
రేవంత్ లావాదేవీల సెల్ నెంబర్ 89910 72510
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ఓటును కొనుగోలు చేసేందుకు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉపయోగించిన సెల్ఫోన్ నెంబర్ బయటకు వచ్చింది. 89910 72510 నెంబరు నుంచే ఆయన అన్ని లావాదేవీలు నడిపించినట్లు తెలిసింది.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ఓటును కొనుగోలు చేసేందుకు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉపయోగించిన సెల్ఫోన్ నెంబర్ బయటకు వచ్చింది. 89910 72510 నెంబరు నుంచే ఆయన అన్ని లావాదేవీలు నడిపించినట్లు తెలిసింది. వాస్తవానికి వరుసగా నాలుగు రోజుల పాటు రేవంత్ రెడ్డిపై ఏసీబీ నిఘా పెట్టింది. తన ఓటు కొనేందుకు టీడీపీ వాళ్లు ప్రయత్నిస్తున్నారంటూ ఎమ్మెల్యే స్టీఫెన్ మే 28 సాయంత్రం 3 గంటలకు ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మత్తయ్య అనే వ్యక్తి తనకు రూ. 2 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని స్టీఫెన్ తెలిపారు. విదేశాలకు వెళ్లేందుకు ఒక టికెట్ కూడా ఇస్తానన్నాడని ఏసీబీకి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు ఓటు వేయకపోయినా, టీడీపీకి ఓటేసినా రూ. 5 కోట్లు ఇస్తానన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెబాస్టియన్ అనేవ్యక్తి తనకు ఇస్తారని చెప్పినట్లు స్టీఫెన్ ఫిర్యాదులో ఉంది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి డీల్ చేస్తారంటూ సెబాస్టియన్ చెప్పారని కూడా తెలిపారు. దీంతో హైదరాబాద్ సిటీ రేంజి-1 డీఎస్పీకి ఏసీబీ డీజీ ఈ ఆపరేషన్ను అప్పగించారు.
ఆపరేషన్ సాగిందిలా..
టాస్క్ఫోర్స్, సిటీ పోలీసులు సాయంతో ఆపరేషన్ ప్రారంభమైంది. మే 31 ఆదివారం సికింద్రాబాద్ లాలాగూడ లోని పుష్పనిలయం వద్ద ఏసీబీ, పోలీసులు నిఘా ఉంచారు. సాయంత్రం 4 గంటల నుంచి పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం 4.40 నిమిషాలకు ఏపీ09 సీవీ 9939 నెంబరు మహీంద్రా స్కార్పియో వాహనం అక్కడకు వచ్చింది. అందులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ ఇద్దరూ వచ్చారు. తర్వాత కొన్ని నిమిషాలకే టీఎస్ 10 యూఏ 1031 నెంబరుతో నల్లరంగు వెర్నా కారు వచ్చింది. అందులో ఉదయసింహా వచ్చారు. ఆయన బ్యాగులో తనతో పాటు రూ. 50 లక్షల సొమ్ము తెచ్చారు. పుష్పనిలయం ఫ్లాట్ నెంబర్ 204లోకి ముగ్గురు వ్యక్తులు అడుగుపెట్టారు. అడ్వాన్స్ రూపంలో రూ. 50 లక్షలను ఉదయసింహా టీపాయ్ మీద పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి కాగానే మిగిలిన రూ. 4.5 కోట్లను ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే డీజిల్ కంపెనీ ముద్ర ఉన్న నల్ల బ్యాగులో గల రూ. 50 లక్షలను, మరో రెండు ఐఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.