
బంగారు తెలంగాణే లక్ష్యం : స్పీకర్
దశాబ్దాల సీమాంధ్ర పాలనలో దగా పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా పునర్నిర్మాణం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని శాసన సభాపతి సిరికొండ మధుసూధనాచారి అన్నారు.
చిట్యాల : దశాబ్దాల సీమాంధ్ర పాలనలో దగా పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా పునర్నిర్మాణం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని శాసన సభాపతి సిరికొండ మధుసూధనాచారి అన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా శుక్రవారం చిట్యాల మండలంలోని దూత్‌పల్లిలోని ఎర్రచెరువు, ఒడితలలోని ఊరకుంట చెరువు, భావుసింగ్‌పల్లి గ్రామంలోని లోతుకుంట చెరువు పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు.
అనంతరం రూ.1.48 కోట్లనిధులతో గోపాలపురం నుంచి శ్యాంనగర్ వరకు బిటీరోడ్డు నిర్మాణానికి, రూ.48లక్షలతో జడల్‌పేట నుంచి భావుసింగ్‌పల్లి వరకు రోడ్డుకు, రూ.37లక్షలతో భావుసింగ్‌పల్లి నుంచి చెంచు కాలనీ వరకు, రూ.95 లక్షలతో వెలిశాల నుంచి జోడుపల్లి వరకు, రూ.65 లక్షలతో ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ద్వారకపేట వరకు, రూ. 1.74 కోట్లతో వెల్లంపల్లి నుంచి ఏంపేడు వరకు, రూ. 37 లక్షలతో వెల్లంపల్లి నుంచి నగరం వరకు, రూ.57 లక్షలతో ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి జూకల్లు వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను క్రమంగా నెరవేర్చడం జరుగుతోందన్నారు. కాకతీ యుల ఘనకీర్తిని ప్రపంచానికి చాటేలా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపడుతున్నామన్నారు. అవినీతి రహిత పనులకు రైతులు, యువజన సంఘాలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల పాలనలో పాలేరుగా ప్రజలకు సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఒడితల గ్రామ శివారులోని చెంచుకాలనీ వాసులతో స్పీకర్ మాట్లాడారు.
కాలనీలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించా రు. ఎంపీపీ బందెల స్నేహలత, జెడ్పీటీసీ సభ్యులు కాట్రేవుల సాయిలు, భూపాలపల్లి ఎంపీపీ రఘుపతిరావు, గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు ముక్కెర రమేష్, రాసూరి ప్రమీల, పట్టెం సరోజన, తీర్తాల విజయ, ఎరుకొండ యమున తదితరులు పాల్గొన్నారు.