
కొత్త ఎమ్మెల్యేలపై గంపెడాశలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో కొత్త ఎమ్మెల్యేలు కొలువుదీరనున్నా రు. జిల్లా నుంచి ఎన్నికైన పది మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో ప్రప్రథమంగా ఎన్నికైన సభ్యులుగా రికార్డుకెక్కనున్నారు. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఎనిమిది మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రజల చూపంతా వీరిపైనే ఉంది.
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు ముగ్గురు ఉన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తొలిసారిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే జిల్లా నుంచి ఎన్నికైన కేసీఆర్‌కు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఉమ్మడి శాసనసభకు కేసీఆర్ సిద్దిపేట నుంచి ఆరు మార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ మంత్రిగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కావటం గమనార్హం.
సిద్దిపేట నుంచి ఆయన వరుసగా ఐదుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి గీతారెడ్డి, కిష్టారెడ్డి నాలుగుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మూడుమార్లు గెలిచారు. పద్మా దేవేందర్‌రెడ్డి రెండుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సమస్యలు పరిష్కారం అయ్యేనా?
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలపై నియజకవర్గ ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు శాసనసభా సమావేశాల్లో తమ సమస్యలు లేవనెత్తి వాటిని పరిష్కరింపజేస్తారని ఎదురుచూస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు ప్రజల ఆశలను ఏమేరకు నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే.