డీలర్ల పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌?

టీడీపీ కార్యకర్తలకు షాపులుకట్టబెట్టేందుకేననే ఆరోపణలు

అది ప్రశ్నాపత్రం కాదు.. ‘కీ’ : ఆర్డీఓ

కడప సెవెన్‌రోడ్స్‌: కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ చౌకదుకాణాల భర్తీ కోసం శుక్రవారం కడపలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్‌ అయిం దంటున్న అంశం తీవ్ర కలకలం రేపుతోంది. రేషన్‌ షాపులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టడం కోసం అధికారులే ఈ నిర్వాకానికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎఫ్‌ పీ షాపుల భర్తీని అడ్డుకునేందుకు కొందరు చేస్తున్న పన్నాగమే తప్ప.. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు అంటున్నారు. గతంలో రాత పరీక్షకు 60, ఇంటర్వ్యూకు 40 మార్కులు ఉండేవి. రాత పరీక్షలో అంతంత మాత్రం మార్కులు వచ్చినా ఇంట ర్వ్యూలో అధిక మార్కులు వేసి తమకు కావా ల్సిన వ్యక్తులకు ఎఫ్‌ పీ షాపులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఈ సారి రాత పరీక్షలకు 80, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. ఇందువల్ల నిజమైన ప్రతిభావంతులకే ఎఫ్‌పీ షాపులు వస్తాయని భావించారు. కాగా ఈసారి ఏకంగా ప్రశ్నాపత్రాన్నే లీక్‌ చేసి అస్మదీయులకు షాపులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. కడప రెవెన్యూ డివిజన్‌లో 275 ఎఫ్‌పీ షాపుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. కాగా 49 షాపులకు దరఖాస్తులే రాలేదు. ఇక రాత పరీక్ష కోసం 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 725 మంది హాజరయ్యారు. రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు జీఓ ఎంఎస్‌ నంబర్‌: 4 ప్రకారం 1:5 నిష్పత్తిలో సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రశ్నాపత్రం లీకైంýదంటూ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

పరీక్షలను రద్దు చేయాలి: టీడీపీ నేతల డిమాండ్‌
చౌక దుకాణాల భర్తీకోసం శుక్రవారం నిర్వహించిన రాత పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వీణా అజయ్‌కుమార్, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ విశ్వనాథరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాత పరీక్షలకు ముందుగానే పేపర్‌ లీక్‌ అయిందని ఆరోపించారు. అందులో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షల్లో అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోనే జవాబులను టైప్‌ చేసి పంపించడం జరిగిందన్నారు. పరీక్ష ప్రారంభమైన అరగంటకే ప్రశ్నాపత్రం బయటికి రావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ పరీక్షలను రద్దు చేసి అదే అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ప్రశ్నాపత్రం లీకేజీకి కారకులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జనార్దన్, బ్రహ్మ, శ్రీను పాల్గొన్నారు.

ప్రశ్నాపత్రం కాదు.. కీ: ఆర్డీఓ
ఈ అంశంపై ఆర్డీఓ దేవేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. అది ప్రశ్నాపత్రం కాదని.. కీ అని తెలిపారు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఎఫ్‌పీ షాపుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రతిసారి కొందరు వ్యక్తులు ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. ఈసారి కూడా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని పేర్కొన్నారు. అయితే తాము కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడంతో.. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందన్నారు. దీంతో షాపుల భర్తీ ప్రక్రియకు లైన్‌ క్లియర్‌ కావడంతో కొందరు జీర్ణించుకోలేక పోయారన్నారు. ప్రశ్నాపత్రాన్ని పౌరసరఫరాల అధికారులు రూపొందించి తొమ్మిది సీల్డ్‌ కవర్లలో పరీక్షకు అరగంట ముందు తమకు పంపారని తెలిపారు. అందరి సమక్షంలో తొమ్మిది సీల్డ్‌ కవర్లను తెరిచి ప్రశ్నాపత్రాలను అభ్యర్థులకు పంపిణీ చేశామన్నారు. అన్నీ పారదర్శకంగా ఉండేందుకు వీడియో కూడా తీయించామన్నారు. ఈ విషయంలో అవకతవకలు జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top