
సాక్షి, మెదక్: ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకుండా బంగపడిన అసంతృప్త నేతలపై బీజేపీ కన్నేసింది. వారిని తమవైపు తిప్పుకునేందుకు ముమ్మరంగా పావులు కదుపుతోంది. బీజేపీ ప్రతిపాదనల విషయంలో అసంతృప్త నేతలు సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు సమాచారం. మెదక్, నర్సాపూర్ నియోజవకర్గాల్లో బీజేపీ గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలని బీజేపీ బలంగా కోరుకుంటోంది. ఇందులో భాగంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి గెలుపు గుర్రాలకు టికెట్లు కట్టబెట్టాలని అనుకుంటోంది. ఇందుకోసం బీజేపీ అధిష్టానం సర్వేలు జరిపిస్తోంది.
అలాగే పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటోంది. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర నాయకులు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల ఆశావహులు,ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ సర్వే నిర్వహిస్తోంది. అదే సమయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోని బలమైన అసంతృప్త నేతలను గుర్తించి వారిని ఎన్నికల బరిలో నిలపాలని వ్యూహారచన చేస్తోంది. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని పలువురు నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మురళీయాదవ్‌పై ప్రత్యేక నజర్‌నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న టీఆర్‌ఎస్ జిల్లా నేత మురళీయాదవ్‌తో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మురళీయాదవ్ బలమైన బీసీ నేత కావడంతోపాటు ఉమ్మడిజిల్లా టీఆర్‌ఎస్ అ«ధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. దీనికితోడు నియోజవర్గంలో ఆయనకు పట్టు ఉంది. ఎమ్మెల్యే టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న తనను తమవైపు తిప్పుకుని ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీకి చెందిన జిల్లా నాయకులతోపాటు రాష్ట్ర పార్టీలోని ఓ యాదవ సామాజక వర్గానికి చెందిన నేత మురళీయాదవ్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మురళీయాదవ్ చేరిక ప్రతిపాదనపై స్థానిక బీజేపీ నాయకత్వం కూడా సముఖతతో ఉన్నట్లు సమాచారం. నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్ నుంచి మదన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి పోటీ పడనున్నారు. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన మరళీయాదవ్‌ను బీజేపీ నుంచి బరిలో దింపితే పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని బీజేపీ భావించి ఆయనపై వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.
ఈ విషయమై మురళీయాదవ్‌ను ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ ‘బీజేపీలోకి రావాలని నన్ను కోరుతున్న మాట వాస్తవమే.. నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు పార్టీలోకి రావాలని వత్తిడి చేస్తున్నారు. అయితే పార్టీ మారే యోచన నాకు లేదు’ అని తెలిపారు. ఇదిలా ఉంటే నర్సాపూర్ నియోజవర్గంలోని హత్నూర జెడ్పీటీసీ పల్లె జయశ్రీ, బీసీ నాయకురాలు లక్ష్మీ సైతం బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
రసవత్తరంగా పోటీ..
మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఇద్దరు కాంగ్రెస్ నాయకులతోనూ బీజేపీ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో 13 మంది నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మాజీ ఎంపీ విజయశాంతి మెదక్ నుంచి తిరిగి పోటీచేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. మెదక్ నుంచి ఆమె పోటీకి దిగిన పక్షంలో టికెట్ ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఇండిపెండెంట్ లేదా ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు సిద్ధ పడుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ టికెట్ వచ్చినా రాకున్నా బరిలో నిలవాలని బలంగా కోరుకుంటున్న ఇద్దరు కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వారికి టికెట్ దక్కని పక్షంలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇద్దరిలో ఏ నాయకుడైనా బీజేపీ నుంచి పోటీచేసిన పక్షంలో మెదక్‌లో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది.