
సాక్షి, హైదరాబాద్: కొలువుల కొట్లాట బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం (8న) హైకోర్టు నిర్ణయం వెలువడనుంది. సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం, మరొక వ్యక్తి వేర్వేరుగా సవాల్ చేస్తూ దాఖలు చేసిన 2 వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు సోమవారం ముగిశాయి. దీంతో నిర్ణయాన్ని 8న వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ ప్రకటించారు.
కారణాలు చెప్పకుండా సభకు అనుమతి నిరాకరణ అన్యాయమని, సభలకు అనుమతి మంజూరు అంశాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్ కోరారు. ఇండోర్ స్టేడియంలో సభలకు అనుమతిస్తే మైదానం దెబ్బతిని క్రీడల నిర్వ హణకు సమస్యలు తలెత్తుతాయని, ఎన్టీఆర్ గ్రౌండ్‌లో సభకు పిటిషనర్లు పోలీసులకు దరఖాస్తే చేయలేదని పోలీసుల తరఫున న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ చెప్పారు. టీజేఏసీ పట్ల ప్రభుత్వానికి వివక్ష, కక్ష లేదన్నారు.