breaking news
Automation Project
-
వావ్ ఏం టెక్నాలజీ గురూ,ప్లే అవుతున్న టీవీని పాజ్ క్లిక్ చేసి చూడొచ్చు!
ఎలాంటి కెమెరాలు మిమ్మల్ని క్యాప్చర్ చేయకుండా బాడీ లాంగ్వేజ్ ఎలాంటిదో గుర్తిస్తే. టీవీలో టెలికాస్ట్ అవుతున్న సినిమాలో ఓ కామెడీ సిన్ టెలికాస్ట్ అయ్యే సమయంలో మనం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తాం.తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో ప్లే అవుతున్న సినిమాను పాజ్ నొక్కి ..వెనక్కి వెళ్లి మనకు కావాల్సిన కామెడీ, సాంగ్స్‌ను వీక్షిస్తే. బ్యాడ్ మూడ్‌లో ఉన్న మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు.ఆ క్షణంలో మీ మైండ్ సెట్‌ను గుర్తించి..అందుకు అనుగుణంగా పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌లో మీ మనసుకు నచ్చిన సాంగ్స్ ప్లే అయితే ఎలా ఉంటుంది. ఎస్! మీరు ఊహించింది నిజమే. భవిష్యత్‌లో ప్రస్తుతం మనం ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటోమెషిన్ టెక్నాలజీతో సాధ్యం కానున్నాయి. పైన మనం చెప్పుకున్న ఊహాతీతమైన టెక్నాలజీపై ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పనిచేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ ఎలాంటి కెమెరాల్ని ఊపగించకుండా యూజర్ల కదలికలు, వారి ప్రవర్తనను రికార్డ్ చేసి, విశ్లేషించే కొత్త టెక్నాలజీపై గూగుల్ పనిచేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే బదులుగా శరీర కదలికలను గుర్తించి మానసిక స్థితి అర్థం చేసుకునేందుకు రాడార్‌ను ఉపయోగిస్తుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. కాగా, గూగుల్ ఈ తరహ టెక్నాలజీపై గతంలో పనిచేసింది. 2015లో గూగుల్ సోలి అనే సెన్సార్‌ను ఆవిష్కరించింది. ఇది ఖచ్చితమైన సంజ్ఞలు, కదలికల్ని గుర్తించేలా రాడార్ ఆధారిత ఎలక్ట్రో మ్యాగ్నెట్ తరంగాలను ఉపయోగించింది. గూగుల్ తొలిసారి గూగుల్ పిక్సెల్4లో ఈ సెన్సార్‌ను ఉపయోగించింది. దీంతో మోగుతున్న అలారంను సౌండ్ చేసి ఆపివేయడం, మ్యూజిక్‌ను పాజ్ చేసేందుకు ఉపయోగపడింది. చదవండి👉దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్ అదిరిపోయే ఆఫర్! -
ఫండ్స్‌పై ఆటోమేషన్ నిఘా
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన తనిఖీ, నిఘా వ్యవహారాల కోసం ఆటోమేషన్ ప్రాజెక్టును అమలు చేయనుంది. దీనివల్ల నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడంలో జాప్యాన్ని నివారించొచ్చని సెబీ చీఫ్ అజయ్‌త్యాగి అభిప్రాయపడ్డారు. నిఘా, దర్యాప్తు బాధ్యతలకు సంబంధించి భారీ సాంకేతిక టెక్నాలజీని అమలు చేయబోతున్నట్టు 2019–20 వార్షిక నివేదికలో పేర్కొన్నారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలోనూ నియంత్రణపరమైన కార్యాచరణ పటిష్టానికి పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అవసరమైతే మరిన్ని సంస్కరణలకు సిద్ధంగా ఉన్నట్టు త్యాగి చెప్పారు. సమస్యలు నిజమే: ఎన్పీసీఐ నూతన వ్యవస్థ అమలు కారణంగా ఇన్వెస్టర్లు పెట్టుబడుల సమయంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నట్టు వచ్చిన వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అంగీకరించింది. ‘‘ఇటీవలే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ సదుపాయాలను విస్తరించే లక్ష్యంతో నూతన వ్యవస్థకు మారిపోవడం జరిగింది. ఇది ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసినది. ఆ సమయంలో సెటిల్మెంట్ ఆలస్యం కావడం వంటి ఆరంభ సమస్యలను ఎదుర్కొన్నాము. కానీ, అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీలు నిధులు జమ అయిన రోజు నుంచే అమల్లోకి వస్తాయన్న నియంత్రణపరమైన నిబంధనల అమలు (ఫిబ్రవరి 1నుంచి) కూడా జరిగింది. సాంకేతిక సమస్యలు వస్తే ఇన్వెస్టర్లకు పరిహారం కాగా సాంకేతిక సమస్యల కారణంగా నష్టపోయే ఇన్వెస్టర్లకు పరిహారం లభించే విధంగా సెబీ కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది. -
రిమోట్ నొక్కితే కరెంట్ వచ్చేస్తుంది!
