లారీ, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ క్లీనర్ మృతి చెందగా ట్యాంకర్‌లోని పెట్రోల్, డీజిల్ రోడ్డుపాలైంది.
శంషాబాద్ రూరల్(రంగారెడ్డి జిల్లా): లారీ, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ క్లీనర్ మృతి చెందగా ట్యాంకర్‌లోని పెట్రోల్, డీజిల్ రోడ్డుపాలైంది. ఈ సంఘటన మండల పరిధిలోని పాల్మాకుల సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి నుంచి ఓ ట్యాంకర్ పెట్రోలు, డీజిల్ తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని మిడ్జిల్‌కు వె ళ్తోంది. శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో పాల్మాకుల వద్ద ముందు వెళ్తున్న సిమెంట్ లారీని ట్యాంకర్ డ్రై వర్ ఓవర్‌టేక్ చేయబోయాడు. ఈ సమయంలో లారీ వెనకభాగాన్ని ట్యాంకర్ ఢీకొని బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ట్యాంకరు క్యాబిన్‌లో ఎడమవైపు కూర్చున్న క్లీనర్, మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం లక్ష్మీపల్లి నివాసి అయిన కడ్తాల వెంకటేష్(19)కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శివకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రుడు వెంకటేష్‌ను చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ ఎండీ.దావూద్ హుస్సేన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ట్యాంకర్‌లో 4 వేల లీటర్ల పెట్రోలు, 8 వేల లీటర్ల డీజిల్ ఉండగా మొత్తం రోడ్డుపాలైంది. రోడ్డుపై ట్యాంకరు బోల్తాపడడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. క్రేన్ సాయంతో పోలీసులు ట్యాంకర్‌ను రహదారి పైనుంచి పక్కకు తొలగించారు.