పత్తి మద్దతు ధర, కరువు సహాయ చర్యలు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై ఎంపీలు.. మంత్రులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని డిసెంబరు 2 న కలవనున్నట్లు కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు.
హుస్నాబాద్ (కరీంనగర్ జిల్లా) : పత్తి మద్దతు ధర, కరువు సహాయ చర్యలు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై ఎంపీలు.. మంత్రులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని డిసెంబరు 2 న కలవనున్నట్లు కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5 వేలు పెంచాలని, కరువు మండలాలకు తక్షణ సహాయం కింద రూ.1800 కోట్లు విడుదల చేయూలని, పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని ప్రధానిని కోరనున్నట్లు చెప్పారు.
డీప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు టి.హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌కు చెందిన 12 మంది ఎంపీలతో కలిసి ప్రధానిని కలుస్తామన్నారు. అలాగే దేశంలో నాలుగు విభిన్న ప్రాంతాలైన తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఏర్పాటు చేసేందుకు రాజ్యంగ సవరణ చేయాలని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక కేసు సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే వ్యయప్రయాసలతో కూడుకున్నదని, సామాన్యులు అంత ఖర్చు పెట్టే స్థితిలో లేరని అన్నారు. నాలుగు ప్రాంతాల్లో ధర్మాసనాలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయసేవలు అందించాలని కోరుతామన్నారు.