రుణవిమోచన కమిషన్‌ ఏదీ? | Sakshi
Sakshi News home page

రుణవిమోచన కమిషన్‌ ఏదీ?

Published Sat, Dec 9 2017 2:30 AM

High Court question to the state government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులు, వ్యవసాయ కూలీలు తదితరులకు సంబంధించిన రుణ విమోచన కమిషన్‌ను మూడు నెలల్లో ఏర్పాటు చేయాలంటూ ఆగస్టు 21న తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. తమ ఆదేశాలను అమలు చేయనందుకు ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర రుణ విమోచన చట్టం–2016లోని సెక్షన్‌ 3(1) ప్రకారం రైతులు, వ్యవసాయ కూలీల కోసం కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. మూడు నెలల్లో రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ఇప్పటి వరకు అమలు చేయలేదంటూ ప్రభుత్వంపై ఇంద్రసేనారెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది.

అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు
మరో రెండు కోర్టు ధిక్కార వ్యాజ్యాల్లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ రజత్‌ కుమార్, మరో నలుగురు అటవీ శాఖ అధికారులకు కూడా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వరంగల్‌ అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్, ఆరు ద్విచక్రవాహనాలను విడుదల చేయాలంటూ ఓ కేసులో హైకోర్టు గత ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను అధికారులు ఇప్పటి వరకు అమలు చేయలేదంటూ బి.స్వామి, మరికొందరు కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. 

Advertisement
Advertisement