మెట్రో జర్నీ..ఇలా ఈజీ!

Metro Train Project Special Story On User Guide - Sakshi - Sakshi

యూజర్‌ గైడ్‌ విడుదల చేసిన ఎల్‌అండ్‌టీ

 పది కేజీల బ్యాగేజీ వరకే పరిమితం  సులువుగా ప్రయాణించేలా సూచనలు.. సలహాలు గ్రేటర్‌ వాసుల కలల మెట్రో జర్నీకి ముహూర్తం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎల్‌అండ్‌టీ సంస్థ బుధవారం ‘యూజర్‌ గైడ్‌’ను విడుదల చేసింది. మెట్రో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ యూజర్‌గైడ్‌ను ఫాలో కావాలని సంస్థ సూచించింది. స్టేషన్లు, ఎస్కలేటర్లు, లిఫ్టుల వినియోగంపై స్పష్టంగా వివరించింది. స్టేషన్‌లోకి ఎంట్రీ నుంచి టికెట్‌ కొనుగోలు..రైలులోకి ప్రవేశించడం.. గమ్యస్థానంలో దిగడం వరకు చేయాల్సిన..చేయకూడని పనుల్ని పేర్కొంది.  ఈ గైడ్‌ను పరిశీలించడం ద్వారా నగరవాసులు ఎలాంటి ఇబ్బంది పడకుండా మెట్రో జర్నీ చేయవచ్చని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ శివానంద నింబార్గీ తెలిపారు.

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం ఎల్‌అండ్‌టీ సంస్థ బుధవారం ‘యూజర్‌ గైడ్‌’ను విడుదల చేసింది. ఆ విశేషాలు ఇలా...

స్టేషన్‌కు ఇలా చేరుకోండి:
ప్రతి స్టేషన్‌కు రోడ్డు లెవల్‌లో ఎలివేటర్లు, లిప్టులు, మెట్లు, ఎస్కలేటర్లుంటాయి. ఇక మధ్యభాగం(కాన్‌కోర్స్‌)నుంచి ప్లాట్‌ఫాం పైకి చేరుకునేందుకు సైతం ఇవే వసతులుంటాయి.
శారీరక సామర్థ్యం సరిగా ఉన్నవారు మెట్ల మార్గాన్ని వినియోగిస్తే ఇతరులకు అసౌకర్యం ఉండదు. లిఫ్టులు, ఎస్కలేటర్ల వద్ద రద్దీ తగ్గుతుంది.

ఎస్కలేటర్ల వినియోగం ఇలా...
ఎస్కలేటర్‌ గమనానికి అనుగుణంగా మీ పాదాలను ఉంచి దానిపై నిల్చోవాలి.
ఎస్కలేటర్‌పై కూర్చోవడం, నడవడం మంచిదికాదు.
ఎస్కలేటర్‌పై ప్రయాణించేటప్పుడు రెయిలింగ్‌ను పట్టుకొని భద్రంగా నిల్చోవాలి.
చిన్నారులను జాగ్రత్తగా పట్టుకోవాలి.
చీరలు, దుపట్టాలు ఎస్కలేటర్‌లో చిక్కుపడకుండా జాగ్రత్తలు పాటించాలి.
గమ్యం చేరగానే ఎస్కలేటర్‌పై నుంచి దిగి దూరంగా జరగాలి.
అత్యవసర పరిస్థితుల్లో ఎస్కలేటర్‌ను నిలిపివేసేందుకు కింద..మధ్య..పైన ఉన్న రెడ్‌బటన్‌ను నొక్కాలి.

లిఫ్టులు:
దివ్యాంగులు, వృద్ధులు, అంధుల కోసమే లిప్టులను ఏర్పాటుచేశారని మరవద్దు.
భారీ లగేజీతో వచ్చేవారు ..చిన్నారులను బేబీ కార్ట్‌లో తీసుకొచ్చేవారు, ట్రాలీ బ్యాగేజి ఉన్నవారు లిఫ్టులను వినియోగించాలి.

స్టేషన్‌లో ఏమి ఉంటాయి.....
స్టేషన్‌ లోనికి, బయటికి ప్రవేశించేందుకు మధ్యభాగంలో నాలుగు వైపులా గేట్లుంటాయి. స్టేషన్‌ను పెయిడ్, అన్‌పెయిడ్‌ ఏరియాగా విభజిస్తారు.
పెయిడ్‌ ఏరియా: ప్లాట్‌ఫాంను పెయిడ్‌ ఏరియాగా పిలుస్తారు. టిక్కెట్, టోకెన్, స్మార్ట్‌ కార్డున్నవారినే ఈ ప్రాంతానికి అనుమతిస్తారు.
అన్‌పెయిడ్‌ ఏరియా: స్టేషన్‌ కిందిభాగం(రోడ్‌ లెవల్‌), మధ్యభాగం(కాన్‌కోర్స్‌)లెవల్‌. ఇక్కడ రిటెయిల్‌ దుకాణాలు, స్టోర్లుంటాయి. ఇక్కడికి టిక్కెట్‌ అవసరం లేకుండా ఎవరైనా వెళ్లవచ్చు.

సెక్యూరిటీ చెక్‌ ఇలా...
ప్రతీ స్టేషన్‌లో ఎక్స్‌రే బ్యాగేజ్‌ స్కానర్‌
డీఎఫ్‌ఎండీ–డోర్‌ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌
పదికేజీల లగేజినిమాత్రమే మెట్రో జర్నీకి అనుమతిస్తారు.
బ్యాగు నిడివి 60 సెంటీమీటర్ల పొడవు..45 సెంటీమీటర్ల వెడెల్పు..25 సెంటీమీటర్ల ఎత్తున్న బ్యాగులనే జర్నీకి వినియోగించాలి.

ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లు...
ఎంట్రీ గేటు:స్టేషన్‌లోనికి ప్రవేశించే మార్గం
ఎగ్జిట్‌ గేటు:ప్లాట్‌ఫాం నుంచి దిగి బయటకు వెళ్లేమార్గం
బై డైరెక్షనల్‌ వైడ్‌గేట్‌: వీల్‌చైర్‌లో తరలివచ్చే దివ్యాంగులు నేరుగా ప్లాట్‌ఫాం పైకి వెళ్లేందుకు ఇవి వినియోగిస్తారు.
టోకెన్‌తో ప్రయాణించేవారు తాము దిగిన చోట టోకెన్‌ను ఎగ్జిట్‌ గేట్‌ వద్ద చూపాల్సి ఉంటుంది.

స్టేషన్‌లో దిగిన తరవాత...
స్టేషన్‌ బయటికి వెళ్లే చోట ఉన్న మ్యాప్‌ను పరిశీలించాలి. తద్వారా మీరు ఎక్కడికి ఎలా వెళ్లాలన్న విషయం స్పష్టమౌతుంది.
ఎగ్జిట్‌ గేట్‌ గుండా బయటికి వెళ్లే సమయంలో మీ వద్దనున్న స్మార్ట్‌కార్డ్, టిక్కెట్‌ లేదా టోకెన్‌ చూపాల్సి ఉంటుంది.

స్టేషన్‌ పరిసరాల్లో ఇలా..
స్టేషన్‌ కిందిభాగం(రోడ్‌లెవల్‌)లో పాదచారుల మార్గాలు, ఫుట్‌పాత్‌లుంటాయి.
ఇక్కడ సైకిల్‌లు అద్దెకు తీసుకునే సౌకర్యం ఉంటుంది.
బస్సులు, షెటిల్‌ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు నిలిపే అవకాశం ఉంటుంది.

టికెట్‌లు, టోకెన్‌లు ఇలా కొనుగోలు చేయండి
మెట్రో రైళ్లలో అప్పుడప్పుడూ ప్రయాణించేవారికి టోకెన్‌లు ఉపయుక్తంగా ఉంటాయి.  
స్టేషన్‌ మధ్యభాగం(కాన్‌కోర్స్‌)వద్ద టికెట్‌ ఆఫీస్‌ మెషిన్‌(టీఓఎం) వద్ద వీటిని కొనుగోలుచేయాలి.
టిక్కెట్‌ విక్రయ యంత్రం వద్ద మీరు చేరాల్సిన గమ్యస్థానానికి సంబంధించి టిక్కెట్‌లు తీసుకోవాలి. టోకెన్‌ యంత్రం వెనకాలే టికెట్‌ విక్రయ యంత్రం ఉంటుంది.

స్మార్ట్‌ కార్డ్‌ ఇలా తీసుకోండి...
టిక్కెట్లు, టోకెన్ల గోల లేకుండా స్మార్ట్‌ కార్డ్‌తో జర్నీ చేసేందుకు స్మార్ట్‌ కార్డ్‌ నెబ్యులా ఉపయోగపడుతుంది.
ప్రతి స్టేషన్‌ మధ్యభాగంలో ఏర్పాటుచేసిన టికెట్‌ ఆఫీస్‌ మెషిన్‌ వద్ద వీటిని కొనుగోలుచేయవచ్చు.
ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా వీటి కొనుగోలుకు అవకాశం కల్పించనున్నారు. అయితే ఆన్‌లైన్‌ చెల్లింపులకు డెబిట్, క్రెడిట్‌ కార్డులను కొనుగోలు చేయాలి.

స్టేషన్లలో అయోమయానికి తావులేదు...
ప్రతి స్టేషన్‌లో మీరు ప్రయాణించే మార్గానికి సంబంధించి నెట్‌వర్క్‌ మ్యాప్, స్టేషన్‌ లేఅవుట్, లోకల్‌ ఏరియా మ్యాప్, రైళ్ల టైమ్‌టేబుల్, ఛార్జీల పట్టిక, చేయాల్సిన, చేయకూడని పనుల చార్టులుంటాయి.
ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు..వారికి దిశానిర్దేశం చేసేందుకు సైనేజి బోర్డులను అన్ని చోట్లా ఏర్పాటు చేశారు.
అత్యవసర పరిస్థితులు, విపత్తులు సంభవించినపుడు స్టేషన్‌ నుంచి సురక్షితంగా బయటపడే విధానంపై ప్రత్యేకంగా సైనేజి బోర్డులు ఏర్పాటుచేశారు.
అంధులు నేరుగా స్టేషన్‌లోనికి చేరుకునేందుకు ప్రత్యేక టైల్స్‌తో మార్గం ఏర్పాటుచేశారు. ఈ మార్గంలో వారి చేతికర్ర ఆధారంగా నేరుగా ప్లాట్‌పాంపైకి చేరుకోవచ్చు.
స్టేషన్లు, రైళ్ల రాకపోకలపై నిరంతరాయంగా స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది.  
అత్యవసర పరిస్థితుల్లో స్టేషన్‌ కంట్రోలర్‌ను సంప్రదించవచ్చు.
రైలులోపల అత్యవసర కాల్‌బటన్‌ ఉంటుంది. ఆపత్కాలంలో ఈ బటన్‌ నొక్కడం ద్వారా ట్రైన్‌ ఆపరేటర్‌ను సంప్రదించవచ్చు.
ప్రతీ స్టేషన్‌లో కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్లు ఉంటాయి. ప్రయాణికులకు కావాల్సిన సమాచారాన్ని అందజేస్తాయి.

ప్లాట్‌ఫాంపై ఇలా...
మీ భద్రతే..మాకు అత్యంత ప్రాధాన్యం అన్న నినాదమే ఇక్కడ కనిపిస్తుంది.  
ప్రయాణికులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు.
ప్లాట్‌ఫాంపై పసుపురంగు గీతకు వెనకాలే రైలు కోసం వేచిచూడాలి. రైలు పూర్తిగా ప్లాట్‌ఫాంపై నిలిచిన తరవాతనే బోగీ డోర్లు తెరచుకుంటాయి. అప్పుడే అందులోకి ప్రవేశించాలి.
బోగీలోకి ప్రవేశించే సమయంలో క్యూ పద్ధతిని పాటించాలి. బోగీలోని ప్రయాణికులు పూర్తిగా దిగిన తర్వాతే ఇతరులు లోనికి ప్రవేశించాలి.
బోగీలో సీటు దొరకని పక్షంలో హ్యాండ్‌రైల్‌ను పట్టుకొని నిల్చోవాలి. వృద్ధులు, చిన్నారులు, మహిళలకు సీటివ్వడం ద్వారా వారికి సహకరించాలి.
మెట్రో రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉం చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.
రైలులో తినడం, తాగడం నిషిద్ధం.
ప్రతీరైలులో ముందు..వెనక భోగీలో వికలాంగులు వీల్‌చైర్‌తో సహా కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లుంటాయి.
డోర్‌క్లోజింగ్‌ లైట్‌ ఆన్‌కాగానే అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తుంది. అప్పుడే రైలు ముందుకు కదులుతుంది. డోర్లు మూసుకునే, తెరచుకునే సమయంలో వాటి మధ్యన నిలిచే ప్రయత్నం చేయరాదు.
ప్లాట్‌ఫాంపై ప్రయాణికులను గైడ్‌ చేసేందుకు మెట్రో సిబ్బంది సదా అప్రమత్తంగా ఉంటారు.

మెట్రో రైలు సిటీలో స్పీడ్‌గా పరుగులు పెడుతోంది. ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ట్రయల్‌ రన్‌లు పెరిగాయి. బేగంపేట–సికింద్రాబాద్‌ రూట్లో బుధవారం పగలు.. రాత్రీ మెట్రో రైలు దృశ్యాలు ఇలా సాక్షి కెమెరాకు చిక్కాయి...

మెట్రో మెరుపులు...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top