‘తారకరామా...’ కూలీ గోడు వినుమా | 'Tarakarama ...' wage hear thoughts .. | Sakshi
Sakshi News home page

‘తారకరామా...’ కూలీ గోడు వినుమా

Dec 5 2014 1:57 AM | Updated on Sep 2 2017 5:37 PM

రాత్రీ పగలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నా... నేతకార్మికులకు నమ్మకమైన ఉపాధి కరువవుతోంది. యజమానుల కనుసన్నల్లో సాగే వస్త్ర వ్యాపారం నేతన్నల కడుపు నింపలేకపోతోంది.

సిరిసిల్ల : రాత్రీ పగలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నా... నేతకార్మికులకు నమ్మకమైన ఉపాధి కరువవుతోంది. యజమానుల కనుసన్నల్లో సాగే వస్త్ర వ్యాపారం నేతన్నల కడుపు నింపలేకపోతోంది. రెండేళ్ల క్రితం కుదిరిన కూలి ఒప్పందం గడువు శుక్రవారంతో ముగియనుండగా కొత్త ఒప్పందం కోసం కార్మికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. మంత్రి కేటీఆర్ చొరవ చూపితే కొత్త కూలి ఒప్పందం కార్మికుల్లో వెలుగులు నింపనుంది.
 సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మూడంచెల వ్యవస్థ కొనసాగుతోంది.
 
 యజమానులు నూలు కొనుగోలు చేసి బీములు పోసి ఆసాములకు అందిస్తారు. ఆసాములు తమ సాంచాలపై కార్మికులతో కలిసి వస్త్రాన్ని నేస్తారు. మూడంచెల విధానంలో యజమానులదే కీలకపాత్ర. ప్రైవేటు రంగంలో ఉన్న ఈ పరిశ్రమపై పాతికవేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. రెండేళ్లకోసారి సిరిసిల్లలో కూలి ఒప్పందం జరుగుతుంది. వస్త్రం మందం (పిక్కుల)పై ఒప్పందం ఆధారపడి ఉంటుంది. 2012 డిసెంబర్‌లో జరిగిన కూలి ఒప్పందం గడువు శుక్రవారంతో ముగియనుంది. రాష్ట్రం మొత్తంలో 72 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో పాలిస్టర్ మరమగ్గాలు 27 వేలు. వీటిలో నిత్యం 25 లక్షల మీటర్ల పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి చేస్తున్నారు.
 
 ఈ వస్త్రం విక్రయం ద్వారా వచ్చే డబ్బుతో ఆసాములు, కార్మికులకు కూలి లభిస్తుంది. ప్రస్తుతం పాలిస్టర్ పరిశ్రమలో కూలి ఒప్పందం కోసం కార్మిక సంఘాలు ముందుకొస్తున్నాయి. ఈ నెల 8న వస్త్ర పరిశ్రమను పూర్తిస్థాయిలో బంద్ చేసి మెరుపు సమ్మె చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ పిలుపునిచ్చాయి. ఒక్కరోజు సాంచాలు బంద్ ఉన్నా పాతికవేల మంది కార్మికులకు ఉపాధి కరువవుతుంది. మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, ఇల్లు కిరాయి, స్కూల్‌ఫీజులు, వైద్యఖర్చులు తదితర వాటికి దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.
 కనీస వేతనమేదీ?
 మరమగ్గాలు దాని అనుబంధ పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు కావడం లేదు. 2009లో జారీ అయిన జీవో 53 ప్రకారం.. పది పిక్కులకు 18 పైసలు కూలి చెల్లించాలి. కానీ, ఈ మేర చెల్లించడానికి యజమానులు నిరాకరిస్తున్నారు. ప్రతీసారి జీవో జోలికి వెళ్లకుండానే చర్చలు సాగుతుంటాయి. కొత్త కూలి ఒప్పందం కోసం యజమానులకు నెల కిందటే వినతిపత్రాలు సమర్పించినా వారి నుంచి స్పందన లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసంఘటిత రంగ కార్మికులైన నేతన్నలకు పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ లాంటి సౌకర్యాలు దక్కడం లేదు. ఉద్యోగ భద్రత లేక.. సామాజిక భద్రత కరువై నేతన్నల బతుకు దినదినగండంగా మారింది.
 
 పన్నెండు గంటలు పని
 రోజూ పన్నెండు గంటల పాటు ఎనిమిది సాంచాలు నడుపుతూ శ్రమిస్తే ఒక్క నేతన్నకు సగటున నెలకు వచ్చే కూలి రూ.5 వేలు దాటడం లేదు. సిరిసిల్లలో వారం వారం కూలి చెల్లించడంతో ఏ ఒక్క నెల కూడా పూర్తిస్థాయి వేతనం చేతికందే పరిస్థితి లేదు. ఫలితంగా శ్రమఫలాన్ని ఒక్కనెలలోనే నాలుగుసార్లు తీసుకోవడంతో ఆదాయం.. ఖర్చులకు సమానం అవుతోంది. చేతిలో మిగిలేది లేక శుభకార్యం జరిగినా.. విషాదాలు చోటుచేసుకున్నా.. అనారోగ్యం బారిన పడినా అప్పులవేటలో పడాల్సిందే. దీంతో వీరు భారంగా కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.
 
 కేటీఆర్‌పైనే ఆశలు
 సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్‌కు వస్త్రోత్పత్తి రంగంపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. నేత, చేనేత రంగాలపై లోతైన పట్టున్న మంత్రి నేత కార్మికుల కూలి ఒప్పందంపై చొరవ చూపితే నేతన్నలకు మెరుగైన ఉపాధి లభించే అవకాశముంది. ప్రభుత్వ పరంగానూ కూలి ఒప్పందానికి చట్టబద్ధత కల్పిస్తే దీర్ఘకాలిక ప్రయోజనం దక్కుతుంది. శుక్రవారం సిరిసిల్లకు వస్తున్న మంత్రి కేటీఆర్ కూలి ఒప్పందంపై చొరవ చూపి మేలు చేస్తారని కార్మికలోకం ఆశిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement