడ్డింగ్ పత్రంలో పేర్కొంది. ఈ సంస్థల్లోని వాటాలను ప్రత్యేక సంస్థ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్ఎల్)కు బదలాయించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. కాగా, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లకు ప్రస్తుతం ఉన్న రుణభారంలో రూ.23,287 కోట్లను వీటిని కొనుగోలు చేసే సంస్థలే భరించాల్సి ఉంటుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మిగిలిన రుణాన్ని(దాదాపు రూ.36,760 కోట్లు) ఏఐఏహెచ్‌ఎల్‌కు కేటాయించనున్నారు. మొత్తం బకాయిలు, రుణాలు కలిసి రూ.56,334 కోట్లను ఈ సంస్థకు బదలాయిస్తారు. దీంతో పాటు రూ.17,000 కోట్ల ఆస్తులు కూడా దీనికి దక్కుతాయి. అమ్మకానికి మూడోసారి... ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనను ప్రకటించడం గడిచిన రెండేళ్లలో ఇది రెండోసారి. సంస్థలోని 76% వాటాను విక్రయించడంతోపాటు యాజమాన్య నియంత్రణను కూడా బిడ్డింగ్‌లో నెగ్గిన ప్రైవేటు సంస్థలకు కట్టబెడతామంటూ ప్రభుత్వం 2018లో తొలిసారిగా ప్రతిపాదించింది. అయితే, ఇందుకు బిడ్డర్లు ఎవరూ ముందుకురాకపోవడంతో తాజాగా 100% వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. వాస్తవానికి 2001–02లో అప్పటి ఎన్డీఏ హయాంలో ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విడివిడిగా ఉన్నప్పుడే అమ్మకానికి యత్నించినా.. సాధ్యం కాలేదు. అంటే ప్రస్తుత ప్రతిపాదన మూడోసారిగా లెక్క. నిబంధనల సడలింపు... ఎట్టిపరిస్థితుల్లోనూ ఎయిరిండియాను అమ్మేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం తాజాగా బిడ్డింగ్ నిబంధనలను కూడా సడలించింది. ప్రధానంగా కొనుగోలుకు ముందుకొచ్చే బిడ్డర్లకు కనీస నెట్‌వర్త్(వ్యాపార విలువ)ను రూ.3,500 కోట్లుగా నిర్ధారించింది. అదేవిధంగా ఒకరికంటే ఎక్కువమంది కన్సార్షియంగా బిడ్డింగ్ వేసేవారికి కూడా భాగస్వామ్య సంస్థకు కేటాయించాల్సిన కనీస వాటాను 10%కి తగ్గించారు. 2018లో అమ్మకం ప్రతిపాదనలో దీన్ని రూ.5,000 కోట్లు, 26%గా కేంద్రం నిర్దేశించింది. కాగా, తాజా బిడ్డింగ్ ప్రకారం కన్సార్షియంలో ప్రధాన భాగస్వామ్య సంస్థకు నెట్‌వర్త్‌లో 26% వాటా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కన్సార్షియంలో వ్యక్తులు(ఇండివిడ్యువల్స్) కూడా చేరొచ్చు. కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న బిడ్డర్లకు డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ముసాయిదా వాటా కొనుగోలు ఒప్పందంతో పాటు సంస్థకు చెందిన అన్ని రికార్డులను అందుబాటులో ఉంచనున్నారు. ఎంతో విలువైంది... ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో కలిపితే ఎయిరిండియా అనేది చాలా విలువైనదని.. ‘గొప్ప ఆస్తి’గా పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యాఖ్యానించారు. బిడ్డింగ్‌లో దీన్ని చేజిక్కించుకునే సంస్థ ఎయిరిండియా బ్రాండ్‌ను నిరాటంకంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎయిరిండియాకు ఉన్న మొత్తం భూములు, భవనాలు ఇతరత్రా స్థిరాస్తులతో పాటు పెయింటింగ్స్ తదితర కళాకృతులు ఈ అమ్మకంలోకి రావని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో కొన్ని భవనాలు, స్థలాలు, కార్పొరేట్ ఆఫీసులను కొత్త ఇన్వెస్టర్లకు ఎయిర్‌లైన్ నిర్వహన నిమిత్తం కొంతకాలం వినియోగించుకోవడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ అమ్మకంపై బీజేపీకి చెందిన సుబ్రమణ్య స్వామి, యశ్వంత్ సిన్హా వ్యతిరేకతపై