breaking news
Bhoodan Movement.
-
సర్వోదయ స్ఫూర్తిని నిలపాలి!
భారత స్వాతంత్య్ర సమరం సాగినన్ని రోజులూ మహాత్మాగాంధీనీ, ఆయన అహింసావాద సిద్ధాంతాలనూ అత్యంత దగ్గరగా అనుసరించిన మొట్ట మొదటి వ్యక్తి ఆచార్య వినోబా భావే. అందుకే 1940 లోనే ఆయనను గాంధీజీ భారతదేశ ‘మొదటి సత్యాగ్రహి’గా ఎంపిక చేశారు. అటువంటి వినోబా ప్రారంభించినదే ‘స్వచ్ఛంద భూదాన’ ఉద్యమం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలి నాళ్ళలో తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో అంతర్గత భూపో రాటాలు పొడసూపాయి. భూమి లేని ప్రజలు, భూస్వాములపై తిరుగుబాటును ప్రకటించి, దానిని తీవ్రతరం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలోనే అంతర్యుద్ధ వాతావరణం నెలకొంటుందనీ. ఇది వర్ధమాన భారత దేశానికి ఏమాత్రం మంచిది కాదనీ భావించి జాతీయ సర్వోదయ 3వ వార్షిక సదస్సులో భారతదేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛంద భూదాన్’ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.1951 ఏప్రిల్ 18న పాదయాత్ర చేస్తూ తెలంగాణలోని పోచంపల్లి గ్రామానికి చేరుకున్న వినోబా దగ్గరకు సుమారు 700 కుటుంబాలవారు వచ్చి కలిశారు. ఒక్కో కుటుంబానికి 2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమిని ఇప్పిస్తే తాము వ్యవసాయం చేసుకుంటూ సామరస్యంగా జీవిస్తామని చెప్పారు. ఆయనే స్వయంగా వెళ్ళి ఆ గ్రామంలో ఒక భూస్వామిని కలిసి మాట్లాడారు. ఈ దేశంలో ప్రజలందరూ ఒకరికొకరు పరస్పర సహాయం చేసుకుంటూ, సంయుక్త భారత దేశాన్ని నిర్మించుకోవాలన్నదే జాతిపిత మహాత్మ గాంధీ కల అని చెప్పారు. ఆ మాటలు విన్న పోచంపల్లి జమీందార్ వెదిరె రామచంద్రారెడ్డి తక్షణమే స్పందించి, పోచంపల్లి గ్రామంలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు పంచడానికి 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ దానం వెనువెంటనే అమలులోకి వచ్చే విధంగా దాన పత్రాన్ని సిద్ధం చేసి వినోబా భావే (Vinoba Bhave) కు అందించారు. సుమారు ఆరున్నర సంవత్సరాల కాలం పాటు భారత దేశంలో 80 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసి దాదాపు 50 లక్షల ఎకరాల భూమిని దానంగా స్వీకరించి సామాన్యుడి సర్వోదయానికి బలమైన పునాది వేశారు. 1965లో అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో ‘భూదాన్–గ్రామ్దాన్’ చట్టం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు బాధ్యత తీసుకున్నాయి. వినోబా స్వీకరించిన దానపత్రాలన్నిటినీ ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని గెజిట్ విడుదల చేశాయి. ఫలితంగా ఈ భూములన్నీ శాశ్వతంగా భూదాన్ (Bhoodan) భూములుగానే ఉంటాయి. 1982, నవంబరు 15న వినోబా తుదిశ్వాస విడిచే నాటికి దేశం మొత్తం మీద 50 శాతానికి పైగా భూదాన్ భూములు నిరుపేద ప్రజలకు పంచబడ్డాయి. ఆ తరువాత ఈ ప్రక్రియ సన్నగిల్లింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం అమలులోకి వచ్చినప్పుడు సుమారు 2 లక్షల యాభై వేల పైచిలుకు ఎకరాలు భూదాన్ భూములు ఉన్న ట్లుగా గెజిట్లో నమోదు అయ్యింది. వినోబా చనిపోయే నాటికి దాదాపు 40 వేల ఎకరాల భూములు మాత్రమే ఈ రాష్ట్రంలో పారదర్శకంగా భూమి లేని నిరుపేదలకుపంచబడ్డాయి. మిగిలిన భూములన్నీ ప్రభుత్వ సంర క్షణలోనే ఉన్నా... రెండు తెలుగు రాష్ట్రాలలో వేలాది ఎకరాల భూదాన్ భూములు అక్రమార్కుల కబంధ హస్తాలలో చిక్కుకుని ఉన్నాయి. వీటిని విడిపించి భూమి లేని నిరుపేదలకు పంచి సర్వోదయ స్ఫూర్తిని నిలపడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి. అదే వినోబాకు నిజమైన నివాళి.ఎన్. రాంబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ అధ్యక్షులు (ఏప్రిల్ 18తో భూదాన ఉద్యమానికి 75 వసంతాలు) -
భూదాన్.. సర్వే నంబర్ గాన్
♦ దానం చేసిన వాటిలో సగం భూములకు కానరాని సర్వే నంబర్లు ♦ పరాధీనమైన వేల కోట్ల విలువైన భూములు సాక్షి, హైదరాబాద్: భూదానోద్యమం.. భూమి లేని నిరుపేదలపాలిట వరంగా నిలిచిన సామాజిక ఉద్యమం! భూస్వాములు తమ వద్ద ఉన్న భూములను దానం చేయాలని నాటి నిజాం సంస్థానంలో మొదలై దేశానికి తలమానికంగా నిలిచింది. నల్లగొండ జిల్లాలోని పోచంపల్లిలో భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఆచార్య వినోభాభావే చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఒక్క తెలంగాణలోనే 1.20 లక్షల ఎకరాలను దానం చేయించింది. ఆ 1.20 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి సాగుయోగ్యంగా మార్చాలి. కానీ 70 ఏళ్ల తర్వాత తిరిగి చూస్తే పేదలకు అసైన్ చేసింది 40 వేల ఎకరాలకన్నా తక్కువే! ఆ భూముల్ని పేదలకు పంచడం మాట అటుంచితే అసలు భూదాన భూముల్లోని 60 వేల ఎకరాలకు కనీసం సర్వే నంబర్లు కూడా లేవట! ఆ కథాకమామిషు చదవండి.. అగో.. 500 ఎకరాలు ‘వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని ఓ గ్రామంలో నాకున్న 500 ఎకరాల భూమిని దానం చేస్తున్నా..’అని ఓ భూస్వామి రాసిచ్చిన దానపత్రంలో ఉంది. దాని ఆధారంగా 500 ఎకరాల భూమిని భూదాన భూముల్లో చేర్చారు. కానీ ఆ భూముల వివరాలను కూడా కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అసలు ఆ 500 ఎకరాల భూమి ఎక్కడుంది? సర్వే నంబర్ ఏంటి? అనేది కూడా దాదాపు 70 ఏళ్లుగా ఆరా తీయకపోవడంతో ఇప్పుడు భూదాన్ భూముల సర్వే నంబర్లు తేల్చడం, అసలు భూములు ఎక్కడున్నాయో గుర్తించడం అత్యంత క్లిష్టంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే భూదానోద్యమంలో వచ్చిన 1.20 లక్షల ఎకరాల్లో సగం కన్నా ఎక్కువ.. అంటే 60 వేల ఎకరాలకు పైగా సర్వే నంబర్లు లేవని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అందులో 30 శాతం.. అంటే దాదాపు 20 ఎకరాల భూమి అసలెక్కడుందో కూడా గుర్తించలేకపోతున్నామని పేర్కొంటున్నాయి. ఒక్క రంగారెడ్డి జిల్లానే తీసుకుంటే ఆ జిల్లాలో మొత్తం 23,034 ఎకరాల భూదాన భూములుంటే అందులో సర్వే నంబర్లు లేనివి 13,101 ఎకరాలు కాగా.. 