ప్రతి ఎకరం తడవాలె

Release water from Kaleshwaram project by June - Sakshi

కోటి ఎకరాలకునీరందించడమే లక్ష్యం

సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/సాక్షి, పెద్దపల్లి/జగిత్యాల/భూపాలపల్లి: ‘తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడం నా లక్ష్యం.. రాష్ట్రంలోని ప్రతి ఎకరం తడవాలె.. బీడు భూములన్నీ సస్యశ్యామలం కావాలె.. ఇందుకోసం ప్రాజెక్టుల నిర్మాణం పనుల్లో వేగం పెరగాలె.. అధికారులు, కాంట్రాక్టర్లు మరింతగా శ్రమించాలె’అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులూ మార్చి 31 నాటికి పూర్తిచేయాలని స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం ఆయన కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ, పంపుహౌస్‌ పనులను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు.

అనంతరం ఉదయం 11.20 గంటలకు కన్నెపల్లి పంపుహౌస్‌కు చేరుకున్న సీఎం.. 13.2 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కెనాల్‌ పనులు ఎలా సాగుతున్నాయో నిశితంగా చూశారు. కాలువ వెంబడి వాహనంలో వెళ్తూ.. మధ్యమధ్యలో ఆగుతూ కాలువ నిర్మాణ పనులను, నాణ్యతను పరిశీలించారు. ప్రాజెక్ట్‌కు గ్రావిటీ కాలువ చాలా ముఖ్యమైనది కావడంతో.. నాణ్యత విషయంలో రాజీపడొద్దని, అదే సమయంలో గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, కెనాల్‌ పనులు చాలా నెమ్మదిగా జరుగుతుండటం చూసి అసహనం వ్యక్తంచేశారు. పనులు త్వరగా పూర్తిచేసేందుకు అవసరమైతే మూడు షిఫ్టుల్లో పనులు చేయాలని అధికారులకు సూచించారు. 


అన్నారం బ్యారేజీపై సంతృప్తి...
గడువులోపు అన్నారం బ్యారేజీ పూర్తికావడంపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. బ్యారేజీ దగ్గర ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించిన సీఎం.. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపుగా 95 శాతం పనులు పూర్తయ్యాయని.. మిగిలిన చిన్నచిన్న పనుల్ని త్వరలోనే పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. సాధ్యమైనంత త్వరగా మిగిలిన కరకట్ట పనులను పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా వైపు కొంత మేర కరకట్ట పనులు ఆగాయని.. బోర్లు, పైప్‌లైన్లు ఉన్న 80 మంది రైతులకు నష్టపరిహారం అందకపోవడంతో సమస్య ఏర్పడిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారంలోగా వారందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. పంప్‌హౌస్‌ పనులను కూడా సమాంతరంగా వేగంగా చేస్తూ, ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు.

పంప్‌హౌస్‌ పరిధిలోని ఎనిమిది పంపుల్లో భాగంగా ఆరు పంపుల మోటార్లు వచ్చాయని, వాటికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని, మిగిలిన రెండు మోటర్లు కూడా చెన్నై చేరాయని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే దిశగా పనులు జరగాలని, తర్వాత పంపుల ట్రయిల్‌ రన్‌ నిర్వహించాలని, ఈ ఖరీఫ్‌లో రైతులకు ఎట్టి పరిస్థితులలో వ్యవసాయానికి సాగునీరంచేందుకు పనుల్లో వేగం పెంచాలని కేసీఆర్‌ స్పష్టంచేశారు. అనంతరం సుందిళ్ల బ్యారేజీ వ్యూ పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. సుం దిళ్ల బ్యారేజీ పరిధిలో 74 గేట్ల అమరిక పూర్తయిందని, 17 కిలోమీటర్ల మేర ఉన్న ఫ్లడ్‌ బ్యాంక్‌ పనులు వేగంగా సాగుతున్నాయని, అవి జనవరి చివరి నాటికి పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. ఫ్లడ్‌ బ్యాంక్‌ పరిధిలో రివిట్‌మెంట్‌ పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించగా.. 46% మాత్రమే జరిగినట్లు చెప్పడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వెం టనే పనుల్లో వేగం పెంచి, మార్చి చివరి నాటికి మొత్తం పూర్తిచేయాలని స్పష్టంచేశారు.

పునరుజ్జీవంపనులపైఅసంతృప్తి...
జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులు ఆలస్యం కావడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దశను మార్చేందుకు ఎస్పారెస్పీ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని.. అయితే అధికారులు, కాంట్రాక్టు ఏజేన్సీలు ఈ పనుల విషయంలో వేగం పెంచడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తిచేయాలని స్పష్టంచేశారు. అంతకుముందు అంతర్గాం మండలం గోలివాడ పంపుహౌస్‌ పనులను సీఎం పరిశీలించారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. కాగా, ప్రాజెక్టుబాటలో భాగంగా మల్యాల మండలం రాంపూర్‌ వద్ద పనుల పరిశీలనకు సమయం లేకపోవడంతో వాటిని ఏరియల్‌ వ్యూ ద్వారా సీఎం పరిశీలించారు.

కాగా, ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో సమీక్ష జరపనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే.జోషి, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వివేక్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, పెద్దపల్లి, జగిత్యాల కలెక్టర్లు శ్రీదేవసేన, డాక్టర్‌ శరత్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోరుకంటి చందర్, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, నవయుగ కంపెనీ చైర్మన్‌ సి.విశ్వేశ్వర్‌రావు ఉన్నారు.

కన్నెపల్లి టురాజేశ్వర్‌రావుపేట!
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉద్యమాల ఖిల్లా.. సెంటిమెంట్‌ జిల్లా అయిన కరీంనగర్‌ నుంచే చేపట్టిన సీఎం కేసీఆర్‌ తొలి అధికారిక పర్యటన విజయవంతంగా సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మంగళ, బుధవారాల్లో కాళేశ్వరం, ఎస్సారెస్సీ పునరుజ్జీవం (రివర్స్‌ పంపింగ్‌) ప్రాజెక్టుల పనులు పరిశీలించారు. భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా కన్నెపల్లి నుంచి జగిత్యాల జిల్లా రాజేశ్వర్‌రావు పేట వరకు షెడ్యూల్‌ ప్రకారం రెండు రోజులు పర్యటించిన సీఎం.. ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులను వివరణ అడుగుతూ.. సూచనలు చేస్తూ ముందుకు సాగారు. పనులు సాగుతున్న తీరును ఏరియల్‌ సర్వే ద్వారా, క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఎక్కడికక్కడ పనులు సాగుతున్న తీరును నిశితంగా పరీక్షించి.. అవసరమైన సూచనలు చేశారు.

కొన్నిచోట్ల ఆలస్యంగా పనులు జరుగుతుండటంపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గడువులోగా మొత్తం పనులు పూర్తిచేసి తీరాల్సిందేనని అధికారులు, కాంట్రాక్టర్లకు స్పష్టంచేశారు. రెండురోజుల ప్రాజెక్టుబాటలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. మధ్యాహ్నం 2 గంటలకు కన్నెపల్లి పంపుహౌజ్‌కు చేరుకుని పనుల పురోగతిని సమీక్షించారు. అక్కడే భోజనం చేసిన అనంతరం 3.15 గంటలకు అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించి సుందిళ్ల, గోలివాడ పంపుహౌస్‌లకు వెళ్లకుండానే సాయంత్రం 6 గంటలకు తీగలగుట్టపల్లి (కరీంనగర్‌) తెలంగాణ భవన్‌కి చేరుకుని రాత్రి బస చేశారు. బుధవారం మిగిలిన పనులను పరిశీలించిన తర్వాత హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. కాగా సీఎం రెండు రోజుల పర్యటన విజయవంతం కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top