కరెంట్ పోతే ఆటోమేటిక్‌గా మరో లైన్ నుంచి సరఫరా ► జీహెచ్ఎంసీ, పారిశ్రామిక ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ ప్రాజెక్టు డిస్కంల ఆటోమేషన్ ప్రాజెక్టుకు ప్రాథమిక అంచనాల మేరకు అయ్యే ఖర్చు 5,000 కోట్లు జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యం (మెగావాట్లలో) 3,000 గత వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ (మెగావాట్లలో) 2,450 సాక్షి, హైదరాబాద్: సాంకేతిక సమస్యతో భాగ్యనగరంలోని ఓ ప్రాంతంలో కరెంట్ పోయింది.. విద్యుత్ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసేదాకా ఆ ప్రాంతంలో అంధకారమే! ఇకపై ఆ పరిస్థితి ఉండదు. రిమోట్ నొక్కితే చాలు.. 5 నిమిషాల్లోపే ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా కరెంట్ వచ్చేస్తుంది! ‘డిస్కంల ఆటోమేషన్’ప్రాజెక్టుతో ఇది సాధ్యం కాబోతోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)తోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకుని మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించేందుకు గంటల సమయం పడుతోంది. ఇలా సిబ్బంది ద్వారా(మాన్యువల్‌గా) మరమ్మతులు చేసే వరకు వేచి చూడకుండా... స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజిషన్) కార్యాలయం నుంచి రిమోట్ సాయంతో తక్షణమే సరఫరాను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ప్రైవేటు డిస్కంల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతున్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల్లో మాత్రమే ఇలాంటి ఆటోమేషన్ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. ప్రభుత్వరంగంలో తొలిసారిగా ఈ సేవలను అమల్లోకి తెచ్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) కసరత్తు ప్రాంభించింది. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆటోమేషన్ ప్రాజెక్టు రూపకల్పనపై నివేదిక(డీపీఆర్) తయారు చేసే బాధ్యతను తాజాగా ఓ ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఈ ప్రాజెక్టు రూపకల్పనకు దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యం 3 వేల మెగావాట్లు కాగా.. గత వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,450 మెగావాట్లుగా నమోదైంది. డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ ప్రాజెక్టు అమలు కోసం నగరంలో విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని 6 వేల మెగావాట్లకు పెంచనున్నారు. ఇలా అమలు చేస్తారు.. డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ అమలు కోసం జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు. కరెంట్ వినియోగదారుడికి రెండు వనరుల నుంచి విద్యుత్ సరఫరా చేసేలా.. ప్రస్తుతమున్న 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు. రెండు లైన్ల నుంచి సరఫరాకు వీలుగా ప్రతి పోల్‌పై ఓ బాక్స్ ఏర్పాటు చేస్తారు. సరఫరాను ఓ లైన్ నుంచి మరో లైన్‌కు మార్చేందుకు ఈ బాక్స్‌లో సెక్షనలైజర్ అనే పరికరాన్ని అమరుస్తారు. సాంకేతిక కారణాలతో ట్రాన్స్ఫార్మర్/సబ్‌స్టేషన్ నుంచి ఏదైనా లైన్‌కు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే అదేలైన్ ద్వారా సరఫరాను పునరుద్ధరించేందుకు రెండుసార్లు టెస్ట్చార్జ్ చేస్తారు. ఒకవేళ సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ వనరుగా ఏర్పాటు చేసే ట్రాన్స్ఫార్మర్/సబ్ స్టేషన్ నుంచి మరో లైన్ ద్వారా 5 నిమిషాల్లోపు సరఫరాను పునరుద్ధరిస్తారు. రిమోట్ సాయంతో సెక్షనలైజర్కు సంకేతాలు పంపి రెండో లైన్ ద్వారా కరెంట్ సరఫరా చేస్తారు. క్షేత్రస్థాయిలో వెళ్లి మరమ్మత్తులు చేసే వరకు ఎదురుచూడకుండా హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయం నుంచి రిమోట్ సహాయంతో ఈ వ్యవస్థను నిర్వహించనున్నారు. ప్రతిష్ట పెరుగుతుంది సీఎండీ రఘుమారెడ్డి ఈప్రాజెక్టు అమల్లోకొస్తే రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల ప్రతిష్ట పెరుగుతుందని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలిగితే విద్యుత్ అమ్మకాలు తగ్గి సంస్థ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే సాంకేతిక సమస్యలు ఎదురైనా నిరంతరాయంగా సరఫరా కొనసాగించవచ్చని, ఈ ప్రాజెక్టుపై పెట్టే ఖర్చు 4 ఏళ్లలో తిరిగి వస్తుందన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఏడాదిన్నరలో ప్రాజెక్టును అమల్లోకి తెస్తామని చెప్పారు.