రుణమాఫీ గజిబిజి

TRS Government Focus On Farmers Loan Waived - Sakshi

బ్యాంకు లెక్కలకు, వ్యవసాయశాఖ లెక్కలకు మధ్య కుదరని పొంతన

పసుపు, చెరకు రైతులను బ్యాంకర్లు విస్మరించారంటున్న అధికారులు 

తమ దగ్గరున్న లెక్కలను ఇప్పటికే ఆర్థికశాఖకు అందజేసిన బ్యాంకులు 

రుణమాఫీపై మొదలైన కసరత్తు.. రైతుబంధు సొమ్ము చెల్లించాకే మాఫీ! 

బ్యాంకుల లెక్క ప్రకారం మాఫీ చేయాల్సిన రుణం.. 20,000కోట్లు

వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం రుణమాఫీ మొత్తం.. 26,000 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌ : రైతు రుణమాఫీపై సర్కారు కసరత్తు ప్రారంభించింది. మాఫీ అమలుకు సంబంధించి మార్గ దర్శకాలను ఖరారు చేసే ప్రక్రియ ను వ్యవసాయశాఖ మొదలు పెట్టింది. రుణమాఫీని ఎలా, ఎప్పటినుంచి అమలు చేయాలి? అర్హులను ఎలా గుర్తించాలి? గత రుణమాఫీ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తాయి? ఈసారి అటువంటి విమర్శలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తది తర అంశాలపై అధికారులు మేధోమథనం చేస్తున్నారు. అందులో భాగంగా అసలు రుణమాఫీ ఎంత చేయాల్సి వస్తుందన్న దానిపై లెక్కలు తీస్తున్నారు. అయితే రుణమాఫీకి ఎంత సొమ్ము అవసరమన్న దానిపై గందరగోళం నెలకొంది. బ్యాంకు లెక్కలకు, వ్యవసాయశాఖ లెక్కలకు మధ్య పొంతన లేకుండా పోయింది. రుణమాఫీ అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా ఈ గందరగోళం నెలకొంది. ఏది సరైన సమాచారమన్న అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బ్యాంకులు మాత్రం రూ.20 వేల కోట్లు రుణమాఫీకి సరిపోతాయని సర్కారుకు విన్నవించగా, వ్యవసాయ వర్గాలు రూ.26 వేల కోట్లు అవసరమని అంచనా వేశాయి. బ్యాంకులైతే తమ అంచనాను ఆర్థికశాఖకు కూడా అందజేసినట్లు సమాచారం. అయితే ఈ లెక్కలు ఏమేరకు సరిగ్గా ఉన్నాయనే దానిపై అధికారుల్లో పలు సందేహాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుత రుణమాఫీకి కటాఫ్‌ తేదీని 2018 డిసెంబర్‌ 11గా ప్రకటించింది. కటాఫ్‌ తేదీని ప్రకటించిందేకానీ, ఎప్పటినుంచి అమలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.  
 
చెరకు, పసుపు రైతులను మరిచారా? 
బ్యాంకర్లు, వ్యవసాయశాఖ వర్గాలు మాత్రం గత రుణమాఫీ కింద చివరి విడత సొమ్ము చెల్లించిన నెల నుంచి పరిగణలోకి తీసుకుంటున్నాయి. 2017 సెప్టెంబర్‌ నాటికి గత రుణమాఫీ పూర్తిగా చెల్లించిన నెలగా వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి 2018 డిసెంబర్‌ 11 వరకు లెక్కలోకి తీసుకున్నట్లు వారంటున్నారు. ఆ ప్రకారమే తాము రుణమాఫీకి అర్హులను, సొమ్మును అంచనా వేశామని అంటున్నారు. బ్యాంకర్లు చెరకు, పసుపు రైతులను పరిగణలోకి తీసుకోలేదని వ్యవసాయశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దానివల్ల బ్యాంకర్లు తక్కువ సొమ్ము చూపారని వ్యవసాయాధికారులు అంటున్నారు. తాము ఆ రైతులను కూడా పరిగణలోకి తీసుకున్నామని, అందుకే రూ.26 వేల కోట్ల వరకు లెక్క తేలిందంటున్నారు. అయితే ఎప్పటినుంచి అమలు చేస్తారన్న తేదీ ఖరారు చేసి మార్గదర్శకాలు విడుదల చేశాకే రైతుల సంఖ్య, చెల్లించాల్సిన సొమ్ముపై స్పష్టత రానుంది. 
 
