నాలుగు కథల సమాహారంగా ‘యాంగర్ టేల్స్’
వెంకటేశ్ మహా, సుహాస్, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘యాంగర్ టేల్స్’. ప్రభల తిలక్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మార్చి 9 నుంచి డిస్ని ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దర్శకుడు నితిన్ ఈ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఈ సిరీస్ నిర్మాణంలో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ అంతా బాగా కోపరేట్ చేశారు. షూటింగ్ అంతా చాలా కూల్ గా సాగిపోయింది. ప్రతి ఒక్కరూ ఈ ఆంథాలజీకి రిలేట్ అవుతారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కథలతో వస్తాం’అన్నారు. ‘చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేది నా కల. ఆ కల ఇలా నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు నటుడు ఫణి ఆచార్య.
‘నితిన్ ఈ కథ చెప్పాలని వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను రంగా పాత్ర చేయాలని ఆ కథ చెప్పాడు. నేను కేవలం రెండు నిమిషాల్లోనే ఎస్ చెప్పాను. ఈ పాత్ర నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది’ అని అన్నారు వెంకటేష్ మహా. ఇక నాలుగు కథల సమాహారంగా వస్తోన్న ఈ ఆంథాలజీకి స్మరణ్ సాయి సంగీతం అందిచారు.