పంట లెక్కలకు శాటిలైట్‌ సాయం

Satellite support for crop counts - Sakshi

పంటల అంచనాకు ఉపగ్రహ చిత్రాలు

జిల్లా స్థాయిలో పంటల విస్తీర్ణం,పరిస్థితి, దిగుబడి మదింపు

శాటిలైట్‌ డేటా, ఏఐ ఆధారంగా పంట నష్టం అంచనా

ఈ ఏడాది అమలు చేయాలని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు 

సాక్షి, హైదరాబాద్‌: రైతుల పంటలను అంచనా వేసేందుకు ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయశాఖను ఆదేశించింది. జిల్లా స్థాయిలో పంటల విస్తీర్ణం, వాటి పరిస్థితి, దిగుబడిని అంచనా వేయడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించాలని పేర్కొంది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకత, వాతావరణ పరిస్థితులను అంచనా వేయొచ్చని సూచించింది. జియో–ఇన్ఫర్మేటిక్స్‌ ద్వారా పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాన్ని అంచనా వేయాలని, కరువు అంచనా కోసం ఉపగ్రహ డేటాను ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది.

మరోవైపు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు పంట నష్టపరిహారం పొందడానికి అనేక సమస్యలు తలెత్తుతుతున్న నేపథ్యంలో ఆయా వివాదాలను పరిష్కరించడానికి కేవలం క్షేత్రస్థాయి పరిశీలనపైనే ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పరిహారం అందడంలో ఆలస్యమవుతోంది. పైగా నష్టం అంచనాలు సకాలంలో జరగడంలేదు. వాటిని ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేయాలనేది ప్రధాన ఉద్దేశం. రైతుల వాదనల పరిష్కారానికి సమయ వ్యవధిని తగ్గించడానికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది.

ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ, పీఎంఎఫ్‌బీవై కింద వివిధ రాష్ట్రాల్లో పంట కోత ప్రయోగాలకు ప్రత్యామ్నాయంగా పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా పైలట్‌ అధ్యయనాలు చేయడానికి 8 ఏజెన్సీలకు ఇప్పటికే బాధ్యత అప్పగించారు. పంటల దిగుబడి అంచనా కోసం బీమా యూనిట్‌ స్థాయికి అవసరమైన పంట కోత ప్రయోగాల సంఖ్యను తగ్గించడానికి శాటిలైట్‌ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మోడలింగ్‌ టూల్స్‌ మొదలైన సాంకేతిక పరిజ్ఞాన అధ్యయనాలను ఉపయోగించాలనేది సర్కారు ఉద్దేశం. 

ఆలస్యమైతే కంపెనీలకు జరిమానా..
మెరుగైన సేవలు, జవాబుదారీతనం, రైతులకు క్లెయిమ్‌లను సకాలంలో చెల్లించడం కోసం పీఎంఎఫ్‌బీవై పథకాన్ని కేంద్రం అనేక సవరణలు చేసింది. గత రబీ సీజన్‌ నుంచి క్లెయిమ్‌ల చెల్లింపు కోసం నిర్దేశించిన గడువు తేదీకి 10 రోజులకు మించి సెటిల్మెంట్‌ చేయకపోతే బీమా కంపెనీ రైతులకు ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించాలని పేర్కొంది. అయితే ప్రస్తుతం రబీ సీజన్‌కు క్లెయిమ్‌ల పరిష్కారం జరుగుతున్నందున జరిమానా వ్యవహారాన్ని కంపెనీలు తోసిపుచ్చుతున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఆ ప్రక్రియపై రాష్ట్రం దృష్టిసారించాలని సూచించింది. నెలలు, ఏళ్ల తరబడి పంటల బీమా క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలతోపాటు సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తన వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top