దేశీయంగా నెలకొన్న ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా భారత కార్పొరేట్లు, బ్యాంకులు బలహీనపడ్డాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. బ్యాంకులు, కార్పొరేట్ల లాభాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు మరింత పెరిగాయని తెలిపింది.
వాషింగ్టన్: దేశీయంగా నెలకొన్న ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా భారత కార్పొరేట్లు, బ్యాంకులు బలహీనపడ్డాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. బ్యాంకులు, కార్పొరేట్ల లాభాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు మరింత పెరిగాయని తెలిపింది. అలాగే, వృద్ధి రేటు అంచనాలను మరింత కుదించే పరిస్థితి కూడా తలెత్తవచ్చని శుక్రవారం విడుదల చేసిన ఆసియా, పసిఫిక్ దేశాల ఆర్థిక పరిస్థితులపై నివేదికలో ఐఎంఎఫ్ వివరించింది. ఆర్థిక సంక్షోభ ప్రభావాలతో ఆసియాలో కొన్ని దేశాలు తీవ్ర ఒత్తిడికి లోనైనప్పటికీ...చాలా దేశాల్లో ఇది ఇంకా అదుపులోనే ఉందని ఐఎంఎఫ్ తెలిపింది. డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ, ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం రెండంకెల్లోనే కొనసాగవచ్చని వివరించింది.
భారత్‌కు వచ్చే ఏడాదిలో ఉపశమనం..: భారత్ ఎకానమీ వచ్చే ఏడాది గణనీయంగా కోలుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్ డెరైక్టర్ (ఆసియా పసిఫిక్ విభాగం) అనూప్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలు ఇందుకు తోడ్పడగలవని వివరించారు. మరోవైపు, వృద్ధి విషయంలో భారత ప్రభుత్వం, ఐఎంఎఫ్‌ల అభిప్రాయాల మధ్య కొన్ని త్రైమాసికాల వ్యత్యాసమే ఉందన్నారు.