breaking news
Airforce officer
-
#JiteshSharma: అదనపు మార్కుల కోసం క్రికెటర్ అవతారం
పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ స్టన్నింగ్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇటీవలే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేసిన జితేశ్ శర్మ ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ తరపున అత్యధిక స్ట్రైక్‌రేట్ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో జితేశ్ 357.14 స్ట్రైక్‌రేట్ నమోదు చేయడం విశేషం. Photo: IPL Twitter కాగా గత సీజన్లోనే జితేశ్ శర్మ వెలుగులోకి వచ్చాడు. ఎక్కువగా ఆరు లేదా ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తున్న జితేశ్ ఐపీఎల్ 2022లో పంజాబ్ తరపున 12 మ్యాచ్‌ల్లో 163.64 స్ట్రైక్‌రేట్‌తో 234 పరుగులు చేశాడు. ఈ సీజన్లో కూడా జితేశ్ అదిరిపోయే స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు సీజన్లో పంజాబ్ తరపున ఏడు మ్యాచ్‌ల్లో 150 స్ట్రైక్‌రేట్‌తో 145 పరుగులు చేశాడు. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కావాలనుకొని.. Photo: IPL Twitter అయితే జితేశ్ శర్మకు చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి లేదు. పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్‌లో అదనపు మార్కుల కోసం క్రికెటర్ అవతారం ఎత్తాడు. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కావాలన్న కోరిక జితేశ్‌లో బలంగా ఉండేది. మహారాష్ట్రలో ఎన్డీఏ పరీక్షకు స్పోర్ట్స్ కోటాలో ఒక కటాఫ్ ఉంది. ఏ క్రీడ అయినా రాష్ట్ర స్థాయిలో ఆటగాడిగా రాణిస్తే 25 మార్కులు అదనంగా ఇస్తారు. ఇది జితేశ్ శర్మను బాగా ఆకట్టుకుంది. ఎలాగైనా బ్లూ డ్రెస్(ఎయిర్‌ఫోర్స్) వేసుకోవాలని కల గన్న జితేశ్ అలా క్రికెటర్ అవతారం ఎత్తాడు. కట్‌చేస్తే దేశవాలీలో విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్న జితేశ్ శర్మ.. ఇవాళ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున బెస్ట్ ఫినిషర్‌గా ఎదిగాడు. Photo: IPL Twitter ఇక క్రికెట్‌పై తనకు ఆసక్తి లేదన్న విషయాన్ని జితేశ్ శర్మ స్వయంగా వెల్లడించాడు. ప్రాక్టీస్ సందర్భంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'' నేను ఎప్పుడు క్రికెటర్ అవ్వాలనుకోలేదు. నిజానికి నాకు ఎలాంటి చైల్డ్‌హుడ్ కోచ్ లేడు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ క్రికెట్ నేర్చుకున్నా. ముఖ్యంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్, సౌరవ్ గంగూలీ బ్యాటింగ్‌లకు సంబంధించిన వీడియోలను రిపీట్‌గా చూసేవాడిని. డిఫెన్స్‌లోకి వెళ్లి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కావాలన్న కోరిక బలంగా ఉండేది. అయితే మహారాష్ట్రలో స్పోర్ట్స్ కోటాలో 25 మార్కులు అదనంగా ఇచ్చే అవకాశం ఉండేది. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కావడం కోసం క్రికెట్ ఆడడం ప్రారంభించాను. 2011లో 16 ఏళ్ల వయసులో విదర్భ క్రికెట్ అసోసియేషన్ జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నా. అక్కడే నాకు పరిచయం అయ్యాడు అమర్. అమర్ సహా అక్కడికి వచ్చిన చాలా మంది నీకు మంచి టాలెంట్ ఉందని.. క్రికెటర్‌గా మంచి భవిష్యత్తు ఉందని ఎంకరేజ్ చేశారు. అలా ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కలను వదులుకొని క్రికెట్‌వైపు అడుగులేశాను. నా జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: జితేశ్ శర్మ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులు బద్దలు -