39లక్షల మంది రైతులకు మాఫీ! 
రెండోసారి అధికారంలోకి వచ్చాక మరోసారి రుణమాఫీ చేస్తానని అధికార పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లక్ష రూపాయలు మాఫీ చేస్తానని ప్రకటించింది. అందులో భాగంగానే గత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లో ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించింది. అయితే ఎన్ని విడతలనే విషయాన్ని మాత్రం సర్కారు ప్రకటించలేదు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించి అమలుచేసింది. 35.29 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.16,124 కోట్ల రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సొమ్మును ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగు బడ్జెట్లలో నిధులు కేటాయించి మాఫీ చేసింది. మొదటి విడత 2014–15లో రూ.4,040 కోట్లు, రెండో విడత 2015–16లో రూ.4,040 కోట్లు, 2016–17లో మూడో విడత రూ 4,025 కోట్లు, నాలుగో విడత 2017–18లో రూ.4,033 కోట్లు మాఫీ చేసింది. ఈసారి ఎన్ని విడతలుగా మాఫీ చేస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. మార్గదర్శకాలు వచ్చాకే.. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. గత డిసెంబర్‌ 11వ తేదీని కటాఫ్‌గా ప్రకటించగా, డిసెంబర్‌ 31 వరకు ఎస్‌ఎల్‌బీసీ వద్ద లెక్కలున్నాయి. ఆ లెక్కల ప్రకారం చూస్తే 48 లక్షల మందికి రూ.31 వేల కోట్లు రుణాలు తీసుకున్నట్లు ఉంది. అయితే లక్ష లోపు రుణాలు ఉన్నవారెందరనేది తేలాల్సి ఉంది. అంతేకాదు అంటే డిసెంబర్‌ 11వ తేదీకి, డిసెంబర్‌ 31వ తేదీకి మధ్య భారీ తేడా కనిపిస్తుంది. ఎందుకంటే గత రబీకి సంబంధించి అనేక మంది రైతులు ఆ తేదీల మధ్య కొత్త రుణాలు తీసుకొని ఉంటారు. కాబట్టి వారిని మినహాయించాల్సి ఉంది. ఏదేమైనా వ్యవసాయశాఖ మాత్రం 39లక్షల మంది రైతులకు రూ.26 వేల కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గత రుణమాఫీకి ఇప్పటికీ రైతుల సంఖ్య మరో నాలుగు లక్షలు పెరిగే అవకాశముంది. 

రైతుబంధు తర్వాతేనా! 
ఈ ఖరీఫ్‌ రైతుబంధు సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికీ రైతులకు అందజేసే ప్రక్రియ కొనసాగుతోంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్‌లో 50లక్షల మంది రైతులకు రూ.6,900 కోట్లు రైతుబంధు కింద చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటివరకు 33లక్షల మందికి రూ.3,500 కోట్లు రైతుబంధు సొమ్ము చెల్లించినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి తెలిపారు. ఇంకా మిగిలిన రైతులకు త్వరలో చెల్లిస్తామని ఆయన చెబుతున్నారు. రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయడం పూర్తయిన తర్వాత రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకు బ్యాంకులు రైతులకు సహకరించాలని కోరుతున్నారు. రైతులకు పంటరుణాలు సక్రమంగా ఇవ్వాలని, రుణమాఫీతో ముడిపెట్టకుండా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వ విన్నపాన్ని బ్యాంకర్లు పెడచెవిన పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు ఖరీఫ్‌ పంట రుణాల కింద రూ.2 వేల కోట్లు కూడా ఇవ్వలేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top