ఎకరం లేఅవుట్‌ ఏదీ ఆదాయం?

HMDA Loss With Layout in Hyderabad - Sakshi

హెచ్‌ఎండీఏకు రాని రాబడి  

పంచాయతీల సహకారలేమి  

రెండేళ్లలో కేవలం రూ.30కోట్లు  

పంచాయతీలు సహకరిస్తే భారీ ఆదాయం  

సాక్షి, సిటీబ్యూరో: అక్రమ లేఅవుట్‌లకు ముకుతాడు వేసేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రవేశపెట్టిన ‘ఎకరం లేఅవుట్‌’ అనమతులకు గ్రామ పంచాయతీల నుంచి పూర్తిస్థాయిలో సహకారం లేకపోవడంతో ఆశించినంత ఆదాయం రావడం లేదు. విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నా.. వాటిని హెచ్‌ఎండీఏ దృష్టికి తీసుకురావడంలో పంచాయతీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండడంతో ఇరు విభాగాల ఖజానాకు భారీగానే గండిపడుతోంది. కాసుల కక్కుర్తికి ఆశపడి కొంతమంది పంచాయతీ అధికారులు అక్రమ లేఅవుట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ‘ఎకరం లేఅవుట్‌ అనుమతి’ ప్రక్రియతో అనుకున్నంత రాబడి రావడం లేదు. రెండేళ్లలో 65 లేఅవుట్లకు అనుమతులివ్వగా, రూ.30 కోట్ల ఆదాయం వచ్చింది. 2031 మాస్టర్‌ ప్లాన్‌ నిబంధనల ప్రకారం 10 ఎకరాలు ఉంటేనే లేఅవుట్‌కు అనుమతి ఇవ్వాలి. ఈ నిబంధనలతో 10 ఎకరాలలోపు స్థలంలోనే అత్యధికంగా అక్రమ లేఅవుట్లు వెలిసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. ఇది గుర్తించిన హెచ్‌ఎండీఏ కమిషనర్, ప్లానింగ్‌ విభాగ డైరెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఎకరానికి లేఅవుట్‌ అనుమతి ఇస్తే ఈ మోసాలు తగ్గుతాయని పేర్కొనడంతో... అధ్యయనం చేసిన ప్రభుత్వం జీవో 288, 33 ప్రకారం ఎకరానికి లేఅవుట్‌ అనుమతి మంజూరు చేయొచ్చని హెచ్‌ఎండీఏకు అధికారాలు కట్టబెట్టింది. అయితే ఇప్పటివరకు హెచ్‌ఎండీఏకు ఎకరం లేఅవుట్‌లలో వచ్చిన ఆదాయంలో ఎక్కువగా పటాన్‌చెరు, అబ్దుల్లాపూర్‌మెట్, అమీన్‌పూర్, దుండిగల్, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఘట్‌కేసర్, కీసర, రామచంద్రాపురం, మేడ్చల్, బీబీనగర్, బాలాపూర్, శామీర్‌పేట, కొంపల్లి, ఆదిభట్ల, మేడిపల్లి, సంగారెడ్డి మండలాల పరిధిలోని ప్రాంతాలు ఉన్నాయి. 

ఆ అనుమతి ఉంటే...  
జీవో 288, 33 ప్రకారం ఎకరంలో 30 ఫీట్ల వెడల్పున్న రోడ్లు, 30 శాతం ల్యాండ్‌ ఏరియా కింద పాటించాలి. కనీసం 10 శాతం ఓపెన్‌ స్పేస్‌  వదలాలనే నిబంధన ఉంది. రోడ్లు, ఫుట్‌పాత్, డ్రైనేజీ, నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ, కమ్యూనిటీ అవసరాలు, రోడ్ల వెంబడి చెట్లు, పార్కులు, ఆట స్థలాలు అభివృద్ధి చేసిన తర్వాతనే హెచ్‌ఎండీఏ ఫైనల్‌ లేఅవుట్‌ అనుమతి ఇస్తుంది. అయితే ఎకరానికి 4,880 గజాలు ఉండగా... అన్ని అభివృద్ధి చేయగా మిగిలిన 2,800 గజాల వరకు విక్రయించుకోవచ్చు. తొలి లేఅవుట్‌ ఇచ్చే సమయంలో 15శాతం భూమిని హెచ్‌ఎండీఏ మార్ట్‌గేజ్‌ కింద పెట్టుకొని ఇస్తుంది. ఎందుకంటే ఈ లేఅవుట్‌ చూపించి ప్లాట్లు అమ్ముకొని వెళ్లిపోకుండా ఉండేందుకు ఈ నిబంధన ఉంచారు. అభివృద్ధిపై నిర్ధారణకు వచ్చాకే ఫైనల్‌ లేఅవుట్‌ మంజూరు చేస్తుంది. ఆ తర్వాత ఈ లేఅవుట్‌ యజమానులు గ్రామ పంచాయతీకి కూడా రూ.50వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా హెచ్‌ఎండీఏ ద్వారా ఆమోదం పొందిన లేఅవుట్‌లో గజం ధర మార్కెట్‌ ధరతో పోలిస్తే దాదాపు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అధికంగా ఉంటుంది. కొనుగోలుదార్లు కూడా హెచ్‌ఎండీఏ అనుమతి ఉండి మౌలిక వసతులు ఉండటంతో మార్కెట్‌ కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మార్కెట్‌ను బట్టి ఫీజు...
ఉదాహరణకు పుప్పలగూడ, నార్సింగి, మణికొండ ప్రాంతాల్లో ఎకరం లేఅవుట్‌ మంజూరుకు హెచ్‌ఎండీఏ రూ.8లక్షల వరకు ఫీజు వసూలు చేస్తోంది. అదే సంగారెడ్డిలోని మండలాల్లో ఎకరం లేఅవుట్‌ పర్మిషన్‌కు రూ.5లక్షల వరకు ఉంటుంది. అయితే హెచ్‌ఎండీఏ పరిధిలో ఎకరం లేఅవుట్‌ పర్మిషన్‌ కోసం రూ.5లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇకనైనా గ్రామ పంచాయతీ అధికారులు మేల్కొని తమ పరిధిలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్‌లను హెచ్‌ఎండీఏ దృష్టికి తీసుకొస్తే భారీగా ఆదాయం పెరుగుతుందని పేర్కొంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top