ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు.
8న బయలుదేరనున్న సీఎం కేసీఆర్
సీఎం వెంట ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్
తొమ్మిది రోజుల పాటు సీఎంవో ఖాళీ
రెండోసారి సీఎం విదేశీ ప్రయాణం
రూ. 2.03 కోట్ల ముందస్తు చెల్లింపులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు. గతంలో ఒకసారి సింగపూర్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ ఈసారి చైనాకు ప్రత్యేక విమానంలో వెళ్లాలని నిర్ణయించారు. దీనికి రూ.2.03 కోట్లు ముందస్తుగా చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్‌కు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే ఖరారైన షెడ్యూలు ప్రకారం ఈనెల 8 నుంచి 16 వరకు తొమ్మిది రోజులపాటు ఈ పర్యటన సాగుతుంది. పలుదేశాలు పాల్గొనే సదస్సులో ప్రసంగించేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించిన విషయం విదితమే. కేసీఆర్ వెంట సీఎంవోలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు సైతం చైనాకు వెళ్లనున్నారు. దీంతో 9 రోజల పాటు సీఎంవో ఖాళీ కానుం ది. సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ ఈ పర్యటనకు బయల్దేరనున్నారు. వీరందరు చైనాకు వెళ్లేందుకు అనుమతి తెలపటంతో పాటు అందుకయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎస్ రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులతో పాటు పలువురు మంత్రులు చైనాకు వెళ్లే అవకాశముంది. సీఎం హోదాలో కేసీఆర్ విదేశీయానానికి వెళ్లడం ఇది రెండోసారి.
పర్యటన ఇలా..: 8వ తేదీన ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తన బృందాన్ని వెంట బెట్టుకొని హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరుతారు. రాత్రి డేలియన్‌కు చేరుకుంటారు. 9వ తేదీన అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. 10న ఉదయం అక్కణ్నుంచి షాంఘై చేరుకుంటారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో ముఖాముఖిలో పాలుపంచుకుంటారు. మరుసటి రోజున షోజ్‌హో ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శిస్తారు. 11న సాయంత్రం షాంఘై నుంచి బయల్దేరి బీజింగ్ చేరుకుంటారు. 14న షెంజెన్ ఇండస్ట్రియల్ పార్కును సందర్శిస్తారు. అక్కణ్నుంచి హాంగ్‌కాంగ్ మీదుగా 16వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. తన పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతానని సీఎం ఇటీవలే ప్రకటించారు. అందుకు అనుగుణంగా పర్యటనలో స్వల్ప మార్పులుండే అవకాశముంది.