ఎదిగిన ఆకాశం
తల ఎత్తి చూస్తే భారత జాతీయ పతాకం కనిపించిందామెకు. ఈ దేశానికి నేను సైతం సేవ చేయాలి అనుకుంది. ఇంటి నుంచి ఆడపిల్ల కాలు బయటపెట్టలేని రోజుల్లో కాలికి యూనిఫామ్ షూ కట్టుకోవడం ఎంత కష్టం. కాని ఉండిపోతే అలాగే ఉండిపోతాం. ఎదగాలి. ఎగరాలి. ఆకాశాన్ని అందుకోవాలి. అంతకు మించిన ఠీవితో తల ఎత్తుకు నిలబడాలి అనుకుందామె. పోరాడింది. గెలిచింది. భారతదేశపు తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి. మగవాళ్ల సామ్రాజ్యంగా ఉండే సైన్యంలో త్రీ స్టార్ ర్యాంక్‌కు ఎదిగిన ధీర మహిళ ఆమె. 1962– చైనా యుద్ధం. ఆ యుద్ధ వాతావరణం, ఆ వాతావరణంలో వినిపించిన ‘అయ్ మేరే వతన్‌కీ లోగో..’ పాట అప్పటి పద్నాలుగేళ్ల అమ్మాయి ఆలోచనా ధోరణిని, జీవనశైలినే మార్చేశాయి. ఆమె దేశానికే తన జీవితాన్ని అంకితం చేసింది. ఫలితం? ఎన్నో ఘనతలను తన పేరుకు ముందు జత చేర్చుకోవడమే కాదు తాజాగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే గౌరవాన్ని పొందింది. నాటి ఆ అమ్మాయే నేటి 76 ఏళ్ల పద్మావతి బంధోపాధ్యాయ. భారత వైమానిక దళంలో తిరుగులేని పేరు. తొలి మహిళా ఎయిర్ మార్షల్, త్రివిధ దళాలలో 3 స్టార్ ర్యాంకుకు ఎదగగలిగిన రెండవ మహిళ, డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కోర్స్ పూర్తి చేసిన తొలి మహిళా అధికారి, ఏవియేషన్ సైన్స్‌లో తొలి మహిళా ఎక్స్పర్ట్, ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్... ఇంత కీర్తి ఉన్నా ఎంతో ఒదిగి ఉండడం పద్మావతికున్న ముఖ్యమైన క్వాలిఫికేషన్. అదే ఈ రోజు ఆమె గురించి తెలుసుకునేలా చేసింది. పుట్టింది 1944వ సంవత్సరం తిరుపతిలో. తండ్రి ఎస్.స్వామినాథన్, తల్లి అలమేలు. కాని పెరిగింది మాత్రం ఢిల్లీలో. చదువును ఆడపిల్లలకు ఆమడదూరం ఉంచే కాలం కావడం ఒకటి, కుటుంబ çకట్టుబాట్ల కారణాన మరొకటి మొత్తానికి పదేళ్లు వచ్చేవరకు బడిని చూడలేదు పద్మావతి. అప్పటిదాకా సోదరుడి పాఠ్యపుస్తకాలతోనే అక్షర జ్ఞానం సంపాదించుకుని నేరుగా అయిదవ తరగతిలో బడిలో చేరింది. డాక్టర్ కావాలని పద్మావతి కల. కాని ఎనిమిదవ తరగతి పూర్తయ్యాక సైన్స్ అండ్ ఆర్ట్స్ కోర్సులు ఉన్న స్కూలు ఇంటికి దూరంగా ఉండటంతో అంతదూరం ఆడపిల్లను బస్సులో పంపడం ఇష్టం లేక ఇంటిముందున్న స్కూల్లోనే పద్మావతిని చేర్పించింది తల్లి. ఆ స్కూల్లో డొమెస్టిక్ సైన్స్, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, తమిళం, సంస్కృతం చదువుకుంది పద్మావతి. బోర్డ్‌లో ఫస్ట్‌న నిలిచింది. ఇప్పుడు పెద్దదయ్యింది కనుక ప్రీ మెడికల్ చదువుతా అని ఉత్సాహపడింది పద్మావతి. ఆ మాట విని అందరూ నవ్వారు. ‘సైన్స్ బేస్ లేంది ప్రీ మెడికల్ ఎలా చదువుతావు?’ అన్నారు. అయినా వెరవక ప్రీ మెడికల్‌లో చేరాలనే పట్టుపట్టిన కూతురి కోసం తండ్రి ‘మా అమ్మాయికి సీట్ ఇవ్వండి.. ’ అంటూ ఢిల్లీలోని ఎక్కని కాలేజి మెట్టు లేదు.. చేతులు జోడించి విన్నవించుకోలేని కాలేజీ సిబ్బంది లేదు. మొత్తానికి ఒక కాలేజ్ ఆ రిక్వెస్ట్‌ను మన్నించి పద్మావతికి ప్రీ మెడికల్ చదువుకు అవకాశమిచ్చింది. అలా ఢిల్లీ బోర్డ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఢిల్లీ యూనివర్శిటీ సైన్స్ కోర్సెస్‌కు వెళ్లిన తొలి విద్యార్థిని పద్మావతే అయ్యింది. ఎయిర్‌ఫోర్స్‌లో.. అప్పుడే అంటే 1962లో వచ్చిన చైనా యుద్ధం ఆమెలో ‘దేశం కోసం ఏదైనా చేయాలనే’ ఆలోచనను రేకెత్తించాయి. ఎలాగైనా ఆర్మీలో చేరాలి అని నిశ్చయించుకుంది. అసలు వాళ్లింట్లో ఏ తరమూ కనీసం మిలిటరీ కవాతు శబ్దం కూడా విని ఎరగదు. ఆ మాటకొస్తే పద్మావతికీ దానికి సంబంధించిన అవగాహన ఆవగింజంతైనా లేదు. ఆమె ఆకాంక్ష విన్న వాళ్లంతా ఎద్దేవా చేయడమే ‘అమ్మాయి అయ్యుండి మిలటరీలో చేరుతావా?’ అని. ఈలోపు అదే యేడు ఆర్డ్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది. ‘ఇది నాకోసమే అనుకుంది’ పద్మావతి. ఆ తర్వాతి యేడు అందులో సీటు తెచ్చుకుంది. పూర్తయ్యాక వైద్యసేవలను అందించడానికి ఎయిర్‌ఫోర్స్‌ను ఎంపిక చేసుకుంది. ‘ఆ వయసులో ఆ యూనిఫామ్, ఆ విమానాల విన్యాసాలు చూస్తుంటే ఎయిర్ ఫోర్స్ అంటే క్రేజ్ ఉండేది. అందుకే దాన్ని ఎంచుకున్నా’ అంటారు పద్మావతి నవ్వుతూ. ఎలాగూ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాను కాబట్టి పైలట్‌గా కూడా ప్రయత్నిద్దామని దానికోసమూ శ్రమించింది ఆమె. అయితే ఫిట్నెస్ లేని కారణంగా ఆ అవకాశం రాలేదు. అయినా నిరాశ పడలేదు. ఏవియేషన్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ చేసింది. అలాగైనా పెలట్స్ కలిసి పనిచేయొచ్చని. అనుకున్నట్లుగానే తను పని చేసిన చాలాచోట్ల పైలట్స్‌తో ఎయిర్‌క్రాఫ్ట్స్‌లో ప్రయాణించింది కూడా. 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో.. యుక్త వయసులో చైనా యుద్ధం చూసింది. సర్వీస్‌లో చేరగానే పాకిస్తాన్‌తో యుద్ధ పరిస్థితులు అనుభవంలోకి వచ్చాయి. అప్పుడు ఆమె పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఇంటర్న్‌షిప్‌లో ఉంది. కుటుంబంతో కలిసి ఉండే నివాస ప్రాంతం కాదు అది. ‘అందుకే బంకర్లలో ఉండేవాళ్లం. అప్పటికి నాకు ఆరునెలల కొడుకు. నేను తప్ప ఆ బంకర్లలో మిగిలిన వాళ్లంతా మగవాళ్లే. నా పారామెడికల్ స్టాఫ్‌తో కలిసి బంకర్లో ఉండేదాన్ని. యుద్ధం మొదటి రోజు పాకిస్తాన్ బాంబ్‌తో దాడి చేసింది. ఆ టైమ్‌లో మేము బయటే నిలబడి ఉన్నాం. రెండో రోజు 250 మంది క్షతగాత్రులయ్యారు. వాళ్లందరికీ చికిత్స చేశాను. మెడిసిన్‌లో ప్రాక్టికల్ లెసన్స్ నేర్చుకున్న సందర్భం అది’ అంటూ ఆ రోజులను గుర్తు తెచ్చుకున్నారు పద్మావతి. కార్గిల్ యుద్ధమప్పటికీ ఆమె కల్నల్‌గా పర్యవేక్షణా బాధ్యతల్లో ఉన్నారు. ఎప్పటికీ మరిచిపోలేనివి.. ‘‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని అయ్యాక.... ముందు కార్ ఫ్లాగ్ ఎగురుతుండగా నా అధికార వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే అక్కడున్న ఆడవాళ్లంతా చప్పట్లు కొట్టారు. ఎందుకు అలా? అని అడిగాను. ఇప్పటివరకు భార్యను పక్కన కూర్చోబెట్టుకొని అధికార వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లిన మేల్ ఆఫీసర్లనే చూశాం. కాని ఇప్పుడు ఒక మహిళ దర్పంగా అధికార వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే గర్వంగా అనిపించి చప్పట్లు కొట్టాం అని చెప్పారు. అప్పుడు ఆ ప్రత్యేకత తెలిసింది నాకు’’ అంటూ తను ఎప్పటికీ మరిచిపోలేని విషయాలను పంచుకున్నారు. పద్మావతి భర్త ఎస్.ఎన్.బందోపాధ్యాయ కూడా ఎయిర్‌ఫోర్స్‌లోనే సేవలందించారు. 