మాట్లాడుతూ.. వాళ్లిద్దరివీ వ్యక్తిగత అభిప్రాయాలన్నారు. ప్రభుత్వానికి దాంతో సంబంధం లేదన్నారు. ‘ఎయిరిండియా విక్రయం పూర్తిగా దేశద్రోహ చర్య. దీనిపై కోర్టుకెళ్తా’ అంటూ స్వామి సోమవారం ట్వీట్ చేశారు. ఉద్యోగులకు షేర్లు... వ్యూహాత్మక వాటా విక్రయంలో భాగంగా ఎయిరిండియా ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్రోగ్రామ్(ఎసాప్స్) కింద తక్కువ ధర(డిస్కౌంట్)కు షేర్లను ఇవ్వనున్నట్లు ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న వర్గాల్లోని ఒక వ్యక్తి తెలిపారు. ఎయిరిండియా షేర్లలో 3 శాతాన్ని (సుమారు 98 కోట్ల షేర్లు) ఎసాప్స్ కింద పక్కనబెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాదాపు రూ.1,384 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఎయిరిండియాలో అవసరానికి మించి సిబ్బంది ఎవరూలేరని.. రిటైర్ అయ్యే ఉద్యోగుల మెడికల్ ప్రయోజనాలకు సబంధించిన అంశాన్ని త్వరలోనే పరిష్కరించనున్నట్లు ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లోహానీ పేర్కొన్నారు. ►రూ.60,074 కోట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లకు 2019 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం రుణ భారం ►రూ.4,800 కోట్లు 2018–19లో ఎయిరిండియా నిర్వహణ నష్టాలు 17,984 ►2019 నవంబర్ 1 నాటికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో మొత్తం ఉద్యోగులు -
‘భోగాపురం’పై ఏడు సంస్థల ఆసక్తి
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టడానికి ఏడు సంస్థలు తమ ఆసక్తిని తెలుపుతూ బిడ్లను దాఖలు చేశాయని ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం ‘సాక్షి’కి వెల్లడించారు. జీవీకే, జీఎంఆర్లతో పాటు దక్షిణ కొరియాకు చెందిన ఇంచియాన్ ఎయిర్‌పోర్టుతో కలసి రిలయన్స్ గ్రూపు, జర్మనీకి చెందిన మూనిచ్ ఎయిర్‌పోర్టుతో కలసి ఎస్సెల్ గ్రూపు (జీగ్రూపు సుభాష్ చందర్జీ), స్విడ్జర్లాండ్‌కు చెందిన జ్యూరిచ్ ఎయిర్‌పోర్టుతో కలసి డూఇట్, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌తో కలసి ఐ ఇన్వెస్ట్మెంట్, జెర్మనీ ఎయిర్ పోర్టు–ఏవీఐ అలయెన్స్ కలసి ఎన్ఐఐఎఫ్ పేరుతో బిడ్లు దాఖలు చేసినట్లు తెలిపారు. బిడ్ల పరిశీలనకు పదిరోజులు ఈ బిడ్లను పరిశీలించి ఆయా సంస్థలకు అన్ని అర్హతలు ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు పది రోజుల సమయం పడుతుందని ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో వీరేంద్ర సింగ్ తెలిపారు. ఆ తర్వాత అర్హుల వివరాలను వెల్లడిస్తామన్నారు. అర్హత సాధించిన సంస్థలు ఆదాయంలో ఎంత వాటాను ఇస్తాయో తెలపమంటూ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ (ఆర్ఎఫ్క్యూ) పిలవనున్నట్లు తెలిపారు. ఆర్ఎఫ్క్యూ దాఖలు చేయడానికి 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయి తుది కాంట్రాక్టరను ఎంపిక చేయడానికి కనీసం రెండు నెలలకు పైగా పడుతుందన్నారు. ఏఏఐ కన్నా ఎక్కువ కోట్ చేస్తాయా? విశాఖ సమీపాన భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు 2016లోనే ప్రభుత్వం టెండర్లను పిలిచింది. మొత్తం మూడు దశల్లో 1.8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో రూ.4,208 కోట్ల పెట్టుబడి అంచనాతో దీన్ని నిర్మించనున్నారు. వీటిల్లో ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అత్యధికంగా ఆదాయంలో 30.2 శాతం వాటాను ఆఫర్ చేయడం ద్వారా టెండరును కైవసం చేసుకుంది. -
బొగ్గు బిల్లుకు మార్గం సుగమం..!
