
మనకూ.. వెజిటబుల్ హబ్‌లు
జిల్లాలో వెజిటబుల్ హబ్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.
మహబూబ్‌నగర్ వ్యవసాయం: జిల్లాలో వెజిటబుల్ హబ్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్టు మొదటి వారం నుంచి 9గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూరగాయల పెంపకాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా మెదక్ జిల్లాలో 5, రంగారెడ్డిలో రెండు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు చొప్పున మొత్తం పది క్లస్టర్లను ఏర్పాటు చేశారు.
ఈ క్లస్టర్ వెజిటబుల్ హబ్‌లు విజయవంతమైతే వీటిని మరిన్ని గ్రామాలకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ పనులను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే జిల్లాలో కూరగాయల సాగు మరింత పెరగనుంది. ఇక్కడ పండించిన కూరగాయలను ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పించనుండడంతో ఎక్కువ మంది రైతులు ఈ విధానానికి మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు...
కూరగాయల సాగుకు అనుకూల వసతులు, వనరులు కలిగిన రైతులను ఈ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. మొదటి విడతగా షాద్‌నగర్, బాలానగర్ క్లస్టర్‌లను అధికారులు ఇప్పటికే గుర్తించారు. షాద్‌నగర్ క్లస్టర్ పరిధిలోవేల్జేర్ల, మధునాపూర్, బూర్గుల, కిషన్‌నగర్, రాయికల్, బాలానగర్ క్లస్టర్ పరిధిలో మోతినగర్, వీర్లపల్లి, చిన్నరేవల్లి, ఉడిత్యాల గ్రామాలను గుర్తించారు. షాద్‌నగర్ క్లస్టర్‌లో 100 హెక్టార్లకు 250 మందిని, బాలానగర్ మండలంలో 100 హెక్టార్లకు 112మంది చొప్పున రైతులను అధికారులు ఇప్పటికే గుర్తించారు.
ప్రాజెక్ట్ అమలు ఇలా...
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాలో ఒక్కో క్లస్టర్‌కు 250 ఎకారాల చొప్పున 500 ఎకరాలను గుర్తించారు. క్లస్లర్‌కు రూ.62 లక్షల చొప్పున రూ.1.24 కోట్లు జిల్లాకు ఇప్పటికే మంజూరయ్యాయి. ఇలా ఒక్కో హెక్టార్‌కు 62వేల చొప్పున రైతులకు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇవ్వనుంది. ఇందులో భాగంగానే తీగజాతి, ట్రెలీస్, మల్చింగ్ పద్ధతుల్లో సాగు చేసుకోవడానికి కావాల్సిన పరికరాలు, కూరగాయల విత్తనాలు, పండించిన కూరగాయలను మార్కెటింగ్‌కు తరలించేందుకు ప్లాస్టిక్ ప్లేట్లను 50శాతం సడ్సిడీపై రైతులకు ప్రభుత్వం అందజేయనుంది.
అలాగే పండించిన కూరగాయలను అమ్ముకోవడానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటిని రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయనుంది. ప్రతి క్లస్టర్‌లో మార్కెటింగ్ శాఖ అధ్యర్యంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇలా రైతులు పండించిన కూరగాయలను నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మే అవకాశం ఉంటుంది. ప్రతి రైతుకు ఒక బ్యాంక్ అకౌంట్‌ను ఏర్పాటు చేసి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద కూరగాయలను అమ్మిన తరువాత 3 రోజుల నుండి వారం రోజుల్లోగా ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాకు సొమ్మును జమచేయనున్నారు.