breaking news
advance information
-
ముందుగా చెప్పాలా.. ప్రధాని చెప్పలేదా?
-
ముందుగా చెప్పాలా.. ప్రధాని చెప్పలేదా?
నల్లధనం ఉన్నవాళ్లు వెంటనే దాన్ని బయటపెట్టాలని, అందుకు ఇదే చిట్టచివరి అవకాశమని, తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండబోదని నల్లధనం వెల్లడి పథకం సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారని, అయినా అప్పట్లో చాలామంది పట్టించుకోలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఇప్పుడు మాత్రం కొంతమంది నోట్ల రద్దు విషయాన్ని ముందుగా చెప్పాలి కదా అంటున్నారని, ప్రధానమంత్రి అంత స్పష్టంగా 'మన్‌కీ బాత్'లో చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకపోతే ఎవరేం చేస్తారని అన్నారు. నోట్ల రద్దు విషయమై ఆయన శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. 500, 1000 నోట్ల రద్దు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమీ కాదని, దాని వెనుక చాలా సుదీర్ఘమైన ఏర్పాట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. స్వార్థ ప్రయోజనాలు ఉన్న కొద్దిమంది తప్ప ఈ చారిత్రక నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల వద్ద ఉన్న నల్లధనం పనికిరాకుండా పోతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతులను ఇలా అవమానించవద్దని చెప్పారు. తాను కూడా రైతునే అని ఈ సందర్భంగా అన్నారు. రైతుల దగ్గర ఎంత డబ్బున్నా దాని మీద పన్ను ఉండదని, అందువల్ల వాళ్లు డబ్బులను బ్యాంకులలో డిపాజిట్ చేసుకుని అవసరాల కోసం తీసుకోవచ్చని తెలిపారు. సమాంతర ఆర్థిక వ్యవస్థ వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటున్నాయని, అందువల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. నల్లధనం తప్ప బస్సులు, మెట్రోలు అన్నీ నడుస్తున్నాయంటూ ఆయన చమత్కరించారు. ఏవీ ఆగలేదన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులకు కలుగుతున్న కష్టాలను టీవీ చానళ్లు చూపించవచ్చని, అయితే కేవలం వాటిని మాత్రమే హైలైట్ చేస్తూ, అసలు నిర్ణయాన్ని స్వాగతిస్తున్న అంశాన్ని వదిలేస్తే ఎలాగని అన్నారు. టీవీ చానళ్లు ప్రతియేటా తమ లైసెన్సులను పునరుద్ధరించుకోవాలన్న నిబంధనను తొలగించాలని తాము నిర్ణయం తీసుకున్నామని, దీనిపై రాష్ట్రాల సమాచార శాఖ మంత్రులతో డిసెంబర్ 9, 10 తేదీలలో ఒక సమావేశం నిర్ణయిస్తామని కూడా ఈ సందర్భంగా వెంకయ్య తెలిపారు.