breaking news
animal research center
-
వంతారా వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రధాని మోదీ పర్యటన
-
ఈ వారం వ్యవసాయ సూచనలు
నువ్వుల సాగుకు తరుణం ఇదే నువ్వు పంట స్థిరమైన ధర పలుకుతూ రైతులకు ప్రస్తుతం రెండు సంవత్సరా లుగా మంచి ఆదాయ వనరుగా ఉన్నది. ఈ పంటను విత్తుకోవడానికి కోస్తా ప్రాంతాల్లో మే ఆఖరి వరకు, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మే-జూన్ నెలలు అనుకూలమైనవి. గోధుమ రంగులో ఉండే గౌరి, మాధవి, యలమంచిలి-11, యలమంచిలి-66, చందన రకాలు 70-80 రోజుల్లో కోతకు వస్తాయి. ఖరీఫ్ ఆలస్యమైనప్పుడు తెల్ల నువ్వు రకాలైన రాజేశ్వరి, శ్వేతతిల్, హిమ వంటి రకాలు విత్తుకోవడం ద్వారా మంచి దిగుబడితో పాటు అధిక ధర పొందవచ్చు. ఎకరానికి సరిపడే రెండున్నర కిలోల విత్తనానికి ఏడున్నర గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ లేదా మాంకోజెబ్‌తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెం. మీ., మొక్కల మధ్య 15 సెం. మీ. దూరం ఉండేలా మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసలలో విత్తుకోవాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ అవసరం. నత్రజనిలో సగభాగం, భాస్వరం, పొటాష్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. వర్షాకాలంలో వచ్చే కలుపు నివారణకు విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ కలుపు మందును లేదా విత్తిన తర్వాత 24 గంటలలోపు పెండిమిథాలిన్ 30 శాతం లేదా అల్లాకోర్ 50 శాతం 1 లీటరు/ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పశువుల్లో ఎద గుర్తింపు పద్ధతులు పాడి పశువు ఎదకొచ్చినప్పుడు గుర్తించలేకపోతే రైతు 21 రోజుల పాడి కాలం కోల్పోయినట్టే. మూగ ఎదలను గుర్తించే పద్ధతులను తెలుసుకోవడం అవసరం. పాడి పశువును రోజుకు 3 పూటలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. 80% ఉదయం పూటే ఎదకు వస్తుంటాయి. పశువులు ఈనిన 45-60 రోజుల మధ్యలో వైద్యుడితో పరీక్ష చేయించి ఎదకు వచ్చే తేదీని ముందే తెలుసుకొని, ఎదను గుర్తించడం లాభదాయకం. పెద్ద డెయిరీల్లో అయితే ‘టీజర్’ ఆబోతులు లేదా దున్నపోతులను ఉపయోగించి ఎదను పసిగడతారు. పశువు తోకపైన పెయింట్/ రంగు పూసి ఉంచితే ఎద గురించి తెలుస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఎదకొచ్చిన పశువులను జాతి కుక్కల సాయంతో పసిగడుతుంటారు. పెద్ద వ్యాపార సంస్థలు ఎద పశువులను గుర్తించడానికి ప్రత్యేకించి ఒకరిని నియమించాలి. పాలలో ప్రోజెస్టరాన్ హార్మోను ఎక్కువ ఉంటే పశువు ఎదకొచ్చినట్లు గుర్తించాలి. హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చిన 2 -7 రోజుల్లో పశువులు ఎదకొస్తాయి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధనా కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా చేపలకు మొప్పల పరీక్ష ముఖ్యం తెల్లచేపల మొప్పల పరీక్షల ద్వారా చాలా వ్యాధులు, అసాధారణ పరిస్థితులు తెలుస్తాయి. మొప్పల కింది నుంచి చివరి వరకు కణజాలం చనిపోయి తెలుపు /పసుపు గాయం చారలుగా కనిపిస్తుంటే అది తాటాకు తెగులు(బాక్టీరియా వ్యాధి)గా గుర్తించాలి. మొప్పల్లో బియ్యపు గింజల మాదిరిగా కనిపిస్తూ ఉంటే అది ఏకకణ జీవి వ్యాధిగా గుర్తించాలి. మొప్పలు ముద్దగా, కలిసిపోయి ఎక్కువ జిగురు స్రవిస్తూ ఉంటే.. అది మొప్ప పురుగు వ్యాధి కావచ్చు(దీన్ని మైక్రోస్కోపుతో పరీక్షించి నిర్ధారించాలి). రోహు మొప్పల్లో కణాలు పెరిగిపోవడం తదితర కారణాల వల్ల తరచూ చివరలు తెల్లబడుతూ ఉంటాయి. రక్త హీనత వల్ల కూడా మొప్పలు పాలిపోతాయి. కాబట్టి, రైతులు చేపల మొప్పలను గమనిస్తూ అదనపు సలహాల కోసం నిపుణులను సంప్రదించాలి. - డా. రావి రామకృష్ణ (98480 90576), సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు