పార్ట్‌–బీ తంటా.. ఈ రైతులకేదీ ఊరట! 

Negligence of the authorities on Five lakh farmers - Sakshi

ఐదు లక్షల మంది అన్నదాతలకు మొండి చేయి 

చిన్న కారణాలతో వివాదాస్పద భూముల జాబితాలో 9.92 లక్షల ఎకరాలు 

పాస్‌బుక్‌లు రాకపోవడంతో నిలిచిన రూ.496 కోట్ల పెట్టుబడి సాయం   

సాక్షి, హైదరాబాద్‌: అధికారుల నిర్లక్ష్యం ఆ రైతులకు శాపంగా మారింది. భూ యాజమాన్య హక్కులపై స్పష్టతనివ్వకపోవడంతో లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందకుండా పోతోంది. ఇప్పటికీ రెండు దఫాలు రైతుబంధు సాయం పంపిణీ చేసిన సర్కారు.. తాజాగా ఖరీఫ్‌ సీజన్‌కు గాను నగదును బ్యాంకుల్లో జమ చేస్తోంది. అయితే, పార్ట్‌–బీ జాబితాలో చేర్చిన భూములకు రైతుబంధు ఇవ్వకుండా నిలిపివేసింది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్‌–బీ కేటగిరీ కింద పరిగణించిన సర్కారు.. ఆ భూములకు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను జారీ చేయలేదు. పెట్టుబడి సాయానికి పాస్‌బుక్కును ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ కేటగిరీ కింద చేరిన భూముల రైతులకు రైతుబంధు రాకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,14,534 ఖాతాల్లోని 9,92,295 ఎకరాల మేర భూములను పెట్టుబడి సాయం కింద పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్‌లో సుమారు రూ.496 కోట్ల మేర నిధులు రైతుల ఖాతాల్లోకి చేరడంలేదు. 

అడ్డగోలుగా నమోదు 
రెవెన్యూ వ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన కేసీఆర్‌ సర్కారు.. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఈ రికార్డుల ఆధారంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం కింద వివాదరహిత భూములకు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసింది. వివాదాస్పద, అభ్యంతర భూములకు మాత్రం వాటి జారీని పక్కనపెట్టింది. పార్ట్‌–బీ కేటగిరీలో ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ భూములు, దేవాదాయ తదితర భూములతోపాటు, వ్యవసాయేతర భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, కోర్టు కేసులు, అన్నదమ్ముల భూపంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్‌ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా., ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదాస్పదమైనవాటిని కూడా పార్ట్‌–బీలో నమోదు చేసింది.

భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించడం, ఖరీఫ్‌లోపు కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేసి రైతుబంధును ప్రవేశపెట్టాలనే ఒత్తిడితో రెవెన్యూ యంత్రాంగం.. లోతుగా పరిశీలించకుండా వివాదరహిత భూములను కూడా పార్ట్‌–బీలో నమోదు చేసింది. దాయాదులు, ఇతరత్రా ఎవరి నుంచి ఫిర్యాదు అందినా.. ఆ భూములకు పాస్‌బుక్కులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. ఈ విషయం తెలిసిన రైతులు.. తహసీళ్ల చుట్టూ ప్రదక్షణలు చేసినప్పటికీ, ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడం, ఒకసారి నమోదు చేసిన సమాచారంలో మార్పులు, చేర్పులు చేసే అధికారం లేకపోవడంతో ఈ భూముల వ్యవహారం రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. పార్ట్‌–బీ భూముల జాబితాను పరిశీలించి పరిష్కారం చూపెట్టకపోవడంతో మూడు సీజన్లలోను సంబంధిత రైతులకు నిరాశే మిగిలింది. కనీసం ఈ సారైనా వివాదాస్పద/అభ్యంతరకర భూముల జాబితాను సవరించకపోతే లక్షలాది మంది అన్నదాతలకు ఆర్థిక సాయం అందని ద్రాక్షగానే మారనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top