నీరు లేక నిలిచిన ప్రసవాలు.. | Operation Stopped Due To Water Problem | Sakshi
Sakshi News home page

నీరు లేక నిలిచిన ప్రసవాలు..

May 15 2018 8:10 AM | Updated on May 15 2018 8:10 AM

Operation Stopped Due To Water Problem - Sakshi

మోర్తాడ్‌లోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ) : మోర్తాడ్‌లోని క్లస్టర్‌ ఆస్పత్రిలోని బోరుబావిలో సమృద్ధిగా నీరు లేక పోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సరిపడేంత నీరు సరఫరా కావడం లేదు. దీంతో సాధారణ, శస్త్ర చికిత్సల ద్వారా నిర్వహించే ప్రసవాలను నిలిపివేశారు. గర్భిణులు ఎవరైనా ప్రసవానికి వస్తే కమ్మర్‌పల్లి లేదా ఆర్మూర్‌ ఆస్పత్రులకు తరలించడానికి వైద్య సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. మోర్తాడ్‌ పీహెచ్‌సీని పదేళ్ల కిందనే 30 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రభుత్వం ఆస్పత్రుల నిర్వహణలో మార్పులు తీసుకురావడంతో పీహెచ్‌సీ నుంచి క్లస్టర్‌ ఆస్పత్రిగా మోర్తాడ్‌ ఆస్పత్రి అప్‌గ్రేడ్‌ అయ్యింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌ తదితర ఆస్పత్రుల తరహాలో మోర్తాడ్‌లోనూ సాధారణ, శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలను చేయాలని నిర్ణయించారు. శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలను నిర్వహించడానికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేశారు.

దాదాపు ఆరు నెలల నుంచి మోర్తాడ్‌ ఆస్పత్రిలో సాధారణ, శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 200 మంది గర్భిణులకు ప్రసవాలను చేశారు. కాగా మూడు వారాల కింద మోర్తాడ్‌ ఆస్పత్రిలోని బోరుబావి నుంచి ఆశించిన మేరకు నీరు రావడం లేదు. ఊష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, భూమిలోని భూగర్భ జలాలు తగ్గిపోవడంతో మోర్తాడ్‌ ఆస్పత్రి బోరుబావి ఎత్తిపోవడానికి సిద్ధంగా ఉంది. బోరుబావి నుంచి గతంలో ఎక్కువ మొత్తంలో నీరు సరఫరా కాగా కొన్ని రోజుల నుంచి తక్కువ పరిమాణంలో నీరు వస్తోంది. దీంతో ఈ నీరు రోగులకు సరిపోవని అధికారులు గుర్తించారు. ఆస్పత్రి వైద్యాధికారి శివశంకర్‌ ఎత్తిపోయిన బోరుబావి గురించి జిల్లా పరిషత్‌ సీఈవో, మోర్తాడ్‌ ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌లకు విన్నవించారు. ఆస్పత్రిలోని బోరుబావి ఎండిపోవడం వల్ల రోగులకు ప్రధానంగా బాలింతలైన వారికి సరిపోయేంతగా నీరు సరఫరా కాదు.  అలాగే అప్పుడే పుట్టిన చిన్నారులకు స్నానం చేయించడానికి నీరు అవసరం. శస్త్ర చికిత్స చేయించుకున్న వారిని మినహాయిస్తే సాధారణ ప్రసవం అయిన వారికి రోజూ స్నానాల కోసం నీరు అవసరం అవుతుంది. ఇలా ఎన్నో విధాలుగా నీరు అవసరం కావడం అందుకు అనుగుణంగా నీరు బోరుబావిలో లేక పోవడంతో ప్రసవాలను అధికారులు నిలిపివేశారు.

మోర్తాడ్‌లోని క్లస్టర్‌ పరిధిలో మోర్తాడ్, కమ్మర్‌పల్లి, వేల్పూర్, ఏర్గట్ల, చౌట్‌పల్లి పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రసవాల కోసం గర్భిణులు ఎంతో మంది మెట్‌పల్లి, ఆర్మూర్, నిజామాబాద్‌ ఆస్పత్రులకు తరలివెళుతున్నారు. ఇప్పటికే సుమారు 30 మంది గర్భిణులకు ఇక్కడ ప్రసవం చేయాల్సి ఉండగా వారిని ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు. గర్భిణులకు ఇక్కడ ప్రసవం చేయకుండా మరో ఆస్పత్రికి తరలించడంతో తీవ్ర ప్రభావం ఏర్పడి రోగుల సంఖ్య తగ్గిపోయింది. అయితే మోర్తాడ్‌ ఆస్పత్రిలో సంపూర్ణ వసతి ఉంటే గర్భిణుల ప్రసవాలకు ఎలాంటి ఆటంకం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బోరుబావి వేయించాలని ప్రశాంత్‌రెడ్డి ఆదేశం...
మోర్తాడ్‌ ఆస్పత్రిలోని బోరుబావి నుంచి తక్కువగా నీరు వస్తుండగా మరో బోరుబావిని తవ్వించాలని మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. బట్టాపూర్‌లో నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో మోర్తాడ్‌ ఆస్పత్రి దుస్థితిని ఏఎన్‌ఎం అలేఖ్య ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకపోవడంతో ఆయన స్పందించి వెంటనే కొత్త బోరుబావిని తవ్వించాలని ఎంపీడీవో పీవీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. నీరు లేక పోతే ప్రసవాలు ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు. మోర్తాడ్‌ ఆస్పత్రిలో ఏ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఉన్నతాధికారులకు నివేదించాం
మోర్తాడ్‌ ఆస్పత్రిలో నీటి సమస్య తీవ్రం కాగా ఈ విషయాన్ని జిల్లా పరిషత్‌ సీఈవో ఇతర అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. ఆస్పత్రిలో నిధులు ఉన్నాయి. అయితే బోరుబావికి వినియోగించడానికి మాకు అధికారం లేదు. దీంతో జిల్లా కలెక్టర్‌ అనుమతి కోరాం. అనుమతి రాగానే కొత్త బోరుబావిని తవ్విస్తాం. నీటి సమస్యను పరిష్కరించి ప్రసవాలను కొనసాగిస్తాం. – డాక్టర్‌ శివశంకర్, కమ్యునిటీ హెల్త్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement