ఔటర్‌పై జెట్‌స్పీడ్‌

High Speed on ORR Hyderabad - Sakshi

గంటకు 229 కి.మీ. వేగంతో వాహనదారుల దూకుడు

హైస్పీడ్‌ ఉల్లంఘనలు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైనే అత్యధికం

ఈ ఏడాదిలో రెండు కమిషనరేట్లలో రెండున్నర లక్షల ఉల్లంఘనలు

సాక్షి, సిటీబ్యూరో: ‘2018 అక్టోబర్‌ 12 ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పెద్దఅంబర్‌పేట నుంచి శంషాబాద్‌ విమానాశ్రయ మార్గంలో ఓ కారు వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోకి వచ్చే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) పాయింట్‌ వద్ద గంటకు 229 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్నట్టుగా స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలకు చిక్కింది.’‘2019 మే రెండో తేదీన మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పెద్దఅంబర్‌పేట మార్గంలో ఓ కారు అధిక వేగంతో దూసుకెళుతూ శంషాబాద్‌ ట్రాఫిక్‌ ఠాణా పరిధిలోకి వచ్చే హర్షగూడ  ప్రాంతంలో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్టుగా స్పీడ్‌ లెజర్‌ గన్‌ కెమెరాకు చిక్కింది’.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై వాహనాలు వాయు వేగంతో దూసుకెళుతున్నాయి. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌పైకి వాహనం ఎక్కితే చాలు కంటికి కనిపించని వేగంతో దూసుకెళుతుండటంతో తోటి వాహనదారులు హడలెత్తిపోతున్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నిర్ణయించినా వాహనదారులు మాత్రం అంతకు రెట్టింపు వేగంతో దూసుకెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా ఈ ఏడాది నాలుగు నెలల్లో సైబరాబాద్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌లో 1,26,135, రాచకొండ పరిధిలోని ఓఆర్‌ఆర్‌లో 1,39,201 ఈ–చలాన్‌ కేసులు నమోదవడం వాహనదారుల వాయువేగానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇతర రహదారులతో పోలిస్తే ఓఆర్‌ఆర్‌పైనా అత్యధికంగా హైస్పీడ్‌ ఉల్లంఘనలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 

ఉల్లంఘనల్లో కార్లదే హవా...
ఇరు కమిషనరేట్ల పరిధిలోని 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లో రోజుకు లక్షన్నర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో పాటు నగరానికి చెందిన వాహనాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కొన్ని సందర్భాల్లో టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇదే క్రమంలో ఓఆర్‌ఆర్‌ ఎక్కితే చాలా వరకు వాహనాలు తమ గమ్యస్థానికి తొందరగా వెళ్లేందుకు వాయు వేగంతో తాపత్రయపడుతున్నారు. అయితే హెవీ వెహికల్స్‌ కంటే ఎక్కువగా కార్లే ఉల్లంఘనల్లో మొదటిస్థానంలో ఉన్నాయి. ఓఆర్‌ఆర్‌పై జరుగుతున్న ప్రమాదాల్లోనూ ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. అత్యధికంగా పెద్దఅంబర్‌పేట–శంషాబాద్‌ మార్గంతో పాటు శంషాబాద్‌–గచ్చిబౌలి మార్గంలో వాహనాలు ఓవర్‌స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. 

నాలుగు నెలలకు రూ.27 కోట్ల పైనే జరిమానా
అధిక వేగంతో వెళుతున్న వాహనాలు స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలకు చిక్కుతున్నా వేగం మాత్రం మారడం లేదు. సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఇంటికి చలాన్లు పంపుతున్నారు. ఇలా నాలుగునెలల్లో రూ.27 కోట్ల జరిమానాతో చలాన్లు జారీ చేశారు. అయినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అయితే గతంతో పోల్చుకుంటే ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అధికారులు చెబుతున్నా మాట వాస్తవమే అయినా ఒకవేళ ప్రమాదం జరిగితే మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు మితీమిరిన వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. అధిక వేగం వద్దు...ప్రాణం ముద్దు అని ఓఆర్‌ఆర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాల్లో హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాహనదారుల్లో మాత్రం ఆశించినంత మార్పు కనిపించడం లేదంటున్నారు.

మూడేళ్లలో రూ.122 కోట్లు
ఇరు కమిషనరేట్ల పరిధిలోని ఓఆర్‌ఆర్‌లో 2017, 2018, 2019 సంవత్సరాల్లో అధిక వేగంతో దూసుకెళుతున్న వాహనాలకు 10,05,196 ఈ–చలాన్‌లు జారీ చేశారు. ఆయా వాహనాలకు వేసిన జరిమానా ఏకంగా రూ.122 కోట్లపైనే ఉందంటే వాహనదారుల వేగం ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది. అలాగే ఈ సమయంలో ఓఆర్‌ఆర్‌పైనా 358 రోడ్డు ప్రమాదాలు జరిగితే 110 మంది మృత్యువాత పడ్డారు. వందలా మంది క్షతగాత్రులయ్యారు. అందుకే ఓవర్‌ స్పీడ్‌ తగ్గిస్తే వాహనదారుల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని పోలీసులు సూచిస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top