గ్రేటర్‌.. ఎవర్‌గ్రీన్‌ ఎప్పుడో!

Haritha Haram Programme Delayed In Hyderabad - Sakshi

హరితహారం ఓ కఠిన పరీక్షే

పంపిణీ చేసే మొక్కల్లో 95 శాతం ఇళ్లల్లో పెరిగేవే..

బహిరంగ ప్రదేశాల్లో కేవలం ఐదు శాతం మొక్కలే

సిటీలో ప్రతి వ్యక్తికి తలసరిగా 28 చెట్లు మాత్రమే

గ్రేటర్‌లో గ్రీన్‌బెల్ట్‌ 8 శాతం

మెట్రో నగరాల్లో మనకుఏడోస్థానం..

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ నగరం గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించాల్సిన తరుణం ఆసన్నమైంది. కోటి జనాభాను మించిన సిటీలో తలసరిగా ప్రతి వ్యక్తికీ వంద చెట్లుండాల్సిన అవసరం ఉండగా..కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ తరుణంలో మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమం తలపెట్టింది. అయితే ఈ కార్యక్రమం గ్రీన్‌బెల్ట్‌ వృద్ధికి అంతగా దోహదం చేయదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా హరితహారంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 40 లక్షల మొక్కలు, హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 2.6 కోట్ల  మొక్కలను నాటాలని నిర్ణయించిన విషయం విదితమే.

ఇందులో ప్రధానంగా ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను సుమారు 95 శాతం పంపిణీ చేయనున్నారు. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు,  ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్‌ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఇంటిలో మొక్కలు నాటడం ద్వారా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని..అయితే తాజా కార్యక్రమంతో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో గ్రీన్‌బెల్ట్‌ 8 శాతం నుంచి 15 శాతానికి పెరగడం అసాధ్యమని స్పష్టంచేస్తుండడం గమనార్హం. గ్రీన్‌బెల్ట్‌ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో మహానగరం ఏడోస్థానంలో నిలిచిందని పేర్కొంటున్నారు.

పలు మెట్రోనగరాల్లో హరితం ఇలా ఉంది...
దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో చంఢీగడ్‌ తొలిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో నిలిచిన దేశరాజధాని ఢిల్లీలో 20.20 శాతం, గ్రీన్‌ సిటీగా పేరొందిన బెంగళూరులో 19 శాతం, కోల్‌కతాలో 15 శాతం, ముంబయిలో పదిశాతం, చెన్నైలో 9.5 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. మన నగరంలో హరితం 8 శాతానికే పరిమితమవడం గమనార్హం.

హెచ్‌ఎండీఏ పరిధిలో..
గతేడాది హెచ్‌ఎండీఏ పరిధిలో 95 లక్షల మొక్కలు నాటగా.. ఇందులో 50 శాతమే మొక్కలు బతికాయి. ఇక ఈ సీజన్‌ మొత్తంగా 2.06 కోట్ల మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులోనూ సుమారు 90 శాతం ఇళ్లలో పెరిగేవే కావడం గమనార్హం. తులసి, అశ్వగంధ, అలోవెరా, కలబంద, లెమన్‌గ్రాస్, లావెండర్, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, వేప, నందివర్ధనం, జాస్మిన్, మందారం తదితర వెరైటీలతో పాటు రాయల్‌ ఫామ్స్, రెయిన్‌ ట్రీ, ఫింట్లోఫారం, గుల్‌ మొహర్, మెల్లిన్‌ టోనియా, మెయిన్‌ క్యారేజ్‌ వైపు బహునియా, క్యాషియా, పిస్టియా, అర్జెంటీయా తదితర 40 రకాల మొక్కలను నాటనున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులు, ఔటర్‌రింగ్‌రోడ్డు పరిధిలో సుమారు 40 లక్షలు మొక్కలు నాటాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఇక హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి పొందిన లే అవుట్లలో సుమారు 35 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో...
625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్‌ఎంసీ పరిధిలో గతేడాది సుమారు కోటి మొక్కలు నాటగా..ఇందులో సుమారు 50 శాతం మొక్కలే బతికాయి. ఈ సారి సుమారు 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో ఇళ్లకు పంపిణీచేసే తులసి, కలబంద, క్రోటన్, పూల మొక్కల వంటి చిన్నమొక్కలు 35 లక్షలుండడం గమనార్హం. మిగతా వాటిని ఖాళీప్రదేశాలు, చెరువులు, పార్కుల వద్ద నాటాలని నిర్ణయించారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్దమొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతుండడం గమనార్హం.

హరిత హననం.
భాగ్యనగరంలో ఇపుడు హరిత వాతావరణం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడంతో కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన నగరంలో హరిత వాతావరణం క్రమేణా కనుమరుగయి పర్యావరణం త్వరగా వేడెక్కుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 30 శాతం గ్రీన్‌బెల్ట్‌(హరిత వాతావరణం)ఉండాల్సి ఉండగా..నగరంలో కేవలం 8 శాతమే గ్రీన్‌బెల్ట్‌ ఉండడంతో నగరంలో ప్రాణవాయువు కనుమరుగై సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  

ఇలా చేస్తే మేలు..  
నగరంలోని ప్రధాన రహదారులు,  చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్‌ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగాతగ్గుతుంది.
సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంతవిస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని,ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్‌ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి.
నూతనంగా ఏర్పడిక కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చేసమయంలో ఈవిషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి.
హరితంతో కాలుష్యం దూరం..దూరం..
చెట్ల ఆకులు వాతావరణంలోని కార్భన్‌డయాౖMð్సడ్,సూక్ష్మధూళికణాలను గ్రహించి ఆక్సీజన్‌ను విడుదల చేస్తుండడంతో పీల్చేగాలిలో ఆక్సీజన్‌ మోతాదు పెరుగుతుంది. చెట్లు ఎయిర్‌ఫిల్టర్లుగా పనిచేస్తాయని అందరూ గ్రహించాలి.
చెట్లు చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా విద్యుత్‌ వంటి ఇంధనాన్ని ఆదాచేస్తాయి. కాలుష్య ఉద్గారాలను బాగా తగ్గిస్తాయి.

హరితం హననం..మనుగడ గగనం..
గ్రేటర్‌ నగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అంటే 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. సిటీలో హరితం శాతం 8 మాత్రమే. అంటే మహానగరంలో సుమారు 12,320 ఎకరాల్లో హరితవాతావరణం(గ్రీన్‌బెల్ట్‌)అందుబాటులో ఉంది. దీన్ని 24,710 ఎకరాలకు పెంచాల్సి ఉంది. అంటే మొత్తం నగర విస్తీర్ణంలో హరితం శాతం కనీసం 16 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

ఇళ్లలో నాటే మొక్కలతోగ్రీన్‌బెల్ట్‌ పెరగదు
హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్‌ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి, ఆక్సిజన్‌ అందించేవి, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప,రావి,మర్రి,మద్ది,చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్‌ పెరిగి నగరంలో ఆక్సీజన్‌శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. తాజా హరితహారంతో నర్సరీల నిర్వాహకులకే లాభం చేకూరుతోంది.  – జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top