టెక్‌ తేనెటీగలు | Japan's National Institute of Advanced Industrial Science and Technology Company | Sakshi
Sakshi News home page

టెక్‌ తేనెటీగలు

Feb 14 2017 1:45 AM | Updated on Sep 5 2017 3:37 AM

టెక్‌ తేనెటీగలు

టెక్‌ తేనెటీగలు

‘‘ఈ భూమ్మీద తేనెటీగలు మాయమైపోతే ఆ తరువాత నాలుగేళ్లలో మనిషన్న వాడు కూడా లేకుండా పోతాడు’’...

‘‘ఈ భూమ్మీద తేనెటీగలు మాయమైపోతే ఆ తరువాత నాలుగేళ్లలో మనిషన్న వాడు కూడా లేకుండా పోతాడు’’... ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ చేసినట్టుగా చెబుతున్న ఈ వ్యాఖ్య అక్షర సత్యం. మొక్కల్లో పరపరాగ సంపర్కానికి ఇవే కీలకమని మనమూ చదువుకున్నాం. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తేనెతుట్టెలు, తేనెటీగలు కరవైపోతున్నాయి. రసాయనిక క్రిమి, కీటక నాశినులను ఈ చిన్ని ప్రాణాలు తట్టుకోలేకపోతున్నాయి. నిజమేగానీ... ఇప్పుడీ విషయమంతా ఎందుకు అంటే... ఈ ఫొటోలు చూసేయండి!. పువ్వు మధ్యలో ఓ బుల్లి డ్రోన్‌ కనిపిస్తోందా... అది కూడా ఓ తేనెటీగ వంటిదే. కాకపోతే జీవంతో కాకుండా బుల్లి మోటార్‌తో నడుస్తుంది. ఇది అచ్చం తెనెటీగల మాదిరిగానే పూల పుప్పొడిని అటు ఇటూ మార్చేస్తుందట కూడా. జపాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ ఇండస్ట్రియల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ వీటిని డిజైన్‌ చేసింది.

రెండంటే రెండు అంగుళాల సైజుండే డ్రోన్‌ అడుగు భాగంలో జంతువుల వెంట్రుకలు కొన్ని అతికించారు. ఈ వెంట్రుకలకు కొంత జిగురు కూడా జోడించడంతో వాలిన ప్రతి పువ్వు నుంచి ఇది పుప్పొడిని సేకరించగలదు. ఆ తరువాత ఇంకో పువ్వుపై రాలితే చాలు... కాగల కార్యం అయిపోయినట్లే! అయితే ప్రస్తుతానికి ఈ డ్రోన్‌లను వాడే అవకాశాలు లేవని, జీపీఎస్, కృత్రిమ మేధ వంటి కొన్ని ఇతర హంగులను జోడించాల్సి ఉందని అంటున్నారు వీటిని సృష్టించిన శాస్త్రవేత్త ఇజిరో మియాకో! అంతేకాకుండా ఈ డ్రోన్లు పూల లోపల పాక్కుంటూ కదిలేందుకు సూక్ష్మస్థాయి యంత్రాలు కూడా అవసరమవుతాయని, మరింత స్పష్టమైన చిత్రాలు తీయగల చిన్న చిన్న కెమెరాలను అభివృద్ధి చేయాల్సి ఉందని అంటున్నారు ఆయన. నశించి పోతున్న తేనెటీగలకు ప్రత్యామ్నాయంగా డ్రోన్లను వాడాలన్న మియాకో ఐడియా బాగానే ఉన్నప్పటికీ ఇందుకు అభ్యంతరపెట్టే వారూ లేకపోలేదు. ప్రపంచం మొత్తమ్మీద ప్రస్తుతం దాదాపు 3.2 లక్షల కోట్ల తేనెటీగలు ఉన్నాయి అనుకుంటే.. అవి తమనుతాము పోషించుకుంటూ మనిషికి ‘తేనె’ను అందిస్తున్నాయని, యంత్రాలు ముమ్మాటికీ ఆ పని చేయలేవని అంటున్నారు ససెక్స్‌ విశ్వవిద్యాలయ బయాలజిస్ట్‌ డేవిడ్‌ ఘాల్‌సన్‌.    – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement