తెలంగాణ కోసం పోరాడిన వారి నందరినీ టీఆర్‌ఎస్ నుంచి బయటకు పంపి, తెలంగాణ ద్రోహులతో నింపుకున్నారని...
కామారెడ్డి: తెలంగాణ కోసం పోరాడిన వారి నందరినీ టీఆర్‌ఎస్ నుంచి బయటకు పంపి, తెలంగాణ ద్రోహులతో నింపుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ఆరోపించారు. ఏనాడూ జెండా పట్టనోళ్లు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా వెలగబెడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను దేవతగా పేర్కొంటూ సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం ఢీల్లీలో ఆమె ఇంటికి వెళ్లిందని, ఇప్పుడేమో ఆమెను, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని అన్నారు.
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అహంకారంతో మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నర్సుగా అభివర్ణించిన కేటీఆర్‌కు నర్సు గొప్పతనం, త్యాగాలేం తెలుసని ప్రశ్నించారు. కేటీఆర్ పర్యటనలో ఓ కార్యకర్త చనిపోవడం బాధాకరమని, అయితే కేటీఆర్ ఆ వ్యక్తిని పరామర్శించకపోవడం శోచనీయమని షబ్బీర్ విచారం వ్యక్తం చేశారు.