
సాక్షి, హైదరాబాద్: కొలువుల కొట్లాట.. పేరుతో సభ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఎల్బీనగర్ పోలీసులకు టీజేఏసీ మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. టీజేఏసీ దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోగా సభకు అనుమతి మంజూరుపై సహేతుక కారణాలతో తగు నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎల్బీనగర్ జోన్ డీసీపీని హైకోర్టు ఆదేశించింది. కొలువుల కొట్లాట పేరిట గత నెల 31న బహిరంగసభకు అనుమతి కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే ఏదో ఒక సాకు చూపించి అనుమతి ఇవ్వడం లేదని టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరామ్, టీజేఏసీ కో కన్వీనర్ గోపాల్‌శర్మలు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు.
నిజాం కాలేజీ మైదానం, ఎన్టీఆర్ గ్రౌండ్, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, ఎల్బీనగర్–ఉప్పల్ మధ్య ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఏదో ఒకచోట కొలువుల కొట్లాట సభ నిర్వహించేందుకు అనుమతి కోరినా పోలీసుల నుంచి సానుకూల స్పందన లేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి తన నిర్ణయంలో.. ‘కొలువుల కొట్లాట సభ నిర్వహించే తేదీ, సమయం, ప్రదేశం, ఎంతమంది హాజరవుతారు, వాహనాలు, ఇతర వివరాలతో పోలీసులకు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చునని’ అన్నారు. దరఖాస్తుతోపాటు హైకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రతిని జత చేయాలన్నారు. టీజేఏసీ దరఖాస్తు చేసుకుంటే దానిని ఎల్బీనగర్ డీసీపీ పరిశీలించి సభకు అనుమతిపై ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు.