ముందస్తువ్యూహం  | Political Parties Busy With  Election Campaigns In Nalgonda | Sakshi
Sakshi News home page

ముందస్తువ్యూహం 

Jul 1 2018 9:28 AM | Updated on Mar 18 2019 9:02 PM

Political Parties Busy With  Election Campaigns In Nalgonda - Sakshi

సాక్షి, యాదాద్రి : గడువుకు ముందే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో అన్ని రాజకీయ పక్షాలు అప్రమత్తం అయ్యాయి. సిట్టింగ్‌లకే టికెట్‌లు అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వారందరూ తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం సాగి స్తున్నారు. తాజా పరిణామాలతో మరింత దూకు డు పెంచారు. అసమ్మతివాదులను బుజ్జగించడంతో పాటు ఎన్నికల్లో ప్రభావితం చూసే వ్యక్తులతో ఇప్పటినుంచే రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆశావహులు సైతం ప్రజల్లోకి వెళ్తున్నారు. 

ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం
సార్వత్రిక ఎన్నికల ముందస్తు సంకేతాలతో ఒక్కసారిగా హీట్‌ పెరిగింది. జిల్లాలోని ఐదు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గాల స్థాయిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్రులు  కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాలైన భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడుకు ప్రాతినిధ్యం ఉంది. పార్లమెంట్‌తో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఈసారి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీజేసీ, బీఎల్‌ఎఫ్, వామపక్ష పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల బరిలో దిగనున్నా యి. అయితే కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉంటుం దన్న సంకేతాలు రావడంతో రెండు పార్టీల నేతల్లో ఆశలు పెరిగాయి. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలో గ్రూపుల గొడవ కొనసాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు, చైర్మన్‌లతో విభేదాలు ఉన్నాయి. 

బిజీబిజీగా అధికార పార్టీ నేతలు 
టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, భువనగిరి ఎం పీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, వేము ల వీరేశం, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రా రంభోత్సవాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. పనిలో పనిగా అసమ్మతివాదులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగే వ్యక్తులతో మం తనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ పార్టీల్లో ఉన్న వారిని తమ వైపునకు తిప్పుకునే కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 

కాంగ్రెస్‌ నేతల విస్తృత పర్యటనలు
ప్రతిపక్ష కాంగ్రెస్‌నుంచి వచ్చే ఎ న్నికల్లో పోటీ చేయడానికి ఎవరికి వారే తమ ప్రయత్నాలతో పాటు ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.  భువనగిరి మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడుతోపాటు జిల్లాలో పలుచోట్ల విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటున్నారు.  ఇక ఉ మ్మడి జిల్లాల అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్‌ ఆలేరు నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయడానికి  ఆరు నెలలుగా గడపగడపకూ కాంగ్రెస్‌ పేరుతో ప్రజల ను కలుస్తున్నారు. భువనగిరిలో నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తు్తన్నారు. మునుగోడులో పాల్వాయి స్రవంతి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌  కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించారు. కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమారెడ్డి వర్గాలుగా.. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నారు. 

పొత్తు గుబులు!
టీడీపీతో పొత్తుపై అధినేత రాహుల్‌గాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఎవరి సీట్లు ఉంటాయో, ఎవరి సీట్లు పోతాయో అన్న భ యం కాంగ్రెస్‌ నేతల్లో నెలకొంది. టీడీపీ నుంచి మోత్కుపల్లి నిష్క్రమణంతో జిల్లాలో పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. అయినప్పటికీ జిల్లా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శోభారాణి ఆలేరు, కుందారపు కృష్ణాచారి భువనగిరి నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే యోచనలో ఉన్నారు. 

భువనగిరిపై కన్నేసిన కమలనాథులు
భువనగిరి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలపై కన్నేసిన కమలనాథులు.. వచ్చే ఎన్నికల్లో వాటిని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఏడాది కాలంనుంచే ప్రజా సమస్యలతో పాటు వివిధ రూపాల్లో ఆందోళన కార్య క్రమాలు చేపడుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యా మ్‌సుందర్‌రావు, ఆలేరులో దొంతిరి శ్రీధర్‌రెడ్డి, కాసం వెం కటేశ్వర్లు జోరు పెంచారు. వీరితోపాటు మరికొందరు బీజేపీ నాయకులు అధి ష్టానం వద్ద టికెట్ల వేట సాగిస్తోన్నట్లు తెలుస్తోంది.

మరోమారు బరిలోకి జిట్టా!
బలమైన కేడర్‌ కలిగి ఉన్న యువ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రధాన పార్టీలో చేరి భువనగిరి అసెం బ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఏ పార్టీలో చేరేది స్పష్టం చేయనప్పటికీ వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తానని చెబుతున్నారు. 

ఆశావహులు అధికంగానే..
వచ్చే ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఆశావాహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలో వారి ప్రయత్నాల్లో వేగం పెరిగింది. భువనగిరి అసెంబ్లీ రేసులో అధికార పా ర్టీ కంటే కాంగ్రెస్‌ పార్టీలోనే ఆశావాహులు అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, తంగళ్లపల్లి రవికుమార్, రామాంజనేయులుగౌడ్, పొత్నక్‌ ప్రమోద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంలో టీపీఎస్‌ కన్వీనర్‌ కల్లూరి రామచంద్రారెడ్డి, తుర్కపల్లి జెడ్పీటీసీ బోరెడ్డి జ్యోతి లేదా ఆమె కుటుంబ సభ్యులు పోటీలో ఉండే అవకాశం ఉంది. ఇంకా పలువురు ఆశావాహులు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వెలుగులోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 

‘ప్రజావేదిక’తో మోత్కుపల్లి 
గత కొన్నాళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రజావేదికను పునరుద్ధరించి వచ్చే ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆలేరులో కార్యకర్తల సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించారు.  ఆలేరుతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న అనుచరవర్గంతో తానేంటో ప్రభావితం చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికైతే ఎందులో చేరనప్పటికీ ఎన్నికల నాటికి  ఏదైనా పార్టీలో చేరుతా లేదా ఇండిపెండెంట్‌గా ప్రజావేదిక తరఫున పోటీ చేస్తారా చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement