పల్లెకు పోదాం!

Parties Offers Travelling Expenses To Voters - Sakshi

ఆఫర్లు ప్రకటిస్తున్న రాజకీయ నేతలు 

‘దారి’ ఖర్చు భరిస్తామంటూ హామీ

బస్సులు, మినీ ట్రావెల్స్‌ ఏర్పాటు 

సాధారణంగా సిటీ నుంచి పండగలకు తప్పకుండా ఊరెళ్తాం. లేదంటే వ్యక్తిగత పనులేమైనా ఉన్నా కూడా ఊరు వెళ్లొస్తుంటాం. అయితే ఇప్పుడు సిటీ నుంచి జనం ఊరెళ్లడానికో ప్రత్యేకత ఉంది. అదే ఓట్ల పండుగ. సిటీలో ఉపాధి, ఉద్యోగం కోసం ఉంటున్నప్పటికీ సొంత ఊరిలోనే ఓటు హక్కు ఉన్నవారు నగరంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరంతా ఓటేసేందుకు కచ్చితంగా గ్రామాలకు వెళ్తుంటారు. ఈ మేరకు ఈ నెల 7 కల్లా తమ తమ గ్రామాలు చేరుకునేందుకు పట్నం వాసులు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థుల కన్ను ఇప్పుడు పట్నం ఓటర్లపై పడింది. వారిని ఎలాగైనా పోలింగ్‌ రోజున గ్రామాలకు రప్పించి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రధాన పార్టీ ల అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో పట్నం వాసుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు నేతలు రకరకాల వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో ఓటుకు ప్రాధాన్యత ఏర్పడడంతో పట్టణ వాసుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్‌ నాటికి ఊళ్లకు వచ్చేలా ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖర్చు మొత్తం నేతలదే... 
డిసెంబర్‌ 7న ఎన్నికల నేపథ్యంలో ముందుగానే ఓటర్లకు రాజకీయ నేతలు గాలం వేస్తున్నారు. ‘మాకే ఓటేయండ’ని కోరుతున్నారు. ‘మీరు న్న చోటికే వాహనం పంపిస్తాం. భోజనంతో సహా అన్ని ఖర్చులు మావే’నంటూ హామీలిచ్చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు తమ తమ నమ్మకస్తులతో కూడిన టీంలను ఏర్పాటు చేసుకొని వివిధరకాల బాధ్యతలు అప్పగిస్తున్నారు.
 
ఎన్నికల అధికారుల లెక్క ప్రకారం  

ఎన్నికల అధికారుల అంచనాల ప్రకారం.. ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చిన వారు ఇక్కడే ఓటేస్తున్నారు. కొందరు మాత్రం సొంత ఊర్లోనే ఓటుహక్కును ఉపయోగించుకుంటున్నారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ‘ఓటు కోసం మా ఊరు వెళ్తున్నాం. వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయి. ఊరు చూసినట్లుంటుంది.. ఓటేసినట్లుంటుంది. అందుకే వెళ్తున్నా’ అని కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఐటీ ఉద్యోగి కృష్ణ చెప్పారు.   ‘ఇప్పటికే రెండు, మూడు పార్టీల నాయకులు ఫోన్‌ చేశారు. ఊర్లో ఓటు వేసేందుకు బస్సు ఏర్పాటు చేస్తున్నామని, ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అందువల్లే శని, ఆదివారాలు సెలవు ఉండడంతో ఓటు వేసేందుకు ఊరెళుతున్నాను’ అని సిరిసిల్లకు చెందిన భరత్‌ తెలిపాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top