హెల్త్‌ హబ్‌గా హైదరాబాద్‌..

Hyderabad as a Health Hub - Sakshi

నగరంలో నాణ్యమైన వైద్య సేవలు  

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల వెల్లడి

లక్డీకాపూల్‌: నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడంలో హైదరాబాద్‌ ముందంజలో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కొనియాడారు. అనేక దేశాలకు చెందిన రోగులు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని పొందేందుకు నగరానికి వస్తున్నారన్నారు. బుధవారం సోమాజిగూడలో నిమ్స్‌ సర్జికల్‌ ఆంకాలజీ విభాగం మాజీ అధిపతి డా.జి.సూర్యనారాయణ రాజు ఏర్పాటు చేసిన అశ్విని స్పెషాలిటీ హాíస్పిటల్‌ను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా విరాజిల్లుతోందని అన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిమ్స్‌ ఆస్పత్రి హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణమన్నారు. నిమ్స్‌ ద్వారా లక్షలాది మంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. అలాంటి ఆస్పత్రిలో సేవలందించిన డాక్టర్‌ జీఎస్‌ఎన్‌ రాజు కేన్సర్‌ రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న గొప్ప ఆశయంతో అశ్విని స్పెషాలిటీ హాస్పటల్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామం అని అన్నారు.

జీవన విధానంలో మార్పుల వల్లే వ్యాధులు.. 
జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల పలువురు వ్యాధుల బారిన పడుతున్నారని ఈటల అభిప్రాయపడ్డారు. అందువల్లే చాలా మంది కేన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వంటి పలు సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం రూ.లక్షలు ఖర్చు పెట్టినా రోగిని బతికించుకునే పరిస్థితులు లేవని వాపోయారు. ఈ నేపథ్యంలో జెనిటిక్‌ మార్కులర్‌ విధానంలో కేన్సర్‌ను నిర్ధారించి వైద్యం అందించడంలో అశ్విని హాస్పిటల్‌ కృషి చేస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదలకు సైతం అత్యున్నత ప్రమాణాలతో వైద్యాన్ని అందించే అశ్విని ఆసుపత్రికి ప్రభుత్వపరంగా సహకారం ఉంటుందని చెప్పారు. డాక్టర్‌ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోనే జన్యుపరమైన పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కేన్సర్‌ వ్యాధిని గుర్తించేందుకు ఉపయోగించే మార్కులర్, జెనిటిక్‌ టెస్టులను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, అశ్విని హాస్పటల్‌కు చెందిన పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top