ఓటు వేస్తే... లీటర్ పెట్రోల్‌పై ఆఠాణా తగ్గింపు
ప్రజాస్వామ్యంలో సామాన్యుడే దేవుడు. ఆ దేవుడికి ఓటే ఆయుధం. ఓటు ఆయుధాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో... ఓటుపై సామాన్యులకు మరింత అవగాహన కల్పించేందుకు దేశ రాజధాని హస్తినలోని పెట్రోల్ బంకులు యాజమాన్యం నడుంకట్టింది. ఏప్రిల్ 10 హస్తినలో లోక్‌సభ ఎన్నికల జరగనున్నాయి. అందులోభాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న వాహనదారులు లీటర్ పెట్రోల్‌పై రూ.50 పైసల్ తగ్గించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ అజయ్ బన్సాల్ బుధవారం వెల్లడించారు.
అయితే ఓటు వేసినట్లు చేతి వేలిపై సిర చుక్క ఉంటేనే ఈ గొప్ప తగ్గింపు ఆఫరుకు అర్హులని తెలిపారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు. ఓటర్లకు ఓటుపై మరింత అవగాహన కలిగించేందుకు పోస్టర్ల ద్వారా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హస్తిన, నోయిడా,గుర్గావ్, రోహతక్‌లలో మొత్తం 398 పెట్రోల్ బంకులు ఉన్నాయని, వాటిలో 67 అవుట్ లెట్స్‌లో మాత్రమే ఆ సౌకర్యం ఓటర్లకు అందుబాటులో ఉంటుందన్నారు.