ఇంట్లో తల్లిదండ్రులు రోజూ గొడవపడటం భరించలేక ఓ విద్యార్థి కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మహబూబ్‌నగర్ : ఇంట్లో తల్లిదండ్రులు రోజూ గొడవపడటం భరించలేక ఓ విద్యార్థి కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని తిమ్మసానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... భూత్పూర్ మండలం పాతమొల్గర గ్రామానికి చెందిన కుర్వ యాదయ్య, పద్మమ్మలకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు కృష్ణయ్య(16) జిల్లా కేంద్రంలోని శ్రీనిధి జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రోజూ గ్రామం నుంచి బస్సు లేదా ఆటోలో కళాశాలకు వెళ్లివచ్చేవాడు.
అయితే యువకుడి తల్లిదండ్రులు రోజూ కల్లు తాగి ఇంట్లో గొడవపడేవారు. తన చదువుకు ఆటంకం కలుగుతోందని, గొడవలు వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినేవారుకాదు. దీంతో అతడు తీవ్ర మనోవేదనకు గురై శుక్రవారం తిమ్మసానిపల్లి వద్ద గుర్తు తెలియని రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. ఈ మేరకు అతని జేబులో లభించిన కళాశాల ఐడెంటిటీ కార్డు, సూసైడ్ నోట్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.