అయ్యో ‘పాప’ం
విజయనగరం టౌన్: మేలిమి బంగారు తల్లి.. పూర్తిగా కళ్లు తెరిచి లోకం పోకడను ఆకళింపు చేసుకోలేని చిన్నారి..కల్మషం తెలియని పసిమనసు. బుగ్గలు చిదిమితే పాలుగారే పసిగుడ్డు..మాయదారి రోగానికి కళ్లు కుట్టి ఆ పసికందును మృత్యుఒడికి చేర్చింది.రక్తపిశాచి కోరల్లో చిక్కుకున్న ఆ పసిమొగ్గకు చికిత్స కోసం ‘సాక్షి’ కథనంతో దాతలు ముందుకు వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తలకు మించిన భారం అయినప్పటికీ తల్లిదండ్రులు పడిన శ్రమ కొరగాకుండా పో యింది. విజయనగరం మండలం గుంకలాం గ్రామానికి చెందిన శిడగం నాగరాజు, సుమలత దంపతుల గారాలపట్టి భానుప్రియ తలసీమియా వ్యా ధితో ఏడాదిగా బాధపడుతూ నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది.
మిమ్స్ ఆస్పత్రి నుంచి చిన్నారి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురాగానే ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్‌తో పాటూ, అంతా ఒక్కసారిగా భోరున విలపించారు. ఒ క్కొక్కరూ చిన్నారిని ఎత్తుకుని ఒక్కసారి చూడమ్మా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఎందరో దాతలు ముందుకు వచ్చి చేయూతనిస్తున్న సమయంలో బిడ్డ బతుకుతుందనే ఆశ కలిగిందని, పాప బోసి నవ్వులు చూసే భాగ్యం తమకు లేకుండా పోయిందంటూ తల్లిదండ్రులు కంటికిమింటికీ ఏకధారగా రోదిస్తుంటే వారిని ఆపతరం కాలేదు. చూస్తున్న అందరి కళ్లూ చెమర్చాయి. చివరకు ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్రామపెద్దల సమక్షంలో ఊరి శ్మశానవాటికలో చిన్నారి భానుప్రియ అంత్యక్రియలు నిర్వహించారు.