విటమిన్-సి లోపంతో నీలి మొప్పలు! వేసవిలో కొన్ని ప్రాంతాల్లో వెనామీ రొయ్యల మొప్పలు లేత నీలి రంగులో, మరికొన్ని ప్రాంతాల్లో ఇటుక రాయి రంగులో కనిపిస్తాయి. మొప్పలు లేత నీలి రంగులో కనిపించడానికి విటమిన్ సీ లోపం కారణం. కిలో మేతకు 5 గ్రాముల చొప్పున సీ విటమిన్‌ను కలిపి, ఆ మేతను రోజుకు రెండు పూటలు 5 రోజుల పాటు వాడాలి. మొప్పలు ఇటుకరాయి రంగులోకి మారడానికి ఐరన్ అధికపాళ్లలో ఉన్న బోరు నీటిని వాడటమే కారణం. దీని నివారణకు నిపుణులను సంప్రదించాలి. వర్షాలు పడే సమయంలో చెరువులోకి వర్షం నీరు అధికంగా చేరుతూ ఉంటే.. ఉప్పదనం వ్యత్యాసాల వల్ల కలిగే వత్తిడితో రొయ్యలకు నష్టం జరగొచ్చు. చెరువులోకి వచ్చే వర్షపు నీరు వచ్చింది వచ్చినట్లుగా బయటకు పోయేలా స్లూయిజ్ గేటు అమరిక చేసుకుంటే ఈ సమస్య రాదు. సీజన్‌తో నిమిత్తం లేకుండా సంవత్సరం పొడవునా సీడ్ ఉత్పత్తి, స్టాకింగ్ వల్ల రోగకారక క్రిముల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. - ప్రొ. పి. హరిబాబు (98495 95355), మత్స్య కళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా -
వేసవి లోతు దుక్కులు, ప్రయోజనాలు
కృత్తిక కార్తె ( మే 11 నుంచి ) ఈ వారం వ్యవసాయ సూచనలు తొలకరిలో మొదటగా వచ్చే వర్షాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వేసవి దుక్కులు చేయాలి. భూమిని 15-30 సెం. మీ.ల లోతు దున్నడం వలన వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. వాలుకు అడ్డంగా దుక్కులు దున్నడం వలన నేల కోతకు గురికాకుండా ఉంటుంది. చేలలో ఉండే మొండి జాతి కలుపు మొక్కల దుంపలతో సహా పెకలించేలా లోతు దుక్కి దున్నడం వల్ల కలుపు బెడద ఉండదు. భూమిలో నిద్రావస్థలో ఉన్న పలు కీటకాల కోశస్థ దశలు నశింపబడి తదుపరి వేసే పంటల మీద చీడపీడల ఉధృతి తగ్గించవచ్చు. తొలకరిలో దున్నటం వలన నేలలోకి నీరు బాగా ఇంకి భూమి బాగా గుల్లబారి.. తరువాత వేసే పంటకు ఉపయోగపడుతుంది. పంట మొక్కల వేర్లు లోనికి పోయి తేమను, పోషకాలను ఎక్కువ శాతం అందుకొని దిగుబడులు, నాణ్యత పెరుగుతాయి. వేసవిలో దున్నటం వలన గత పంటకు చెందిన ఆకులు, చెత్త నేలలో కలిసి సేంద్రియ పదార్థంగా మారతాయి. ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో వేసవి దుక్కులు చేస్తే.. భూమిలోని శిలీంధ్రాలు నశించి తర్వాత పంటకాలానికి ఆ తెగులు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ముందుగానే దుక్కి చేసుకోవడం వలన వర్షాలు కురవగానే ఖరీఫ్ పంటలను సరైన అదనులో వేసుకోవచ్చు. రేపు విత్తన దినోత్సవం: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని విత్తన పరిశోధన, సాంకేతిక సంస్థలో ఈ నెల 13న విత్తన దినోత్సవం జరుగుతుంది. అధికారులు, శాస్త్ర వేత్తలతో రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన రైతుల ఇష్టాగోష్టి జరుగుతుంది. వివిధ పంటలకు సంబంధించిన మేలు రకం విత్తనాలను ప్రదర్శిస్తారు. వరి మూల విత్తనాలను రైతులకు విక్రయిస్తారు. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు 1100, 1800 425 1110 కిసాన్ కాల్ సెంటర్ :1551 పశువులకు టీకాలు వేయించే కాలం ఇదే.. పాడి పశువుల ఆరోగ్య రక్షణకు టీకాలు వేయించడం ఉపయోగకరం. ఒక్కో పశువుకు రూ. 2, 3ల ఖర్చుతోనే టీకాలు వేయొచ్చు. ఏడాది వరకు పనిచేస్తుంది. గొంతువాపు, జబ్బవాపులకు ఒకే టీకా చాలు.3 నెలల నుంచి మూడేళ్ల వయసు పశువుల వరకు గొంతువాపు సోకే అవకాశం ఉంది. గొంతు కింద వాపొస్తుంది. తీవ్ర జ్వరం వస్తుంది.తెల్ల గొడ్లకు ఎక్కువగా జబ్బవాపు వస్తుంది. జబ్బ దగ్గర వాయడం వల్ల పశువులు కుంటుతుంటాయి. ఖరీదైన చికిత్స కన్నా నివారణే మిన్న. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్స,6-3-249/1, రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034 saagubadi@sakshi.com