1971 పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ ఇద్దరికీ ఒకే రోజున విశిష్ఠ సేవా పురస్కారం లభించింది. భార్యభర్తలిద్దరూ ఒకేసారి.. ఒకే రోజున ఇలా మెడల్ తీసుకోవడం ప్రపంచ సైనికచరిత్రలోనే లేదు. అదీ రికార్డే. ‘నాకు మా నాన్న, నా భర్త.. ఇద్దరూ స్ఫూర్తే. వీళ్లిద్దరూ ఆడ, మగ ఇద్దరూ సమానమని నమ్మారు కాబట్టే నేను ఈ రోజు దేశానికి తెలిశాను’ అంటారు పద్మావతి. ‘పనికి ఆడ, మగ వ్యత్యాసం ఉండదు. సామర్థ్యమే ప్రధానం. ఏ స్త్రీ అబల కాదు. మహిళ నిర్ణయాధికారమే సాధికారత. చదువుతోనే అది సాధ్యమవుతుంది’ అని చెప్తారు పద్మావతి. మత సామరస్యం నేను దక్షిణ భారతదేశంలో పుట్టి ఢిల్లీలో పెరిగాను. మా ఆయన వాళ్లది ఉత్తర ప్రదేశ్‌లో స్థిరపడ్డ బెంగాలీ కుటుంబం. మేం పెళ్లిచేసుకున్నాం. కులం, మతం, ప్రాంతం ప్రాతిపాదికగా కాదు. భారతీయత ప్రాతిపాదికగా. కులం, మతం, ప్రాంతంతో గొడవలెందుకు? అందరం భారతీయులమే. ఈ సందర్భంగా నా చిన్నప్పటి సంఘటన ఒకటి చెప్తాను. దేశ విభజనప్పుడు జరిగిన మత కల్లోలాల సమయంలో మేము లోఢీ మార్గ్‌లో ఉండేవాళ్లం. అది ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఆ టైమ్‌లో ఓ రెండు రోజులు మా పేరెంట్స్ నన్ను ఓ ముస్లిం ఇంట్లో ఉంచి వెళ్లారు. ఆ రెండు రోజులు నా పేరును ఫాతిమాగా మార్చి కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ కుటుంబం. తర్వాత వాళ్లు పాకిస్తాన్ వెళ్లారో.. ఎక్కడికి వెళ్లారో.. వివరాలు తెలియలేదు. మానవత్వానికి ఇంతకుమించిన ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? – పద్మావతి బంధోపాధ్యాయ -
ఐఎస్ఐకు మాజీ సైనికుడి గూఢచర్యం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ గూఢచారి సంస్థ (ఐఎస్ఐ) తరఫున గూఢచర్యం నెరపుతున్నట్లు ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి రంజిత్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నాయని అనుమానంతో రంజిత్ సింగ్‌ను సోమవారం పంజాబ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి స్వస్థలం కేరళగా గుర్తించారు. కాగా పోలీసులు ఇవాళ రంజిత్ సింగ్‌ను స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారణ నిమిత్తం అతడిని అయిదు రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు. అయిదేళ్లుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్న రంజిత్ అధికారి పాకిస్థాన్ ఏజెన్సీలు పన్నిన వలలో చిక్కుకున్నాడు. సదరు సంస్థలు ఎరవేసిన ఓ యువతితో (హనీ ట్రాప్) అశ్లీల వీడియో చాటింగ్‌తో ఫిదా అయి.. కీలకమైన రహస్య సమాచారాన్ని ఆమెకు అందించాడు. గత మూడు నెలలుగా సాగుతున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూపీ లాగడంతో వెలుగులోకి వచ్చింది. కాగా యువతిని ఎరగావేసిన పాక్ సంస్థలు తమకు కావాల్సిన సమాచారం మొత్తం లాక్కున్నాయని తేలింది. ఎయిర్‌ఫోర్స్‌లో ఉండే కీలక నెట్వర్క్ వ్యవస్థ పనితీరు, అధికారులు పేర్లు, ఫోన్ నంబర్లు, బేస్ క్యాంప్‌ల వివరాలు, హెడ్ క్వార్టర్స్ అడ్రస్‌లు, వంతెనల వివరాలను రంజిత్.... ఆ యువతికి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులు గతరాత్రి రంజిత్‌ను విధుల నుంచి తొలగించారు. అలాగే సైనికాధికారుల నుంచి రహస్యాలను సేకరిస్తున్న ‘గూఢచర్య’ రాకెట్‌కు సంబంధించి జమ్మూకశ్మీర్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.