ఎలాంటి మార్పులూ అవసరం లేదన్న స్థాయీసంఘం గిరిజన హక్కులను పట్టించుకోలేదని దిగ్విజయ్ సింగ్ ఆక్షేపణ గనులు, ఖనిజాల బిల్లుకు ఒక సవరణ ప్రతిపాదించిన కమిటీ న్యూఢిల్లీ: బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించే విధానానికి ఉద్దేశించిన కీలక బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడానికి మార్గం సుగమమైంది. పార్లమెంటరీ కమిటీకి నివేదించిన బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనల) బిల్లును అధ్యయనం చేసిన స్థాయీ సంఘం అందులో ఎలాంటి మార్పు, చేర్పులు అవసరం లేదంటూ నివేదికను బుధవారం రాజ్యసభ ముందుంచింది. అయితే, ఈ సంఘ సభ్యులైన దిగ్విజయ్ సింగ్ సహా ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే, సీపీఎంలకు చెందిన మరో ఇద్దరు ఎంపీలు బిల్లుపై తమ అభ్యంతరాలను నివేదికలో పొందుపర్చారు. సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లిన మరో బిల్లు.. ‘గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు’లో ఒక సవరణను కమిటీ సూచించింది. దాంతో ఆ సవరణను బిల్లులో చేర్చాలని ప్రభుత్వం భావిస్తే.. ఆ బిల్లు మరోసారి లోక్‌సభ ఆమోదం కోరాల్సి ఉంటుంది. ఈ బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందడం తెలిసిందే. ఆర్డినెన్స్‌ల స్థానంలో వచ్చిన ఇవి ఏప్రిల్ 5లోగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. బొగ్గు బిల్లు.. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు అనిల్ మాధవ్ దవే నేతృత్వంలోని 19 మంది సభ్యుల స్థాయీ సంఘం బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లుపై అధ్యయనం చేసి నివేదికను అందజేసింది. అయితే, సెలెక్ట్ కమిటీలోని కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్, పీ భట్టాచార్య, రాజీవ్ శుక్లా(కాంగ్రెస్), కేఎన్ బాలగోపాల్(సీపీఎం), తిరుచి శివ(డీఎంకే) నివేదికలో తమ అభ్యంతరాలను వ్యక్తపరిచారు. బిల్లులో గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని దిగ్విజయ్ పేర్కొన్నారు. దీనిపై తమ సవరణలకు కమిటీ ఆమోదం తెలపలేదన్నారు. ‘బిల్లును అధ్యయనం చేసేందుకు కమిటీకి ఇచ్చిన వారం రోజుల సమయం ఏమాత్రం సరిపోలేదు’ అని వివరించారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన మిగతా సభ్యులు కూడా దాదాపు ఇవే అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిరసన.. ఈ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టగానే రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ పార్టీ తరఫున తన నిరసనను వెల్లడించారు. ఏ ఉద్దేశంతో ఈ బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదించారో ఆ ఉద్దేశం నెరవేరలేదని ఆక్షేంపించారు. కాగా, బొగ్గు, ఖనిజాల బిల్లును ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఎగువ సభలో వాటి ఆమోదం తరువాతే భూ సేకరణ బిల్లుపై ముందుకు వెళ్లాలని భావిస్తోంది. గనులు, ఖనిజాల బిల్లులో రెండు సవరణలను ప్రభుత్వం చేర్చనుందని సమాచారం. గనులు, ఖనిజాల బిల్లు ఈ బిల్లులో సెలక్ట్ కమిటీ ఒక సవరణను సూచించింది. మైనింగ్ హక్కులు పొందిన సంస్థ రాయల్టీలో కొంత శాతాన్ని స్థానికుల సంక్షేమం కోసం వినియోగించేలా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్‌కు చెల్లించడం తప్పనిసరి చేస్తూ ఒక నిబంధనను పునర్లిఖించాలని బీజేపీ సభ్యుడు భూపేంద్ర యాదవ్ నేతృత్వంలోని ఈ కమిటీ సూచించింది. వాతావరణంపై గనుల తవ్వకం ప్రభావం, లాభాల్లో స్థానికులు, గిరిజనులకు వాటా.. తదితర అంశాలను భవిష్యత్తులో సరైన సమయం వచ్చినప్పుడు చట్టంలో చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరింది. సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లుపై సీపీఎంకు చెందిన టీకే రంగరాజన్ మాత్రమే భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.