4,800 ఎకరాలు అసలెక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి! అక్రమార్కులకు వరంగా.. 1950–55 మధ్య కాలం నుంచి 2000 వరకు భూములకు ధరలు లేకపోవడంతో చూసీచూడనట్టు వదిలేసిన ప్రభుత్వాలు రియల్ఎస్టేట్ బూమ్లోనూ వీటిని పట్టించుకోలేదు. దీంతో అక్రమార్కులు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతోపాటు ధరలు పెరిగిన చోట్ల భూదాన్ భూముల్లోని లొసుగులను వేల కోట్ల భూములను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. భూదానోద్యమంలో వచ్చిన భూమిలో 40 వేల ఎకరాల వరకు పేదలకు పంచారు. కానీ అందులో కూడా 10–15 శాతం పరాధీనమైనట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి భూదాన, గ్రామదాన చట్టం–1965లోని సెక్షన్ 9(1) ప్రకారం భూదాన భూముల్లో క్రయవిక్రయ లావాదేవీలు జరగకూడదు. కానీ ఎప్పుడో 1950లో దానం చేసిన భూములను రెవెన్యూ చట్టంలోని 22(ఏ) సెక్షన్ ప్రకారం నిషేధిత భూముల జాబితాలో చేర్చకుండా 2008 తర్వాత చేర్చడంతో ఈ అసైన్డ్ భూములు కూడా పరాధీనమయ్యాయి. లెక్క తేల్చండి.. రెవెన్యూ శాఖ భూదాన్ భూముల విషయంలో ఆలస్యంగానైనా మేల్కొని ఇప్పుడు వాటి లెక్క తేల్చే పనిలో పడింది. భూదాన్ భూములెక్కడెక్కడ ఉన్నాయి? వాటి సర్వే నంబర్లేంటి? ఆ భూములను అనుభవిస్తున్నది ఎవరు? అసైన్డ్దారులు ఉన్నారా... పరాధీనమయ్యాయా? కబ్జాకు గురయ్యాయా? అనే విషయాలను తేల్చాలని ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. అయితే రెవెన్యూ శాఖలో ఉన్న పని ఒత్తిడి కారణంగా ఇప్పట్లో ఆ లెక్కలూ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. భూదాన్ బోర్డు ఏర్పాటు! భూదాన్ బోర్డును పునరుద్ధరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఈ బోర్డు అధీనంలోనే భూదాన భూముల వ్యవహారాలుండేవి. ఈ భూములతో లింకున్న వివాదాలను పరిష్కరించడంతో పాటు ఆ భూములు భూదానోద్యమంలో వచ్చినవా లేదా అనే విషయాలను తేల్చే బాధ్యత కూడా బోర్డుకే ఉండేది. ఈ బోర్డు ద్వారా కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రద్దు చేసి.. భూదాన భూములను కూడా పూర్తిగా సీసీఎల్ఏ పరిధిలోకి తెచ్చింది. అయితే మళ్లీ భూదాన బోర్డు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, ఇందుకు సంబంధించిన ఫైలు సీఎం వద్ద పెండింగ్లో ఉందని వస్తున్న వార్తలు మళ్లీ అక్రమార్కులకు ఊతమిస్తున్నాయి. భూదాన బోర్డు ఏర్పాటయితే రాజకీయ ఒత్తిళ్ల ద్వారా నెట్టుకురావచ్చనే ధీమా కూడా భూదాన భూముల కబ్జాదారుల్లో కనిపిస్తోంది. ►భూదానోద్యమం ద్వారా సేకరించిన భూమి (ఎకరాల్లో) 1,20,000 ►సర్వే నంబర్లు కూడా కానరాని భూమి (ఎకరాల్లో) 60,000 ►ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాగితాలు లేని భూమి(ఎకరాల్లో) 13,000 ►అసలు ఎక్కడున్నాయో కూడా వివరాలు తెలియని భూమి (ఎకరాల్లో) 4,800